వచ్చేనెల 10 వరకు వర్షాలు కొనసాగే అవకాశం

వచ్చేనెల 10 వరకు వర్షాలు కొనసాగే అవకాశం
  • వాగులు, వంకలు, చెరువులు, కుంటల వైపు జాగ్రత్త
  • వర్షాలు, వరదల పర్యవేక్షణకు ఏడుగురు ఉన్నతాధికారులతో టీమ్
  • అన్నిశాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం కేసీఆర్

హైదరాబాద్: వచ్చే ఆగస్టు నెల 10వ తేదీ దాకా వర్షాలు కొనసాగే పరిస్థితి వున్నదని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో, ప్రజా రక్షణకోసం అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఆర్ అండ్ బీ శాఖ వరద పరిస్థితులను ముందుగానే అంచనావేసి అన్ని ఇతర శాఖలతో సమన్వయం అవుతూ...బ్రిడ్జీలు రోడ్లు పరిస్థితులను పరిశీలించి ప్రజా రవాణా వ్యవస్థను కంట్రోల్ చేసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రజలు కూడా జాగ్రత్తగా వుండాలని, స్వీయ నియంత్రణ పాటిస్తూ వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. వాగులు, వంకలు, చెరువులు, కుంటల వైపు సంచారం కూడదని,  వరదల్లో చిక్కుకోకుండా ఉండాలన్నారు. వరద ఉదృతిలో వాగులు వంకలు దాటేందుకు సాహస కృత్యాలకు పాల్పడకుండా ఉండాలన్నారు. పిల్లా పాపలను కనిపెట్టుకుంటూ వుండాలని సీఎం ప్రజలకు పిలుపునిచ్చారు.
ఫ్లడ్ మేనేజ్మెంట్ టీమ్మొత్తం ఏడుగురు అధికారులతో టీం
వర్షాలు, వరదలను నిత్యం పర్యవేక్షించేందుకు ఏడుగురు ఉన్నతాధికారులతో టీమ్ ను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇందులో ఇరిగేషన్, పంచాయితీరాజ్, మున్సిపల్, ఆర్ అండ్ బీ , రెవిన్యూ, వైద్యశాఖ, జీఎడి శాఖలనుంచి అనుభవం కలిగిన ఏడుగురు అధికారులను నియమించాలని సూచించారు.