ఉత్తరాదిన తగ్గుముఖం పట్టిన వర్షాలు

ఉత్తరాదిన తగ్గుముఖం పట్టిన వర్షాలు

న్యూఢిల్లీ: ఉత్తరాదిన ఢిల్లీ, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో వర్షాలు కొంత తెరిపినిచ్చాయి. పంజాబ్ లో నీట మునిగిన ప్రాంతాల నుంచి గత మూడు రోజులుగా 10 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు పంజాబ్ లో 11 మంది, హర్యానాలో ఏడుగురు చనిపోయారు. హర్యానాలోనూ అనేక ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. అయితే, రెండు రాష్ట్రాల్లోనూ మూడు రోజుల పాటు వరుసగా కురిసిన భారీ వర్షాలు.. మంగళవారం నుంచి కాస్త తెరిపినిచ్చాయి. చాలా చోట్ల బుధవారం వెదర్ క్లియర్ అయిందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, పంజాబ్ లోని ఫరీద్ కోట్ జిల్లా కోట్కపురాలో బుధవారం తెల్లవారుజామున ఓ ఇంటి పైకప్పు కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు దంపతులు, వారి కొడుకు మృతిచెందారు. రెండు మూడు రోజుల కిందట పడిన భారీ వర్షాలకు తడవటం వల్లే ఇంటి పైకప్పు పడిపోయిందని అధికారులు తెలిపారు.