డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో, మైత్రీ మూవీస్ కార్యాలయంలో ముగిసిన ఐటీ సోదాలు

డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో, మైత్రీ మూవీస్ కార్యాలయంలో ముగిసిన ఐటీ సోదాలు

హైదరాబాద్ లో టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ ఇంటితో పాటు జూబ్లీహిల్స్ లోని మైత్రి మూవీ మేకర్స్ లో ఐటీ అధికారుల సోదాలు ముగిశాయి. 12 గంటల పాటు మైత్రి మూవీస్ లో ఐటీ శాఖ అధికారులు సోదాలు జరిపారు. మొత్తం నాలుగు వాహనాల్లో మైత్రి ఆఫీస్ నుంచి ఐటీ బృందాలు వెళ్లిపోయాయి. మైత్రి సంస్థలో పని చేసే ఉద్యోగుల నుంచి కీలక సమాచారం సేకరించారు. ప్రొడక్షన్ యూనిట్, ఆఫీస్ స్టాఫ్ ను విచారించారు. మైత్రి మూవీస్ లో ఉద్యోగుల సాలరీ చెల్లింపుల వివరాలను ఐటీ అధికారులు అడిగి తెలుసుకున్నారు. అకౌంట్ మేనేజర్లు, ప్రొడక్షన్ మేనేజర్లను ఏప్రిల్ 20వ తేదీన మరోసారి విచారించనున్నారు. సోదాల సందర్భంగా కేంద్ర బలగాలతో సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నారు ఐటీశాఖ అధికారులు.

జీఎస్టీ నిబంధనలను ఉల్లంఘించడంతో పాటు..ఐటీ రిటర్న్‌లలో తప్పుడు వివరాలను అందించినందుకు గాను సోదాలు నిర్వహించారని తెలుస్తోంది. సినిమాల నిర్మాణ యూనిట్ల కొనుగోలు, వాటికి సంబంధించిన పన్నులపై ఐటీ రిటర్న్ లలో నిబంధనలను ఉల్లంఘించారని అధికారులు తేల్చారు. గత ఏడాది జీఎస్‌టీ రిటర్న్‌లను ధృవీకరించిన ఐటీ శాఖ అధికారులు..వారి ఆడిటర్లను ప్రశ్నించారు.

టాలీవుడ్ లో డైరెక్టర్ సుకుమార్ వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. నాన్నకు ప్రేమతో, రంగస్థలం, పుష్ప సినిమాలు బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపించాయి. ప్రస్తుతం పుష్ప 2 సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయబోతున్నారు. పుష్ప 2 సినిమాను రూ. 500 కోట్లతో తెరకెక్కిస్తున్నారు. సినిమాలకు దర్శకత్వం వహించడంతో పాటు..ఈ మధ్య పలు సినిమాలను కూడా నిర్మించారు. పుష్ప 2 సినిమా కోసం డైరెక్టర్ సుకుమార్  ఏకంగా రూ. 100  కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని తెలుస్తోంది.