తెలంగాణ ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గుతోంది

తెలంగాణ ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గుతోంది
  •  
  • ఆర్​బీఐ రిపోర్టులో వెల్లడి 
  • గ్రామాల్లో బాగా పడిపోయినట్టు ప్రకటన
  • నిత్యావసరాల ధరలు పెరగడమే కారణం
  • భారీగా పెరిగిన రాష్ట్ర ప్రభుత్వ అప్పులు.. 


హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గుతోంది. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరగడం.. జనాలపై తీవ్ర ప్రభావం చూపెట్టినట్లు ఆర్​బీఐ జూన్​ రిపోర్ట్​లో వెల్లడించింది. ఏప్రిల్​తో చూస్తే మేలో కొనుగోలు శక్తి పడిపోయినట్లు వివరించింది. పట్టణాల్లో కంటే ఈ పరిస్థితి పల్లెల్లో ఎక్కువగా ఉంది. ఇతర రాష్ట్రాలతోనూ పోల్చితే తెలంగాణ కాస్త డేంజర్​జోన్​లో ఉన్నది. అంతకు ముందు నెలలో 7% ద్రవ్యోల్బణం ఉంటే, మేలో 8% మించిన విషయాన్ని ఆర్​బీఐ రిపోర్ట్​లో ప్రస్తావించింది. నిరుద్యోగం, నిత్యావసరాల ధరలు పెరిగిన దానికి తగ్గట్టు జీతాలు పెరగకపోవడం ఇందుకు కారణంగా తెలిపింది. 

పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న నెలల్లో కొనుగోలు శక్తి మరింత పడిపోయే ప్రమాదం ఉందని ఆర్​బీఐ పేర్కొంది. కరోనా తర్వాత జనాలు ఖర్చు చాలా తగ్గించుకున్నారు. ఏదైనా సడన్​గా అవసరం వస్తే ఎలా అనే ముందు ఆలోచనతో డబ్బులు ఖర్చు చేయడం ఆపేశారు. 6 నెలల కిందటి నుంచే మళ్లీ మార్కెట్ ​పుంజుకుంది. అదే టైంలో బియ్యం, వంట నూనె, ఉప్పులు, పప్పుల ధరలు, కూరగాయలు, టమాట, ఆలుగడ్డలతో  పాటు పెట్రోల్​, డీజిల్​ధరల పెరుగుదల.. సామాన్య జనాలపై తీవ్ర ప్రభావం చూపినట్లు పేర్కొన్నది. 

ఐదేండ్లలో జీఎస్​డీపీలో 29.8 శాతానికి అప్పులు

రానున్న ఐదేండ్లలో తెలంగాణ అప్పులు రాష్ట్ర జీఎస్​డీపీలో సుమారు 30 శాతానికి చేరుకుంటాయని ఆర్​బీఐ హెచ్చరించింది. ఇప్పటికే తెలంగాణ భారీగా అప్పులు చేయడమే కాకుండా.. కరోనా తర్వాత మరింత అప్పులు చేయడం ప్రారంభించిందని పేర్కొంది. 2019–20 నుంచి 2026–27 నాటికి 6.2 శాతం పెరుగుదలతో 29.8 శాతానికి చేరుతుందని వెల్లడించింది. అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణలోనే జీఎస్​డీపీలో అప్పుల శాతం ఎక్కువగా పెరుగుతున్నట్లు పేర్కొంది. వాస్తవానికి రాష్ట్ర అప్పులు జీఎస్​డీపీలో 25 శాతం మించకూడదు. ఎఫ్​ఆర్​బీఎం పరిధి తప్పించుకుని కార్పొరేషన్ల పేర్లతో చేసిన అప్పులు అంతకు మించిపోయినట్లు ఫైనాన్స్​ఎక్స్​పర్ట్స్​ చెబుతున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు ఆర్​బీఐ కార్పొరేషన్ల పేరుతో చేసే అప్పులకు నిబంధనలను కఠినతరం చేసింది. ఎఫ్​ఆర్​బీఐం పరిధిలో చూపే అప్పులే ఈ ఏడాది అంచనాలతో కలిపితే రూ.3.44 లక్షల కోట్లకు చేరనుంది. బడ్జెటేతర అప్పులు లక్షన్నర కోట్లకు చేరువలో ఉన్నాయి.

ఇతర మార్గాల్లో అప్పు తీసుకున్న రాష్ట్రం

ఏప్రిల్​లో బాండ్ల వేలం పాటలో రాష్ర్టానికి అనుమతి లేకపోవడంతో ఆర్బీఐ నుంచి అప్పు పుట్టలేదు. దీంతో రాష్ట్ర సర్కార్​ ఇతర మార్గాల ద్వారా అప్పును తీసుకున్నది. ఆ ఒక్క నెలలోనే స్పెషల్ ​డ్రాయింగ్​ఫెసిలిటీ, వేస్​ అండ్ ​మీన్స్​అడ్వాన్సెస్​, ఓవర్​ డ్రాప్ట్ ల కింద రూ.2,327 కోట్లు తీసుకున్నట్లు రిపోర్ట్​లో పేర్కొంది. మేలోనూ ఆర్​బీఐ అప్పు పుట్టకపోవడంతో మళ్లీ ఇవే మార్గాలను వినియోగించుకుని నిధులు సమకూర్చుకుంది. ఇతర ఏ రాష్ట్రాలు ఇలా అప్పు తీసుకోలేదు. బాండ్ల వేలంలో కాకుండా ఇతర ఫెసిలిటీల రూపంలో తీసుకున్న అప్పును పరిమిత కాలంలోనే ప్రభుత్వం తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.