హిమాలయ నదీ వ్యవస్థ

హిమాలయ నదీ వ్యవస్థ

సింధు, బ్రహ్మపుత్ర, గంగ నదులు హిమాలయాల్లో జన్మిస్తాయి. హిమాలయాల ఆవిర్భావం కంటే ముందు ఆ ప్రాంతంలో జన్మించిన నదులు సింధు, బ్రహ్మపుత్ర, సట్లెజ్​, కోసి. ఇవి పూర్వవర్తిత రకానికి చెందినవి. హిమాలయాల ఆవిర్భావం తర్వాత జన్మించి ప్రవహించే నదులు గంగా, చంబల్​, బెట్వా, కెన్​. ఇవి అంతర్​వర్తిత రకానికి చెందినవి. ద్వీపకల్ప నదులతో పోలిస్తే హిమాలయ నదులు తక్కువ వయస్సు కలిగి ఉంటాయి. ఈ నదులు లోతైన, ఇరుకైన వి ఆకారపు లోయల గుండా ప్రవహిస్తాయి. ఇవి నౌకాయానానికి అనుకూలంగా ఉంటాయి. హిమాలయ నదులు జీవ నదులు.

సింధు 
కైలాస పర్వతాల్లోని మానస సరోవరం సింధు నదీ జన్మస్థానం. ఈ నది మొత్తం పొడవు 2880 కి.మీ. భారతదేశంలో దీని పొడవు 709 కి.మీ. ఇది లడఖ్​, జస్కార్​ పర్వతాల మధ్యలో ప్రవహిస్తుంది. సింధు నదీ మైదానంలో కలిసే ప్రాంతం సింధుతల్బల. సముద్రంలో కలిసే పాకిస్తాన్​లోని కరాచీ. అరేబియా సముద్రంలో కలిసే నదుల్లో అతి పొడవైన, అతి పెద్దది. సింధు నదీ పర్వతీయ ఉపనదులు జస్కార్​, ష్యోక్​, గిల్గిత్​, హుంజా. ఎడమ ఉపనదులు జీలం, చీనాబ్​, రావి, బియాస్​, సట్లెజ్​. 
ఎడమ ఉపనదులు
జీలం:
జమ్ముకశ్మీర్​లోని వేరీనాగ్​ జీలం జన్మస్థలం. మైదానంలో జీలం వద్ద ప్రవేశిస్తుంది. ట్రిమ్ము అనే ప్రాంతం వద్ద చీనాబ్​లో కలుస్తుంది. జీలం నది వులార్​ సరస్సును ఏర్పరిచింది. ఇది ఇండియా, పాకిస్తాన్​ సరిహద్దుగా ప్రవహిస్తుంది. భారత్​లో తక్కువ దూరం ప్రవహించే సింధు ఉప నది జీలం. దీని ప్రాచీన పేరు వితస్థ. 
చీనాబ్​: హిమాచల్​ప్రదేశ్​ రాష్ట్రం బారాలాప్చాలా కనుమలో చీనాబ్​ జన్మస్థలం. ఇది మైదానంలో కలిసే ప్రాంతం ఆక్నూర్​. పంచ్​నాడు వద్ద సట్లెజ్​లో కలుస్తుంది. చీనాబ్​ ప్రాచీన నామం చంద్రభాగ, అషిక్ని. దీనిని హిమాచల్​ప్రదేశ్​లో చంద్ర, భాగ అని పిలుస్తారు. కశ్మీర్​లో చీనాబ్​ అని పిలుస్తారు. సింధు నది ఉపనదుల్లో అత్యధిక నీటిని తీసుకువచ్చే నది చీనాబ్​. కిస్త్వార్​ అనే గార్జ్​ను ఏర్పరిచింది. 
రావి: హిమాచల్​ప్రదేశ్​ రాష్ట్రంలోని రోహ్​తంగ్​ కనుమ రావి జన్మస్థలం. ఇది మైదానంలో కలిసే ప్రాంతం మాధవ్​పూర్​. రంగాపూర్​ వద్ద చీనాబ్​లో కలుస్తుంది. రావి నది ప్రాచీన పేర్లు పరూష్ని, ఐరావతి.
బియాస్​: రోహ్​తంగ్​ కనుమ వద్ద గల బియాస్​కుండ్​ బియాస్​ నది జన్మస్థలం. ఈ నది మైదానంలో కలిసే ప్రాంతం పాంగ్​. హరికే వద్ద సట్లెజ్​లో కలుస్తుంది. పూర్తిగా భారత్​లో మాత్రమే ప్రవహించడమే ఈ నది ప్రత్యేకత. బియాస్​ ప్రాచీన పేర్లు విపస, అర్గికియ.
సట్లెజ్​: రాకాసి సరస్సు సట్లెజ్​ నది జన్మస్థలం. ఇది మైదానంలో కలిసే ప్రాంతం రూపానగర్​. భారత్​లో జన్మించని సింధు నది ఉపనదుల్లో ప్రధానమైంది. మిదాన్​కోట్​ వద్ద మిగిలిన ఉపనదులను కలుపుకొని సింధులో కలుస్తుంది. సట్లెజ్​ ప్రాచీన పేరు శతుద్రి. 
గంగా నదీ వ్యవస్థ 
అలకనంద, భాగీరథి అనే నదుల కలయిక వల్ల గంగా నది ఏర్పడింది. ఈ నదులు కలిసే ప్రదేశం దేవప్రయాగ. గంగా నది మైదానంలో ప్రవేశించే ప్రాంతం హరిద్వార్. రాజమహాల్​ కొండల వద్ద గంగా  నది దక్షిణంగా హుగ్లీ భాగీరథిగా పిలువబడి, ఆగ్నేయంగా పద్మామేఘన అని పిలువబడుతుంది. ఇది బ్రహ్మపుత్ర నదిని కలిసే ప్రదేశం గోవాలుండూ. భారత్​లో గంగా నది పొడవు 2510 కి.మీ. కానీ దీని మొత్తం పొడవు 2525 కి.మీ. గంగా నది ఉత్తర్​ప్రదేశ్​, మధ్యప్రదేశ్​, బిహార్​, పశ్చిమబెంగాల్​ రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది. 
హిమాలయాల్లో జన్మించి, దక్షిణ దిశగా ప్రవహిస్తూ కలిసే ఉపనదులు : గండక్​, గాగ్రా, కాళీ, కోసి ఉత్తర దిశగా ప్రయణిస్తూ కలిసే ఉపనదులు: యమున, చంబల్​, బెట్వా, కెన్​, సోన్​, దామోదర్​, ట్రాన్స్​, సింధ్​.
యమున: యమునోత్రి అనే హిమనీనదం వద్ద బండార్​పుంచ్​ శిఖరం యమున జన్మస్థలం. ఈ నది మైదానంలోకి ప్రవేశించే ప్రాంతం తజేవాలా. ఇది అలహాబాద్​ వద్ద గంగా నదిలో కలుస్తుంది.  ఉత్తరానికి ప్రవహిస్తూ యమునా నదిలో కలిసే నదులు చంబల్​, బెట్వా, కెన్​. 
గండక్​: నేపాల్​లోని ఎవరెస్టు, ధవళగిరి శిఖరాల మధ్య జన్మించిన గండక్​ నది బిహార్​లో గంగా నదిలో కలుస్తుంది. దీనిని నేపాల్​లో సాలగ్రామి, బిహార్​లో నారాయణి నది అని పిలుస్తారు. 
కోసి: నేపాల్​, టిబెట్​, సిక్కిం ప్రాంతాల సరిహద్దుల్లో కోసి ప్రాంతం జన్మిస్తుంది. కోసిని బిహార్​ దు:ఖదాయని అని అంటారు. ఈ నదిని ప్రారంభంలో సప్తకోసి అని పిలిచేవారు. వాటిలో ముఖ్యమైనవి అరుణ్​కోసి, తుమార్​కోసి, సన్​కోసి. ఈ మూడు ఉపనదులు బిహార్​లో  గంగానదితో కలుస్తాయి. కోసిని సంస్కృతంలో కౌసికి అంటారు. 
గాగ్రా: టిబెట్​లోని గుర్లమందాత్​ శిఖరం వద్ద జన్మించే  గాగ్రా దక్షిణ దిశగా ప్రవహిస్తూ బిహార్​లో గంగా నదిలో కలిసిపోతుంది. గాగ్రాను నేపాల్​లో కర్నాలి అంటారు. 
చంబల్​: మధ్యప్రదేశ్​లోని జనపావో కొండల్లో గల మౌ అనే ప్రదేశంలో చంబల్​ నది జన్మిస్తుంది. మధ్యప్రదేశ్​, రాజస్తాన్​, ఉత్తరప్రదేశ్​ రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ ఉత్తరప్రదేశ్​లోని ఎటావా జిల్లాలో యమునా నదితో కలిసిపోతుంది. 
బెట్వా: మధ్యప్రదేశ్​లోని గ్వాలియర్​ సమీపంలో గల కైమూర్ కొండల్లో బెట్వా జన్మిస్తుంది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్​ గుండా ప్రవహిస్తూ యమునా నదిలో కలుస్తుంది. దీనిని నేత్రావతి అని కూడా పిలుస్తారు. 

బ్రహ్మపుత్ర
టిబెట్​లోని షమ్​యమ్​డంగ్​ బ్రహ్మపుత్ర నదీ జన్మస్థలం. దీని పొడవు 2900 కి.మీ. భారత్​లో పొడవు 880 కి.మీ. అసోంలోని సాదియా మైదానంలో కలిసే ప్రాంతం. బంగ్లాదేశ్​ గోవాలుండూ వద్ద పద్మావతితో బ్రహ్మపుత్ర నది కలుస్తుంది. బ్రహ్మపుత్ర నది అరుణాచల్​ప్రదేశ్​లో నామ్​చాబార్వా శిఖరం వద్ద యూ టర్న్​ తీసుకొని జిదోలో అనే ప్రదేశం వద్ద ప్రవేశిస్తుంది. ఇక్కడ దీనిలో కలిసే ఉపనదులు దిబాంగ్​, లోహిత్​. ఈ నది అసోంలోకి సాదియా అనే ప్రాంతం వద్ద ప్రవేశిస్తుంది. అసోంలో ఈ నదిని సైడాంగ్​, బ్రహ్మపుత్ర, రెడ్​రివర్​ అని పిలుస్తారు. బ్రహ్మపుత్ర నది అసోం దు:ఖదాయని అని అంటారు. బంగ్లాదేశ్​లో జమున నదిగా పిలుస్తారు. పద్మానదిని కలుపుకున్న తర్వాత మేఘన అని పిలుస్తారు. బ్రహ్మపుత్ర నది ఏర్పరిచిన దీవి పేరు మాజులీ. ఇది భారత్​లో  గల పెద్దదైన నదీ ఆధార దీవి. బ్రహ్మపుత్ర నది ఏర్పరిచే డెల్టా సుందర్బన్స్​. 
ఉపనదులు: ఉత్తరం: తీస్తా, మానస, గంగాధర్​, సుభన్​సిరి, ధన్​సిరి.
దక్షిణాన: దిబ్రు, డిక్కు, దిహాంగ్​.

సోన్​: మధ్యప్రదేశ్ లోని అమర్​కంటక్​ పీఠభూమిలో జన్మించే సోన్​ నది నర్మదకు వ్యతిరేకంగా మధ్యప్రదేవ్​, జార్ఖండ్​, బిహార్​ రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ పాట్నా వద్ద గంగా నదిలో కలుస్తుంది. దీని ప్రధానమైన ఉపనది రిహాండ్​. 
దామోదర్​: జార్ఖండ్​లోని చోటానాగపూర్​లోని టోరి అనే ప్రాంతంలో జన్మించే దామోదర్​ పశ్చిమబెంగాల్​లోని హుగ్లీనదిలో కలుస్తుంది. దీనిని బెంగాల్​ దు:ఖదాయని అని అంటారు. ఉపనదులు బరాకర్​, కోనార్​.