మాన‌వ త‌ప్పిదం వ‌ల్లే ఒడిశా రైలు ప్ర‌మాదం.. తేల్చేసిన క‌మిటీ

మాన‌వ త‌ప్పిదం వ‌ల్లే ఒడిశా రైలు ప్ర‌మాదం.. తేల్చేసిన క‌మిటీ

2023, జూన్ 2వ తేదీన ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం యావత్ దేశాన్ని కుదిపేసింది. ఈ ప్రమాదంలో దాదాపు 293 మంది ప్రయాణికులు మృతి చెందారు. మరో 100 మందికి పైగా గాయపడ్డారు. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై రైల్వేశాఖ లోతుగా దర్యాప్తు చేపట్టింది. ప్రమాదానికి అసలు కారణాలేంటో... తెలుసుకునేందుకు ఒక కమిటీని కూడా వేసింది. 

జూన్ 2వ తేదీన బాలాసోర్ లో జరిగిన మూడు రైళ్ల ప్రమాదానికి సిబ్బంది మానవ తప్పిదమే కారణమని రైల్వే సేఫ్టీ చీఫ్ కమిషనర్ నివేదిక వెల్లడించింది. భద్రతా కమిషనర్ నివేదిక ప్రకారం.. సిబ్బంది 'నిర్లక్ష్యం', ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ సిస్టమ్ ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను (SOPs) అనుసరించకపోవడంతోనే భారీ ప్రమాదం జరిగిందని నివేదికలో స్పష్టం చేశారు. 

ఒడిశా బాలాసోర్ సమీపంలోని బహానగ బజార్ రైల్వే స్టేషన్ సమీపంలో కోల్‌కతా -చెన్నై కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, ఒక గూడ్స్ రైళ్లు బాలాసోర్ వద్ద ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదం వెనుక కారణాలపై అంతు తేల్చేందుకు ఓ వైపు రైల్వే సేఫ్టీ కమీషనర్ మరోవైపు సీబీఐ దర్యాప్తు ప్రారంభించాయి.

సిగ్నలింగ్ వ్యవస్థలో లోపం కారణమని కొందరు వాదిస్తుంటే, దీనివెనుక విద్రోహ కోణముందని మరికొందరు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఘటనపై దర్యాప్తు జరిపిన రైల్వే సేఫ్టీ కమీషనర్ మాత్రం తన నివేదికలో సిగ్నలింగ్ విభాగపు ఉద్యోగుల తప్పిదమని తేల్చింది. అందుకే ప్రమాదానికి మానవ తప్పిదం కారణమని ప్రత్యేకించి చెప్పింది.

వాస్తవానికి భద్రతా కారణాలతో డిజైన్‌లో మార్పులు చేసిన తరువాత కూడా ఆ భద్రతా ప్రమాణాలు అనుసరించని కొందరు అధికారుల వల్లే ఈ ప్రమాదం జరిగిందని నివేదికలో వెల్లడైంది. సర్క్యూట్‌లో చేసిన మార్పుచేర్పుల్ని అమలు చేయడంలో లేదా గుర్తించడంలో సెంట్రల్ డయాగ్రమ్ విఫలమైనా ప్రతి యేటా చేసే తనిఖీల్లో ఎవరూ పట్టించుకోలేదని నివేదిక తెలిపింది. ఇది ఏ ఒక్కరి తప్పు కాదని..దాదాపు ఐదారుగురు బాధ్యులని నివేదిక స్పష్టం చేసింది. రైల్వే సేఫ్టీ కమీషనర్ సిబ్బంది నిర్లక్ష్యం ప్రధాన కారణంగా నివేదికను రూపొందించింది. 

రైలు ప్రమాదంలో నేర పూరిత కుట్ర ఏమైనా ఉందా..? అనే కోణంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఇప్పటికే విచారణ జరుపుతోంది. గత రెండు దశాబ్దాలలో దేశంలో జరిగిన అత్యంత రైల్వే విషాదాలలో ఈ ప్రమాదం ఒకటి. 

ఈ ఘటన జరిగి నెలరోజులు కావస్తున్నా.. మృతదేహాల గుర్తింపు ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. ప్రమాదం జరిగిన తర్వాత వందలాది మృతదేహాలను భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌కు తరలించారు. అయితే, వాటిలో ఇప్పటికీ 81 మృతదేహాలు అక్కడే ఉన్నాయి.

‘రైలు ప్రమాద ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారిలో 81 మృతదేహాలు ఇంకా మార్చురీలో ఉన్నాయి. వాటిని భువనేశ్వర్ ఎయిమ్స్ లో భద్రపరిచాం. వాటి నుంచి నమూనాలు సేకరించి డీఎన్ఏ పరీక్షలకు పంపించాం. అందులో 29 మృతదేహాలను గుర్తించి.. వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించాం. గుర్తించిన వాటిలో ఐదు మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించాం. మిగతా వాటిని అప్పగించే ప్రక్రియ కొనసాగుతోంది. వాటిని తీసుకెళ్లేందుకు వారి బంధువులు వస్తున్నారు. ప్రస్తుతం ఎయిమ్స్ మార్చురీలో 76 మృతదేహాలు ఉన్నాయి. వాటిలో ఇంకా 52 మృతదేహాలను గుర్తించాల్సి ఉంది’ అని భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దాస్ తెలిపారు.