చర్చలతోనే సమ్మెకు ముగింపు!

చర్చలతోనే సమ్మెకు ముగింపు!

ఆత్మహత్యలు ఉద్యమం కాదు. సమస్యకు అసలు అది పరిష్కారమే కాదు. ఈ విషయాన్ని తెలంగాణ ఉద్యమ సందర్భంలోనూ చెప్పినా బలిదానాలు ఆగలేదు. ఎట్లాగయితేనేమి… సకల జనుల, సబ్బండ వర్గాల వారి పోరాటంతో తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. స్వరాష్ట్రంలో బలిదానాలుండవని ఆశించాం. దురదృష్టవశాత్తు ఇవ్వాళ ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీనికి స్ఫూర్తి తెలంగాణ ఉద్యమం నుంచే వచ్చిందంటే తప్పు కాదు. ఈ తప్పుడు ఆలోచనలకు ముగింపు పలకాలంటే ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను చర్చలకు పిలవాలి. ‘ఇగ వారితో మాట్లాడేది లేదు’ అనే ధోరణి వల్ల సమస్య మరింత జటిలం కావడమే గాకుండా పరిష్కార ద్వారాలు మూసుకు పోయే ప్రమాదముంది. మొదట సమ్మె విరమింప జేసేందుకు కృషి జరగాలి. సమ్మె విరమిస్తే గానీ ఆత్మహత్యలు ఆగవు.

ప్రభుత్వం ఎలాంటి పట్టింపులకు పోకుండా 50,000 మంది ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోవాలి.  వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి.  అంతేగాకుండా, అనుభవం లేని డ్రైవర్లు బస్సులు నడపడంవల్ల రోజూ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఇది కూడా ప్రమాదకరమే! సమ్మె మూలంగా ఇప్పటికే  అకడమిక్ ఇయర్ ప్లాన్​లో వెనుకబడ్డ తెలంగాణ మరింత నష్టపోయే ప్రమాదముంది. కేజీ నుంచి పీజీ వరకు విద్య ఏమో గానీ ఇవ్వాళ స్టూడెంట్లందరూ స్కూళ్లకు, కాలేజీలకు దూరమయ్యారు. తెలంగాణ ఉద్యమ సందర్భంలో విద్యా సంస్థల బంద్ వల్ల జరిగిన నష్టం అంతా ఇంతా కాదు. ఇప్పుడు కూడా తెలంగాణ భారీగా నష్టపోనుంది. పోటీ పరీక్షల్లో మిగతా రాష్ట్రాలవారితో సమానంగా టాలెంట్​ చూపించే అవకాశాన్ని మనవాళ్లు కోల్పోతున్నారు.

ప్రతి విషయం కోర్టుదాకా పోయి పరిష్కారం సాధించుకోవాలంటే… అది ప్రజాస్వామ్య ప్రభుత్వానికి మచ్చగా మిగిలి పోతుంది. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకోవాలి. ముందుగా గుర్తింపు పొందిన ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులతో ప్రభుత్వం చర్చలు జరపాలి. ఎలాంటి రాగద్వేషాలకు లోనుకాబోమని ప్రభుత్వాధినేతలు శాసనం ద్వారా ప్రమాణం చేశారు. కాబట్టి దాన్ని తు.చ. తప్పకుండా పాటిస్తూ సమస్యను పరిష్కరించే దిశలో ప్రభుత్వం పనిచేయాలి. ఆర్టీసీ కార్మికులు కూడా ప్రభుత్వంతో పంతానికి పోకుండా పూర్తి సహాయ సహకారాలు అందజేయాలి.

– ‘సింగిడి’ తెలంగాణ రచయితల సంఘం