ఎయిర్ ఫోర్ట్ లో లాగానే రైల్వే టికెట్స్!

ఎయిర్ ఫోర్ట్ లో లాగానే రైల్వే టికెట్స్!

హైదరాబాద్, వెలుగు: రైల్వేలో రిఫార్మ్స్పై రైల్వే బోర్డు కసరత్తులు చేస్తోంది. అందుకు జోన్లు పంపించిన ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. ఆ ప్రతిపాదనల్లో భాగంగా ఇకపై ఎయిర్పోర్టుల తరహాలోనే టికెట్ సిస్టమ్ను పెట్టాలని రైల్వే శాఖ యోచిస్తోంది. టికెట్ల ప్రింటింగ్ను నిలిపేసే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇప్పటికే ఉన్న ఈ–టికెట్ విధానాన్ని మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు అడుగులు పడుతున్నాయి. దీంతో ఆన్లైన్లోనే టికెట్లు బుక్ చేసుకుని, ప్రయాణ టైంలో ఫోన్లో టికెట్ చూపించాల్సి ఉంటుంది. రైల్వే స్టేషన్లలో టికెట్ చెకింగ్ బాధ్యతలనూ ఆర్పీఎఫ్ సిబ్బందికి అప్పగించే అవకాశం ఉంది. రెగ్యులర్ డ్యూటీలతో పాటు ఈ డ్యూటీని కూడా చేయాల్సి ఉంటుంది. స్టేషన్ మాస్టర్లే సిగ్నలింగ్ డ్యూటీని అప్పగించే విషయంపైనా రైల్వే బోర్డు కసరత్తులు చేస్తోంది. సిగ్నలింగ్ కోసం ఇప్పటిదాకా వేరే సిబ్బంది ఉండేవాళ్లు. అవుట్సోర్సింగ్ విధానంలో నైపుణ్యంలేని ఉద్యోగులను తొలగించే విషయంపైనా ప్రయత్నాలు సాగుతున్నాయి.
కీలక పోస్టులు విలీనం
రేషనలైజేషన్లో భాగంగా అనేక జూనియర్, మిడిల్ లెవెల్ పోస్టులను రైల్వే విలీనం చేస్తోంది. ఇప్పటికే 8 మేజర్ కేడర్స్ను విలీనం చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అకౌంట్స్, కమర్షియల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఇంజనీరింగ్, మెడికల్, పర్సనల్, ఆపరేటింగ్, స్టోర్స్, సిగ్నలింగ్, టెలికమ్యూనికేషన్స్ విభాగాల్లోని కీలక పోస్టులను మెర్జ్ చేయాలని ఇప్పటికే జోన్లు ప్రతిపాదించాయి. కమర్షియల్ విభాగాలకు చెందిన టికెట్ చెకింగ్, రిజర్వేషన్, ఎంక్వైరీ పోస్టులను విలీనం చేసే అవకాశం ఉంది. 7 కేటగిరీలుగా ఉన్న మెడికల్ కేడర్ను 4 కేటగిరీలుగా మార్చాలని ఓ జోన్ ప్రతిపాదించింది. అయితే, అన్ని ప్రతిపాదనలను 8 మంది సభ్యుల కమిటీ పరిశీలించి ఫైనల్ చేయనుంది. ఇందుకు ఓ నెల టైం పట్టొచ్చని అధికారులు చెబుతున్నారు. ఇక రైల్వే బోర్డు పునర్నిర్మాణంలో భాగంగా ప్రత్యేకంగా కేంద్ర కేబినెట్ సెక్రటరీ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేయనుంది. ఈ కమిటీలో రైల్వే బోర్డు చైర్మన్ కూడా ఉంటారు. సిబ్బంది ఒకే పనికి పరిమితం కాకుండా, అన్నింట్లోనూ ఇన్వాల్వ్ చేస్తే పనితీరు మెరుగవుతుందని అధికారులు భావిస్తున్నారు. అందరికీ ప్రత్యేక శిక్షణ ఇస్తారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి