రిస్క్​లో రెస్క్యూ టీం

 రిస్క్​లో రెస్క్యూ టీం

మందమర్రి, వెలుగు: కార్మికుల ప్రాణాలను, భూగర్భ బొగ్గు గనుల ఆస్తులను రక్షించేందుకు ఏర్పాటు చేసిన సింగరేణి రెస్క్యూ విభాగంలో ఎంప్లాయీస్​  ప్రాణాలకు భరోసా లేకుండా పోతోంది. బొగ్గు గనుల్లోనే కాదు చుట్టుపక్కల ఎక్కడ ఆపద వచ్చినా అక్కడికి చేరుకొని సేవలందిస్తున్న రెస్క్యూ కార్మికుల  రక్షణ విషయంలో యాజమాన్యం నిర్లక్ష్యం ఇద్దరి ప్రాణాల మీదకు తెచ్చింది. కుమ్రం భీం జిల్లా దహెగాం మండలం పెసరకుంట గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో ఆరుగురు సభ్యులతో కూడిన సింగరేణి రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీరాంపూర్​ ఏరియాలోని ఎస్సార్పీ ఓపెన్​కాస్ట్​గనిలో ఈపీ ఆపరేటర్​గా చేసే చిలుక సతీశ్(36), ఆర్కే 5 గనిలో జనరల్​మజ్దూర్​గా పనిచేస్తున్న అంబాల రాములు(25) వరదలో గల్లంతై చనిపోయారు. సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యమే ఇందుకు కారణమని, రూల్స్​కు విరుద్ధంగా ఎంప్లాయీస్​ను బయట ఎమర్జెన్సీలకు పంపి ఇద్దరిని పొట్టన పెట్టుకుందని కార్మికులు, కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.

38 ఏళ్లుగా సేవలు
1984లో సింగరేణి ఏర్పాటు చేసుకున్న రెస్క్యూ విభాగం టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ జాతీయ, అంతర్జాతీయ బొగ్గు, ఖనిజ గనులకు  మార్గదర్శకంగా నిలుస్తోంది. మైన్స్​రెస్క్యూ రూల్స్​ప్రకారం ప్రతి వందమంది సింగరేణి కార్మికులకు ఒక రెస్క్యూ టీం మెంబర్​ఉండాలి. ఇందులో భాగంగా బొగ్గు గనులకు 35 కి.మీ. దూరంలోపు రెస్క్యూ సర్వీసు రూం(రెస్క్యూ స్టేషన్) ఏర్పాటు చేసింది.  సింగరేణిలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఇతర బొగ్గు పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగినా సింగరేణిపై ఆధారపడే స్థాయికి రెస్క్యూ టీం అభివృద్ధి చెందింది. రెస్క్యూ విభాగంలో సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాలకు సంబంధించి సుమారు 550 మంది ఉన్నారు. ఫస్ట్ ఎయిడ్​పై వీరికి పూర్తిస్థాయి పట్టు ఉంటుంది.

బొగ్గు గనుల కోసమే...
బొగ్గు గనుల్లో జరిగే ప్రమాదాలను ఎదుర్కోవడానికి ప్రత్యేకంగా మైన్స్​రెస్క్యూ విభాగం ఏర్పాటు చేశారు. బొగ్గు గనుల్లో విష వాయువులు వెలువడినా, అగ్ని ప్రమాదాలు జరిగినా, గని పైకప్పులు, సైడ్లు కూలినా, గనిలో నీటిలో చిక్కుకున్న కార్మికులను రక్షించడానికి, ఆస్తుల పరిరక్షణకు రెస్క్యూ మెంబర్లకు ట్రైనింగ్​ ఇస్తారు. 30 ఏళ్లలోపు, ఆరోగ్యంగా ఉన్నవారినే ఎంపిక చేసి వారికి మైన్స్​ రెస్క్యూ స్టేషన్​లో 21 రోజులపాటు శిక్షణ ఇస్తారు. ఇందుకోసం ప్రత్యేక ట్రైనింగ్​ గ్యాలరీ రెస్క్యూ స్టేషన్​లో ఉంటుంది. రామగుండం రీజియన్​లోని యైటింక్లైయిన్​లో మొయిన్​ రెస్క్యూ కేంద్రం ఉంది. రామకృష్ణాపూర్​(మందమర్రి ఏరియా), భూపాలపల్లి, కొత్తగూడెం ఏరియాల్లో రెస్క్యూ స్టేషన్లు ఉన్నాయి. ప్రత్యేకంగా సింగరేణి బొగ్గు గనులు, ఆస్తులు, ప్రమాదంలో చిక్కుకున్న సింగరేణి ఎంప్లాయీస్​ను రక్షించేందుకు ఏర్పాటు చేసిన రెస్క్యూ విభాగం సేవలు రిస్కుతో కూడిన అన్ని బయటి పనులకు వినియోగిస్తున్నారు. వివిధ సామాజిక సేవలతో పాటు ప్రమాదకరమైన ఫైర్, నదులు, వరదల్లో చిక్కుకోవడం, రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులు, బాధితులను రక్షించేందుకు శ్రమిస్తున్నారు. జాతరలు, పుష్కరాలు తదితర ప్రోగ్రామ్స్​లో సేవలు అందిస్తున్నారు. తెలంగాణలో సముద్ర తీర ప్రాంతం లేనందున వరదలు వచ్చే అవకాశం లేదని నేషనల్​డిజాస్టర్​రెస్పాన్స్​ఫోర్స్​(ఎన్​డీఆర్ఎఫ్), ఎస్ డీఆర్ఎఫ్​ఏర్పాటు చేయలేదు. వీరికి ప్రత్యామ్నయంగా ఎమర్జెన్సీలన్నింటికీ ఆయా జిల్లాల్లో రాష్ట్ర సర్కార్, ఇతర సంస్థలు  సింగరేణి రెస్క్యూ విభాగం సేవలను వాడుకుంటున్నాయి.

లైఫ్​జాకెట్లు లేకుండానే..
మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్​సింగరేణి రెస్క్యూ స్టేషన్​నుంచి బుధవారం ఒక టీం మంచిర్యాలకు(స్టేషన్​లో ఉన్న  రెండు లైఫ్​ జాకెట్లు, 3 గార్డులు వెంట తీసుకువెళ్లారు), మరొకటి నస్పూర్​ సీతారాంపల్లి ఇన్​టేక్ ​వెల్​లో చిక్కుకున్న సింగరేణి ఎంప్లాయీస్​ను రక్షించేందుకు వెళ్లింది. దహెగాం మండలం పెసరకుంట గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకోవడం, బిబ్రా గ్రామానికి చెందిన గర్భిణిని ప్రధాన రహదారిపై  వరద  దాటించడం కోసం అక్కడి యంత్రాంగం బుధవారం మధ్యాహ్నం సింగరేణి రెస్క్యూ టీంను పంపించాలని కోరింది. దీంతో ఆరుగురు మెంబర్లున్న మూడో టీం గణేశ్​రామన్, ఆరుగుల తిరుపతి, మధుకర్, నర్సింగ్, చిలుక సతీశ్, అంబాల రాములు మధ్యాహ్నం 3.30  గంటల సమయంలో ఘటనా ప్రాంతానికి వెళ్లారు. గణేశ్​రామన్​ బయట ఉండగా మిగిలిన ఐదుగురు, సీఐ నాగరాజు, మర్రిపల్లికి చెందిన ముగ్గురు గ్రామస్తులు కలిసి రెండు మీటర్ల గ్యాప్​తో రోప్​పట్టుకొని వరద నీటిలోకి దిగారు. లోతును గుర్తించక సతీశ్, రాము నీటిలో పడి గల్లంతయ్యారు. మిగిలిన వాళ్లను గ్రామస్తులు, సీఐ కాపాడారు. ఆపరేషన్​టైమ్​లో రెస్క్యూ ఇన్​చార్జి పర్యవేక్షణ లేకపోవడంతోనే ఇద్దరు మెంబర్ల ప్రాణాలు పోయాయని కార్మికులు, కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రతి స్టేషన్​లో కనీసం 12 చొప్పున  లైఫ్​ జాకెట్లు,  గార్డులు, ఇతర సామగ్రి స్టేషన్​లో సమకూర్చాల్సి ఉన్నప్పటికీ సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం చేసిందని ఆరోపిస్తున్నారు.  

ఈత రాకున్నా పంపారా?
2016లో  సింగరేణి సీజీఎం సేఫ్టీ ఆఫీసర్లు రెస్క్యూ సేవలపై రూల్స్​తో కూడిన సర్క్యులర్​ జారీ చేశారు. నీటికి సంబంధించిన రెస్క్యూ, రికవరీ కార్యకలాపాలు నిర్వహించడానికి అవసరమైన శిక్షణ రెస్క్యూ బృందాలకు లేదని, ఇక నుంచి ఎట్టి పరిస్థితుల్లో నదులు, సరస్సులు, చెరువులు, బావుల్లో రెస్క్యూ, రికవరీ కార్యకలాపాలకు పంపవద్దని ఆయా ఏరియాల జీఎంలకు ఆదేశాలు జారీ చేశారు. రోడ్డు ప్రమాదాలు, గృహ అగ్ని ప్రమాదాలు వంటి అత్యవసర పరిస్థితులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ట్రైనింగ్​ఉన్నందున రెస్క్యూ సేవలు వినియోగించే వెసులుబాటు ఇచ్చింది. ఈ రూల్స్​సింగరేణి ఆఫీసర్లు ఎక్కడా పాటించడం లేదు.  పోలీసులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ సంస్థల ఒత్తిళ్లు, మానవతా దృక్పథంతో ప్రమాదమని తెలిసినా రెస్క్యూ బృందాలను పంపుతున్నారు. కాగా, దహెగాం ప్రమాదంలో మృతిచెందిన ఇద్దరికి ఈత రాదని తెలుస్తోంది.