సర్కార్​కు జూన్​లో వచ్చిన ఆదాయం రూ.23 వేల కోట్లు

సర్కార్​కు జూన్​లో వచ్చిన ఆదాయం రూ.23 వేల కోట్లు

హైదరాబాద్, వెలుగు: భూముల అమ్మకంతో రాష్ట్ర సర్కారు ఆదాయం పెరిగింది. జూన్​లో భూముల అమ్మకం ద్వారానే రూ.5,961 కోట్లు సమకూరాయి. గత 2 నెలలుగా వెయ్యి కోట్ల లోపే ఉన్న పన్నేతర ఆదాయం జూన్​లో ఒక్కసారిగా రూ.6,874 కోట్లు దాటింది. ప్రభుత్వ భూములు అమ్మడం, రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల అమ్మకాలు, జిల్లాల్లోనూ సర్కార్ భూములను వేలం వేసి అమ్ముతోంది. ఈ ఏడాదిలో నాన్ ట్యాక్స్ ఆదాయం కింద రూ.25 వేల కోట్లు సమకూర్చుకోవాలని ప్రభుత్వం బడ్జెట్​లో అంచనా వేసింది. ఇందులో భూముల అమ్మకం ద్వారా రూ.15 వేల కోట్లు సమకూర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాగ్ గురువారం జూన్ రిపోర్టు రిలీజ్ చేసింది. ఇందులో ఈ ఆర్థిక సంవత్సరం 3 నెలల్లో తెలంగాణకు వచ్చిన రాబడి వివరాలు, ఖర్చులు, అప్పులు ఇతర వివరాలను పేర్కొంది. దీని ప్రకారం ఏప్రిల్, మే, జూన్ నెలల్లో మొత్తంగా రూ.43,550 కోట్ల ఆదాయం వచ్చింది.

ఒక్క నెలలోనే అప్పులు.. గ్రాంట్లు

రాష్ట్ర సర్కార్​కు జూన్​లో వచ్చిన ఆదాయం రూ.23 వేల కోట్లుగా ఉంది. ఇందులో అప్పులు, భూముల అమ్మకాలకు సంబంధించే రూ.11 వేల కోట్లుగా కాగా..  కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు ఒక్క జూన్​లోనే రూ.1,134 కోట్లు వచ్చినట్లు కాగ్ రిపోర్టులో పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.41 వేల కోట్లు గ్రాంట్ల కింద రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్​లో అంచనా వేసింది. మరోవైపు జూన్ నెలలో తీసుకున్న అప్పులు కూడా భారీగానే ఉన్నాయి. ఒక్క నెలలోనే ఆర్బీఐ నుంచి రాష్ట్రం రూ.5 వేల కోట్ల అప్పు తీసుకున్నది. ఫలితంగా రాష్ట్ర ఆదాయం ఒక్కనెలలో భారీగా పెరిగింది.