
- పిండ ప్రదానం చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- పుష్కరస్నానం చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నాగేశ్వర్‌రావు
జయశంకర్ భూపాలపల్లి/ మహదేవ్‌పూర్, వెలుగు: సరస్వతి పుష్కర ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతోంది. హరహర మహాదేవ శంభో శంకర అంటూ శైవ క్షేత్రం మార్మోగుతోంది. శనివారం పుష్కరాల మూడోరోజు, వీకెండ్ కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. తెలంగాణ, చత్తీస్గడ్, మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ నుంచి ఉదయం నుంచి కాళేశ్వరం బాట పట్టారు. త్రివేణి సంగమ క్షేత్రం సరస్వతీ నదిలో పుణ్యస్నానాలు ఆచరించి తరించారు.
నది వద్ద పూజలు చేసి, దీపాలు వెలిగించి నదిలో వదిలారు. సారె, చీరే, పసుపు కుంకుమలతో సరస్వతీ దేవికి పూజ చేశారు. సైకత లింగాలను చేసి కొబ్బరికాయలు కొట్టి నమస్కరించారు. అనంతరం కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివాని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు క్యూలైన్లలో బారులు తీరడంతో దర్శనానికి సమయం పట్టింది.
శనివారం ఒక్క రోజే లక్షా యాభై వేలమందికి పైగా భక్తుల హాజరైనట్లుగా దేవాదాయ శాఖ ఆఫీసర్లు ప్రకటించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తన సోదరుడితో కలిసి పెద్దలకు పిండప్రదానం చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు పుష్కరస్నానం ఆచరించారు. వీకెండ్‌తో భారీగా వెహికల్స్ రాగా కాళేశ్వరం, మహదేవ్‌పూర్ రూట్‌లో 15 కి.మీ దూరం ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో పలువురు భక్తులు ఇబ్బంది పడ్డారు. ఫ్రీ బస్సులు సరిపోకపోవడంతో మరో 2 కి.మీ దూరం నడుచుకుంటూ వెళ్లారు.