చెరువుల్లో పోసే చేప పిల్లల్లో క్వాలిటీ లేదు

చెరువుల్లో పోసే చేప పిల్లల్లో క్వాలిటీ లేదు

సూర్యాపేట, వెలుగు: చెరువుల్లో పెంచేందుకు సర్కారు ఫ్రీగా సప్లై చేస్తున్న చేపపిల్లల నాణ్యత అధ్వానంగా ఉంటోంది. అసలే అదును దాటిన తర్వాత పంపిణీ చేస్తున్న చేపపిల్లల సైజు, సంఖ్య తక్కువగా ఉండడంపై మత్స్యకారులు మండిపడ్తున్నారు. 35 మిల్లీ మీటర్ల నుంచి 40 మిల్లీ మీటర్ల సైజ్ గల చేప పిల్లలను వదిలితేనే చెరువుల్లో బతికే అవకాశముంటుంది. కానీ కాంట్రాక్టర్లు 10 ఎంఎం, 15ఎంఎం సైజు పిల్లల్నే సప్లై చేస్తున్నారు. కొన్నిచోట్ల చచ్చిన చేపపిల్లలనూ పోస్తున్నారు. కాంట్రాక్టర్లలో చాలా మంది టీఆర్ఎస్​ లీడర్లే కావడంతో ఆఫీసర్లు పట్టించుకోవడం లేదని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. చెప్పే సంఖ్యలో, తెస్తున్న పిల్లలు పదోవంతు కూడా ఉండకపోవడంతో ఎక్కడికక్కడ ఆందోళనకు దిగుతున్నారు. 

చిన్న సైజ్ పిల్లల పంపిణీ.. 

రాష్ట్ర ప్రభుత్వం ఏటా100 శాతం సబ్సిడీతో చేప పిల్లలను సప్లై చేస్తోంది. 2022 –23 సంవత్సరానికి రాష్ట్ర వ్యాప్తంగా 26,778 నీటి వనరుల్లో రూ.88.53 కోట్లతో 68 కోట్ల చేప పిల్లలను, రూ.24.50 కోట్లతో 275 నీటి వనరుల్లో 10 కోట్ల రొయ్య పిల్లలను విడుదల చేస్తున్నట్లు సర్కారు ప్రకటించింది. సెప్టెంబర్ మొదటి వారంలో చేపపిల్లలను పంపిణీ చేస్తామని చెప్పినా చాలా జిల్లాల్లో టెండర్లు ఫైనల్​కాక, ఇతరత్రా సమస్యలతో పంపిణీ లేటయ్యింది. చేపల పంపిణీ టెండర్లు దక్కించుకున్న వారిలో ఎక్కువ మంది రూలింగ్​పార్టీ లీడర్లే కావడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రధానంగా రవ్వు, బొచ్చ, బంగారుతీగ రకాల పిల్లలను చెరువులు, రిజర్వాయర్లలో పోస్తున్నారు. నిబంధనల ప్రకారం ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో పోసేందుకు 80 మిల్లీమీటర్ల నుంచి 100 మిల్లీమీటర్ల పొడవున్న పిల్లలు, చెరువులు, కుంటల్లో పోసేందుకు 35 మిల్లీమీటర్ల నుంచి 40మిల్లీమీటర్ల సైజ్ చేప పిల్లలను సప్లై చేయాలి. అంతకంటే తక్కువ సైజ్​పిల్లలను పోస్తే బతికే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కానీ ఇటీవల చాలాచోట్ల కాంట్రాక్టర్లు చెరువుల్లో పోసేందుకు 10 ఎంఎం నుంచి15 ఎంఎం  సైజున్న చేపపిల్లల్నే తెస్తుండడంతో మత్స్యకారులు అడ్డుకొని వెనక్కి పంపుతున్నారు. చేప పిల్లల సంఖ్య కూడా తక్కువగా ఉండడంతో ఆఫీసర్లకు కంప్లయింట్ ​చేస్తున్నా కనీస చర్యలు కరువయ్యాయి. చచ్చిపోయే ఇలాంటి చేపపిల్లల కోసం సర్కారు కోట్లు ఖర్చు చేసి దళారులను బతికిస్తోందని, తప్పనిసరి పరిస్థితుల్లో తాము లక్షలు పోసి ఏపీ నుంచి పెద్దసైజు చేపపిల్లలను తెచ్చి చెరువుల్లో పోసుకుంటున్నామని మత్స్యకారులు వాపోతున్నారు. 

వెనక్కి పంపుతున్నరు.. 

ఇటీవల సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మత్స్య సహకార సంఘానికి పంపిణీ చేసిన చేప పిల్లలు 35ఎం‌ఎం సైజ్ కు బదులు 10 ఎం‌ఎం మాత్రమే ఉండడంతో కాంట్రాక్టర్ తో మత్స్యకారులు  గొడవకు దిగారు. ఇదే జిల్లా జాజిరెడ్డిగూడెం, అర్వపల్లి  మండలంలోని మత్స్య సహకార సంఘాలకు అందించిన చేప పిల్లల లెక్కల్లో భారీ వ్యత్యాసం కనిపించడంతో మత్స్యకారులు ఆందోళనకుదిగారు. ఒక్కో ప్యాకెట్ లో 2వేల చేప పిల్లలకు బదులు కేవలం 400 చేప పిల్లలు మాత్రమే ఉండడంతో బొల్లంపల్లి, పర్సయాపల్లి గ్రామాలకు చెందిన సొసైటీ లు  చేపపిల్లలను వెనక్కి పంపాయి. ఖమ్మం జిల్లా వైరా రిజర్వాయర్​వద్ద ఇటీవల ఉచిత చేప పిల్లల పంపిణీ చేపట్టగా, కాంట్రాక్టర్ 80ఎం‌ఎంకు బదులు 40ఎం‌ఎం–60ఎం‌ఎం సైజు ఉన్న చేపపిల్లల లోడ్​పంపించడంతో మత్స్యకారులు ఎమ్మెల్యే రాములు నాయక్ , రాష్ట్ర ఫిషరీస్ జాయింట్ డైరెక్టర్ మురళీకృష్ణ ఎదుట ఆందోళనకు దిగారు. వ్యాన్​లో 18 వేల చేప పిల్లలు తెచ్చి లక్షపిల్లలుగా చూపారని మండిపడ్డారు.
 హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని చలివాగు ప్రాజెక్టులో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్‌‌ జడ్పీ చైర్​పర్సన్​గండ్ర జ్యోతి ఇటీవల చచ్చిన చేప పిల్లలను వదిలిపెట్టడంపై మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 11.70 లక్షల చేపపిల్లలను ప్రభుత్వం మంజూరు చేయగా మత్స్యశాఖ ఆఫీసర్లు రెండు డీసీఎం వ్యాన్లలో చేప పిల్లలను తీసుకువచ్చారు. ఎమ్మెల్యే, జడ్పీ చైర్​పర్సన్లు వాటిని ప్రాజెక్ట్ లో  పోశారు. వదిలిన  కొద్ది సేపటి తర్వాత అన్నీ చనిపోయి పైకి తేలి కనిపించడంతో మత్స్యకారులు ఆందోళనకు దిగారు.  మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలోని కుమ్మరివాగు ప్రాజెక్టులో మూడు రకాలకు చెందిన 60 లక్షల చేపపిల్లలు వదులుతామని చెప్పారు. మొదటి విడత కింద బుధవారం 20 వేల చేప పిల్లలను ప్రాజెక్టులో వదిలారు. ఆ చేపపిల్లలను చూసిన మత్స్యకారులు ఆఫీసర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎదుగుదల లేని నాసిరకం  చేప పిల్లలు వద్దంటూ వెనక్కి పంపారు.