
‘కట్టుకున్న ఇల్లు..పెట్టుకున్న గోడ.. నీడనిచ్చిన చెట్టు..నడిచివచ్చిన బాట..గుండెల్లో బాధంతా దిగమింగుకుంటూ..అమ్మ మన ఊరు ఆగమైందే.. గౌరవెల్లి ప్రాజెక్టుతో మునిగిపోతుందే..తావిచ్చిన ఇల్లు కూల్చుకుంటూ ఇగ మేము ఎల్లిపోతున్నమే’ అంటూ గౌరవెల్లి ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితులు ఒక్కొక్కరుగా వెళ్లిపోతున్నారు. బతికినన్నాళ్లు కష్టసుఖాలు కలిసి పంచుకున్న సిద్దిపేట జిల్లా గుడాటిపల్లితో పాటు నిర్వాసిత గ్రామాల ప్రజలు చెట్టుకొకరు..పుట్టకొకరుగా విడిపోతున్నారు.
సిద్దిపేట, వెలుగు : హుస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కన్నపేట మండలంలో నిర్మిస్తున్న గౌరవెల్లి ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయి. మరో పదిహేను రోజుల్లో పనులన్నింటిని పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయడం కోసం అధికారులు పనుల్లో నిమగ్నమయ్యారు. పరిహారం విషయంలో తమకు అన్యాయం జరిగిందని, న్యాయం చేయాలని నిర్వాసిత గ్రామాల ప్రజలు ఎన్ని ఆందోళనలు చేసినా, నిరాహారదీక్షలు చేసినా సర్కారు మాత్రం పట్టించుకోకుండా తనపని తాను చేసుకుపోతోంది. మంచినీళ్ల బావిని పూడ్చి వేయడం, రాకపోకలకు ఇబ్బందులు సృష్టిస్తుండడం, పోలీసులను మోహరించడంతో నిర్వాసితులు ఒక్కొక్కరుగా వెళ్లిపోతున్నారు. ఇన్నాళ్లూ తమకు న్యాయం జరుగుతుందన్న ఆశతో ఉన్నవారు నిరాశతో ఇండ్లను ఖాళీ చేయడమే కాకుండా అధికారుల ఆదేశాలతో స్వయంగా కూల్చేసుకుంటున్నారు. ఇలా గుడాటిపల్లితో పాటు మొత్తం ఏడు తండాల్లో 725 ఇండ్లకు ఇప్పటివరకు 500 ఇండ్లను కూల్చేసుకున్నారు.
దీక్షలు మాత్రం ఆపుతలేరు
అధికారులు పోలీసులు ఎన్ని నిర్బంధాలు విధిస్తున్నా గుడాటిపల్లిలో మాత్రం ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కోసం యువతులు ప్రారంభించిన దీక్షలు మాత్రం విరమించడం లేదు. వారం రోజులుగా గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద దీక్షలను కొనసాగిస్తూనే ఉన్నారు. గ్రామంలో ఇప్పుడు కేవలం వంద మంది మాత్రమే ఉండగా, తాగునీటినిచ్చే బావిని పూడ్చివేయడంతో ఇబ్బందులు పడుతున్నారు. అయినా పట్టువదలకుండా సమీప గ్రామాల నుంచి వాహనాలపై నీళ్లను తెచ్చుకుంటూ నిరసన తెలుపుతున్నారు.
కొనసాగుతున్న పోలీసు నిర్బంధం
ఒకవైపు కట్ట పనులు జోరుగా సాగుతుండగా నిర్వాసిత గ్రామమైన గుడాటిపల్లికి దారి తీసే రోడ్లను పోలీసులు కొన్నిరోజులుగా మూసివేశారు. పలు చోట్ల పికెట్లను ఏర్పాటు చేసి ఇబ్బందులు పెడుతున్నారు. రామవరానికి వెళ్లే రోడ్డును పూర్తిగా ధ్వంసం చేయడంతో రాకపోకలుల నిలిచిపోయాయి. మరో 15 రోజుల్లో మిగిలిపోయిన కట్ట పనులను పూర్తి చేసి నెల రోజుల్లో ప్రాజెక్టు ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నారు.
కేసీఆర్ రీ డిజైన్‌తోనే...
2007లో అప్పటి కాంగ్రెస్ప్రభుత్వం 1.4 టీఎంసీల కెపాసిటీతో గౌరవెల్లి రిజర్వాయర్ పనులు ప్రారంభించింది. 2014 లో తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు సామర్థ్యాన్ని 8.23 టీఎంసీలకు పెంచింది. మొదట్లో ముంపు ప్రాంతం ఎక్కువ ఉండకుండా, మెట్టప్రాంతాలన్నింటికీ నీళ్లు అందించాలని ప్రాజెక్టు రూపొందించినా.. తరువాత సీఎం కేసీఆర్ రీ డిజైన్ చేయడంతో గుడాటిపల్లితోపాటు తెనుగుపల్లి, మద్దెలపల్లి, సోమాజీతండా, సేవానాయక్ తండా, బొంద్యానాయక్ తండా, సేవ్యనాయక్ తండా, జాలుబాయ తండా, చింతల్ తండా, కొత్తపల్లి ముంపునకు గురయ్యాయి. దాదాపు 3 వేల ఎకరాల భూమి మునిగిపోగా, 3 వేల మందికి పైగా నిర్వాసితులుగా మారారు. పరిహారాలు పూర్తి స్థాయిలో చెల్లించకుండానే ప్రాజెక్టు పనులు దాదాపు పూర్తి చేశారు. ఇందులో గ్రీన్ ట్రిబ్యూనల్, హైకోర్టు జోక్యం చేసుకుని ఉత్తర్వులు ఇచ్చినా పట్టించుకోవడం లేదు.
ఊరు ఇడిసిపొవాలంటే పానమెల్లిపోతంది
ఊరు ఇడిసిపోవాలంటే పానం ఎల్లిపోతంది. మంచికి చెడ్డకు ఒక్కదగ్గరున్న మేము ఇప్పుడు చెట్టుకొకలు, పుట్టకొకలుగా పోతున్నం. ప్రాజెక్టు కింద నాకున్న ఎనిమిది ఎకరాల భూమి పోయింది. ఇంకా కొన్ని పైసలు రావాల్సి ఉన్నా ఆఫీసర్లు ఏమి చెప్పడం లేదు. సర్కారు ఇచ్చిన పైసలతోని బయట భూమి కొనేటట్టు లేదు. ఎట్ల బతుకుడు? - కల్వల భాగ్యవ్వ, గుడాటిపల్లి
ఊర్లన్నీ ఆగమైనయి
ప్రాజెక్టుతో గుడాటిపల్లితో పాటు తండాలన్నీ ఆగమైనయి. అన్నింటిని ఇడిసిపెట్టి ఎల్లిపోతున్న మాకు సర్కారు సరైన న్యాయం చేయడం లేదు. రోడ్డున పడ్డ నిర్వాసిత కుటుంబాలకు భరోసా ఇయ్యాల్సిన టైంలో పోలీసులను పెట్టి మరీ ఉరికిస్తుండ్రు. అయినా మొండి ధైర్యంతో కొట్లాడుతూనే ఉన్నాం. కొందరే ఊరిడిసి పోతున్నరు. - బద్ధం శంకర్‌రెడ్డి, గుడాటిపల్లి