శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చిన్న తిరుపతిగా పేరుగాంచిన కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వరం ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈఘటనలో ఇప్పటి వరకు 9 మంది మృతి చెందినట్లు సమాచారం. పలువురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. అయితే.. కాశీబుగ్గ వెంకట్వేశ్వర ఆలయంలో తొక్కిసలాటకు ప్రధాన కారణం క్యూ లైన్లలో ఏర్పాటు చేసిన రెయిలింగ్ విరిగిపోవడమేనని ప్రాథమికంగా తెలుస్తోంది. 2025, నవంబర్ 1న కార్తీక మాసం ఏకదాశి కావడంతో భక్తులు పెద్ద ఎత్తున కాశీబుగ్గ ఆలయానికి తరలివచ్చారు.
భక్తుల సంఖ్యను అంచనా వేయడంలో విఫలమైన నిర్వాహకులు అందుకు తగిన ఏర్పాట్లు చేయకపోవడంతో ఆలయ ప్రాంగణంలో ఉన్న రెయిలింగ్ కూలి తొక్కిసలాట చోటు చేసుకున్నట్లు సమాచారం. ఈ తొక్కిసలాటలో ఇప్పటి వరకు 9 మంది భక్తులు మరణించినట్లు తెలుస్తోంది. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర ఆలయ తొక్కిసలాట ఘటనపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తొక్కిసలాట ఘటన తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. ఈ దురదృష్టకర ఘటనలో భక్తులు మరణించడం అత్యంత విషాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. గాయాల పాలైన వారికి మేలైన సత్వర చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాల్సిందిగా స్థానిక అధికారులను, ప్రజాప్రతినిధులకు సూచించారు.
