మాన్షన్​లో వాళ్ల చావుకు కారణాలేంటనేది ఇప్పటికీ రహస్యమే

మాన్షన్​లో వాళ్ల చావుకు కారణాలేంటనేది ఇప్పటికీ రహస్యమే

కెనడాలో ఓ పెద్ద భవంతి. అందులో బాగా డబ్బున్న ఒక కుటుంబం ఉంటోంది. అది కెనడాలోనే బాగా సంపన్న కుటుంబాల్లో ఒకటి. అందుకే వాళ్లింట్లో కుక్క చనిపోయినా.. మరుసటి రోజు ఆ వార్త చక్కర్లు కొడుతుంటుంది. కానీ.. ఒకరోజు అదే మాన్షన్​లోని ఒక బెడ్​రూమ్​లో ఆ ఫ్యామిలీలోని ఇద్దరు చనిపోయారు. ఎలా చనిపోయారు? ఎందుకు చనిపోయారు? అనేది ఎవరికీ తెలియదు. ఆ కుటుంబీకులు కూడా దీని గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. వాళ్ల చావుకు కారణాలేంటనేది ఇప్పటికీ రహస్యమే.  

కెనడాలోని మాంట్రియల్‌‌‌‌‌‌‌‌.1065 షెర్‌‌‌‌‌‌‌‌బ్రూక్ స్ట్రీట్​లో ఉన్న పెద్ద భవంతిలో రెడ్​పాత్​ ఫ్యామిలీ ఉండేది. జూన్ 13, 1901. సాయంత్రం ఆరు గంటలు. ఆ భవంతిలో ఒక పెద్ద బెడ్​రూమ్​లో ఇద్దరి శవాలు రక్తపు మడుగులో పడి ఉన్నాయి. మామూలుగా ఇలాంటి కుటుంబాల్లో ఏం జరిగినా చాలా హడావిడి ఉంటుంది. కానీ.. ఆ రోజు ఎవరూ ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. పోలీసులకు కూడా చెప్పలేదు. మరుసటి రోజు కరోనర్​(జ్యుడిషియల్​ ఎంక్వైరీ ఆఫీసర్) వచ్చి రెండు గంటలపాటు ఒక ఎంక్వైరీ చేశాడు. ఏం జరిగిందనేది బయటికి చెప్పలేదు. తర్వాత 48 గంటల్లో శవాలను ఖననం చేశారు. రెడ్‌‌‌‌‌‌‌‌పాత్ మాన్షన్‌‌‌‌‌‌‌‌లో ఆ రోజు ఏం జరిగిందనేది ఈ రోజు వరకు ఎవరికీ తెలియదు. 

ఆ భవంతిలో జాన్ జేమ్స్ రెడ్‌‌‌‌‌‌‌‌పాత్, అతని భార్య అడా, వాళ్ల ఐదుగురు పిల్లలతో కలిసి ఉండేవాళ్లు. వాళ్లతో పాటు ఒక కుక్క కూడా ఉండేది. రెడ్​పాత్​ కుటుంబం 1816లో కెనడాకు వలస వచ్చింది. అక్కడే స్థిరపడి, చాలా బిజినెస్​లు చేశారు. మాంట్రియల్‌‌‌‌‌‌‌‌లోని లాచిన్ కెనాల్, ఒట్టావాలోని రైడో కెనాల్​ను కూడా వాళ్లే ఏర్పాటుచేశారు. మౌంట్ రాయల్‌‌‌‌‌‌‌‌ ఏరియాలో 235 ఎకరాల భూమిని కొన్నారు. ఆ తర్వాత 1854లో కెనడా షుగర్ రిఫైనింగ్ కంపెనీ పెట్టారు. ఈ కంపెనీ ఇప్పటికీ ఉంది. తర్వాత మాంట్రియల్, క్యూబెక్, టొరంటోల్లో వేల ఎకరాల భూమి కొన్నారు. అప్పట్లో రెడ్‌‌‌‌‌‌‌‌పాత్ ప్రపంచంలోని అతిపెద్ద షుగర్​ ప్రొడక్షన్​ కంపెనీల్లో ఒకటిగా ఉండేది.

ఆ రోజు ఏం జరిగింది?

జాన్​ రోజూ ఆఫీస్​కు వెళ్లి, వస్తుండేవాడు. అడా పిల్లలను చూసుకునేది. అప్పుడప్పుడూ అందరూ కలసి చర్చికి వెళ్లేవాళ్లు. సంతోషంగా ఉండే ఆ కుటుంబంలో ఒకేసారి ఇద్దరు చనిపోవడంతో పరిస్థితులు మారిపోయాయి. వాళ్లు చనిపోయిన రోజు సాయంత్రం.. అందరూ కలసి భోజనం చేశారు. తర్వాత ఎవరి గదుల్లోకి వాళ్లు వెళ్లారు. కొద్దిసేపటికే మేడ మీద ఉన్న బెడ్‌‌‌‌‌‌‌‌రూమ్‌‌‌‌‌‌‌‌ నుంచి తుపాకి పేలిన​ శబ్దం వినిపించింది. దాంతో జాన్​ పెద్ద కొడుకు పీటర్ పరిగెత్తుకెళ్లి చూశాడు. ఆ గదిలో తల్లి అడా రక్తపు మడుగులో పడి ఉంది. పక్కనే తమ్ముడు క్లిఫోర్డ్(25ఏండ్లు) గోడకు ఆనుకుని నిలబడ్డాడు. 

ఎవరూ రాలేదు

ఆ ఇంటి నిండా ఎప్పుడూ పనివాళ్లు ఉంటారు. కానీ, తుపాకీ శబ్దం వినిపించినా ఒక్కరు కూడా ఆ గది​ వైపు వెళ్లలేదు. ఏడుస్తున్న పీటర్​ను ఎవరూ ఓదార్చలేదు. ఆ తర్వాత ఎవరూ పోలీసులకు ఫోన్​ చేయలేదు. కాల్పులు జరిగిన అరగంట తర్వాత క్లిఫోర్డ్‌‌‌‌‌‌‌‌ను దగ్గర్లోని హాస్పిటల్​కి తీసుకెళ్లాడు పీటర్. అతని ప్రాణాలు కాపాడలేకపోయారు డాక్టర్లు. అదే రోజు అర్ధరాత్రి అతను చనిపోయాడు. అప్పటికీ​ ఈ విషయం పోలీసులకు చెప్పలేదు పీటర్. హాస్పిటల్​ సిబ్బంది పీటర్​ని ఒప్పించి పోలీసులకు చెప్పారు. దాంతో పోలీసులు, కరోనర్‌‌‌‌‌‌‌‌ వచ్చారు. పోలీసుల్ని ఇంట్లోకి రానిచ్చేందుకు పీటర్ ఒప్పుకోలేదు. 

ఆత్మహత్యా? 

ఆ బిల్డింగ్​లో చాలామంది ఉంటారు. కాబట్టి, బయటి వ్యక్తి వచ్చి చంపే అవకాశమే లేదు. ఆ కుటుంబం కూడా దీనిపై ఎప్పుడూ మాట్లాడలేదు. కాబట్టి అడా, క్లిఫోర్డ్‌‌‌‌‌‌‌‌కు ఏమి జరిగిందనేది ఇప్పటికీ ఎవరికీ తెలియదు. పైగా దీనిపై ఎంక్వైరీ చేయడానికి కూడా ఆ ఫ్యామిలీ ఒప్పుకోలేదు. కాబట్టి క్లిఫోర్డ్‌‌‌‌‌‌‌‌ ముందుగా తన తల్లిని కాల్చి, తర్వాత తాను కాల్చుకుని చనిపోయాడని కొంతమంది చెప్పారు. కారణం.. క్లిఫోర్డ్‌‌‌‌‌‌‌‌కు ఉన్న మూర్ఛ వ్యాధి. దాంతో అతను చాలా డిప్రెస్​ అయ్యాడు. అతని తల్లి కూడా చనిపోయే కొన్ని రోజుల ముందు నుంచి అనారోగ్యంతో బాధపడింది. అందుకే ఇద్దరూ డిప్రెషన్​తో ఆత్మహత్య చేసుకున్నారని కొందరన్నారు. 

క్లిఫోర్డ్​కి మూర్ఛ వ్యాధి ఉన్నా దాని గురించి అతనెప్పుడు బాధపడలేదట. క్లిఫోర్డ్ ఒక మంచి లా స్టూడెంట్. అతను చనిపోవడానికి కొన్ని రోజుల ముందు బార్ ఎగ్జామ్​ రాయడానికి అప్లికేషన్​ కూడా పెట్టుకున్నాడు. అలాంటివాడు ఆత్మహత్య చేసుకోవాలని ఎందుకు అనుకుంటాడు? అనేది కొందరి వాదన. 

అమ్మంటే ప్రాణం

తల్లిని ప్రాణంగా చూసుకునేవాడు క్లిఫోర్డ్‌‌‌‌‌‌‌‌. ఆమె అనారోగ్యంతో ఉంటే దగ్గరుండి సేవలు చేసేవాడు. ఒకసారి న్యూయార్క్ ట్రిప్​కు వెళ్లాల్సి వస్తే... ఆమెను కూడా తనతో తీసుకెళ్లాడు. అలాంటిది అతనే తన తల్లిని ఎలా చంపుతాడు?  అలా జరగడానికి అవకాశం లేదని ఈ కేసును స్టడీ చేసినవాళ్లు చెప్తున్నారు.