2వ రోజు ముగిసిన సీబీఐ కస్టడీ విచారణ..చంచల్ గూడ జైలుకు ఎంపీ అవినాష్ తండ్రి

2వ రోజు ముగిసిన సీబీఐ కస్టడీ విచారణ..చంచల్ గూడ జైలుకు ఎంపీ అవినాష్ తండ్రి

హైదరాబాద్‌ : మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ ల రెండో రోజు సీబీఐ కస్టడీ విచారణ ముగిసింది. ఆ తర్వాత ఇద్దరిని చంచల్ గూడ జైలుకు సీబీఐ అధికారులు తరలించారు. ఏప్రిల్ 20న దాదాపు 7 గంటల పాటు విచారించారు. వివేకానందరెడ్డి హత్య కేసు అంశానికి సంబంధించి దారితీసిన ప్రధాన కారణాలపై సీబీఐ ఆరా తీసింది. ఆర్ధిక లావాదేవీలపై కూడా ప్రశ్నించారు. హత్యకు పన్నిన కుట్ర, సాక్ష్యాధారాలు చేరిపేయడంలో ఇరువురి పాత్రపై విచారించారు. ఇద్దరిని విడి విడిగా విచారించారు.

వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను ఆరు రోజుల సీబీఐ కస్టడీకి కోర్టు అనుమతించింది, దీంతో అధికారులు బుధవారం నుంచి విచారిస్తున్నారు. అయితే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే వారిని విచారించాలని, తిరిగి చంచల్ గూడ జైలుకు తరలిచాలని అధికారులకు న్యాయస్థానం ఆదేశించింది. అలాగే న్యాయవాదుల సమక్షంలోనే విచారించాలని కూడా సూచించింది. ఈ నెల 24వ తేదీ వరకు ఆ ఇద్దరినీ సీబీఐ అధికారులు విచారించనున్నారు.