లక్ష ఆర్థిక సాయం.. ఇచ్చిన ఫండ్స్ ​ఒక్క నెలకే పూర్తి

లక్ష ఆర్థిక సాయం..  ఇచ్చిన ఫండ్స్ ​ఒక్క నెలకే పూర్తి

లక్ష ఆర్థిక సాయం.. 
ఇచ్చిన ఫండ్స్ ​ఒక్క నెలకే పూర్తి
బీసీలకు లక్షసాయం కోసం 5.20 లక్షల అప్లికేషన్లు
అందరికీ అందించాలంటే రూ.5,280 కోట్లు కావాలె
రెండుమూడు నెలలు ఇచ్చి కోడ్ ​పేరుతో ఆపేస్తారని చర్చ

హైదరాబాద్, వెలుగు : బీసీ కులవృత్తిదారులకు లక్ష రూపాయల ఆర్థిక సాయం కోసం ప్రభుత్వం మంగళవారం రిలీజ్​చేసిన రూ.400 కోట్లు ఒక్క నెలకే సరిపోయాయి. మంత్రి గంగుల కమలాకర్ గురువారం స్కీంపై రివ్యూ సందర్భంగా చెప్పిన దాని ప్రకారం ప్రతి నెల ఒక్కో నియోజకవర్గంలో 300 మందికి చొప్పున 119 నియోజకవర్గాల్లో 35,700 మందికి చెక్కులు అందాల్సి ఉంటుంది. ఈ లెక్కన మొత్తం రూ.357 కోట్లు ఈ నెలలో లబ్ధిదారులకు ఇవ్వాల్సి ఉంటుంది. స్కీం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 5.28 లక్షల దరఖాస్తులు వచ్చాయి.

ఇలా నెలకు 35,700 మందికి చొప్పున అమలు చేయాలంటే దరఖాస్తుదారులు అందరికీ అందేందుకు 15 నెలల సమయం పడుతుంది. ఇందు కోసం రూ.5,280 కోట్లు అవసరం అవుతాయి. మరి, అన్ని నిధులను ఎట్లా సర్దుబాటు చేస్తారన్నది అనుమానంగా మారింది. లబ్ధిదారుల లిస్ట్ పెడతామని తొలుత ప్రకటించిన రాష్ట్ర సర్కారు.. ఇప్పుడు ప్రతి నెలా నియోజకవర్గానికి కేవలం 300 మందినే ఎంపిక చేస్తామని ప్రకటించింది. ప్రస్తుతం నిధుల్లేక రాష్ట్రంలో స్కీముల అమలుకు సర్కారు తల పట్టుకుంటున్నది. అప్పులు చేస్తున్నా చాలకపోతుండడంతో ఏమీ చేయలేని పరిస్థితిలో పడింది. ఈ నేపథ్యంలోనే నిరంతర ప్రక్రియ అని చెప్తున్నట్లు తెలుస్తున్నది. ఎలక్షన్లు దగ్గరపడుతుండడంతో ఓ రెండుమూడు నెలల పాటు స్కీమును అమలు చేసి.. ఆ తర్వాత ఎన్నికల కోడ్ పేరుతో బంద్ పెడ్తారేమోనన్న చర్చ సాగుతున్నది.