న్యూ ఇయర్​ రోజు జరిగిన​ దాడిపై రష్యా వివరణ

న్యూ ఇయర్​ రోజు జరిగిన​ దాడిపై రష్యా వివరణ
  •     ఆ దాడిలో 89 మంది సోల్జర్లు చనిపోయారని వెల్లడి
  •     మొబైల్ వాడకంతో శత్రువుకు అవకాశం చిక్కిందని కామెంట్

మాస్కో: ఉక్రెయిన్​లోని డొనెట్స్క్ లోని ఆర్మీ క్యాంప్​పై జరిగిన దాడిలో తమ సోల్జర్లు 89 మంది ప్రాణాలు కోల్పోయారని రష్యా రక్షణ శాఖ పేర్కొంది. ఈ దాడికి ప్రధాన కారణం తమ సోల్జర్లు మొబైల్​ ఫోన్లు వాడడమేనని వివరించింది. మొబైల్​ సిగ్నళ్ల ఆధారంగా క్యాంపు లొకేషన్​ను ట్రేస్​ చేసి.. ఉక్రెయిన్​ మిసైళ్లతో విరుచుకుపడిందని తెలిపింది.

నిషేధం ఉన్నా ఫోన్లు వాడారు..

గత నెల 31న డొనెట్స్క్ (తూర్పు ఉక్రెయిన్ లో రష్యా స్వాధీనం చేసుకున్న ప్రాంతాల్లో డొనెట్స్క్  ఒకటి) లోని మాకివ్ కాలో ఒకేషనల్  కాలేజీలో ఉన్న రష్యా సైనిక స్థావరాన్ని సెల్ ఫోన్  సిగ్నళ్ల ఆధారంగా ఉక్రెయిన్ ఆర్మీ గుర్తించిందని, దీంతో తమ సోల్జర్లపై ఈజీగా దాడికి పాల్పడిందని రక్షణ శాఖ తెలిపింది. ఆ ప్రాంతంలో సెల్ ఫోన్లు వాడరాదని, కానీ అక్రమంగా మొబైల్​ ఫోన్​ వాడి తమ శత్రువుకు అవకాశం ఇచ్చారని తెలిపింది. మాకివ్  కాలో నాలుగు ఉక్రెయిన్  మిసైల్స్ తమ తాత్కాలిక స్థావరాలపై అటాక్  చేశాయని, ఈ ఘటనపై ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించామని తెలిపింది. 

తమ సైనికులందరూ మొబైల్  ఫోన్లు వాడడంతో వారు ఎక్కడున్నారో సిగ్నల్స్ ఆధారంగా శత్రు సైన్యం కనిపెట్టిందని, దీంతో ఉక్రెయిన్ మిసైల్ దాడి చేయడానికి  తమ వారే సహకరించినట్లయిందని రక్షణ శాఖ అధికారులు పేర్కొన్నారు. కాగా, ఈ దాడిపై ఉక్రెయిన్  ప్రెసిడెంట్ జెలెన్ స్కీ స్పందించలేదు. మంగళవారం ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ‘‘రష్యా మాపై భీకరంగా దాడులుచేసే అవకాశం ఉంది. ఆ విషయంలో మాకెలాంటి సందేహం లేదు. ఆ ఎత్తుగడలను భగ్నం చేయాలి. ఆ టెర్రరిస్టులు (రష్యా సైనికులు) ఓడిపోవాలి. వారి ప్రయత్నాలను  సఫలం కానీయరాదు”  అని జెలెన్  స్కీ పేర్కొన్నారు.