రెండో దశ కంటి వెలుగు స్కీంను కండ్లద్దాల పంపిణీకే పరిమితం

రెండో దశ కంటి వెలుగు స్కీంను కండ్లద్దాల పంపిణీకే పరిమితం
  • 55 లక్షల రీడింగ్ గ్లాసులు, సైట్​ గ్లాసుల పంపిణీ టార్గెట్​
  • కంటి పరీక్షలకు వచ్చిన ప్రతి ముగ్గురిలో ఒకరికి కచ్చితంగా అద్దాలు
  • ఒక్కో రీడింగ్ గ్లాస్​కు రూ. 95.. సైట్ గ్లాస్‌‌కు రూ. 280 ఖర్చు చేయనున్న ప్రభుత్వం
  • నేడు 1,491 ఆప్తాల్మిక్ ఆఫీసర్ల పోస్టులకు నోటిఫికేషన్​.. ఔట్‌‌ సోర్సింగ్ పద్ధతిలో నియామకం

హైదరాబాద్, వెలుగు: రెండో దశ కంటి వెలుగు స్కీమ్​ను కండ్లద్దాల పంపిణీకే పరిమితం చేయాలని, ఎట్టి పరిస్థితుల్లో ఆపరేషన్ల జోలికి పోకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రీడింగ్ గ్లాసులు, సైట్​ గ్లాసులు కలిపి 55 లక్షల వరకు పంపిణీ చేయాలని టార్గెట్‌‌గా పెట్టుకుంది. హెల్త్ స్టాఫ్‌‌కు ఇస్తున్న ట్రైనింగ్​లోనూ ఇదే విషయం చెప్తున్నారు. కంటి పరీక్షల కోసం వచ్చిన ప్రతి ముగ్గురిలో ఒకరికి కచ్చితంగా అద్దాలు ఇవ్వాలని సూచిస్తున్నారు. ఇప్పటికే కండ్లద్దాల కొనుగోలు కోసం టెండర్లు పిలవగా, పది కంపెనీలు టెండర్ వేశాయి. గతంలో కంటే ఈసారి క్వాలిటీ అద్దాలు ఇవ్వనున్నట్టు ఆఫీసర్లు చెప్తున్నారు. ఒక్కో రీడింగ్ గ్లాసుకు రూ. 95, సైట్ గ్లాస్‌‌‌‌కు రూ. 280 వరకు వెచ్చించేందుకు సర్కార్ సిద్ధమైనట్టు తెలిసింది. టెస్టు చేసుకున్న వెంటనే రీడింగ్ గ్లాసులు ఇవ్వనుండగా, టెస్ట్​ చేసుకున్న 15 నుంచి నెల రోజుల వ్యవధిలో సైట్ గ్లాసులను అందజేయనున్నారు. 

ఫస్ట్​ ఫేజ్​లో పదివేల మందికి కూడా ఆపరేషన్లు చేయలే!

కంటి వెలుగు తొలి దశలో అవసరమైన వాళ్లందరికీ ఆపరేషన్లు చేయిస్తామని అప్పట్లో సర్కార్ ప్రకటించింది. ఆపరేషన్లు చేయించేందుకు 180 హాస్పిటళ్లను నోటిఫై చేసింది. 2018 ఆగస్టులో స్ర్కీనింగ్ ప్రారంభమవగా.. అదే నెలలో ఆపరేషన్లు చేయించడం కూడా ప్రారంభించారు. ఆ తర్వాత నెలలో వరంగల్ జిల్లాలోని జయ హాస్పిటల్‌‌‌‌లో కంటి వెలుగు ఆపరేషన్లు వికటించి ఏకంగా 18 మందికి చూపు పోయింది. ఈ ఘటనతో కంటి వెలుగు ఆపరేషన్లను ప్రభుత్వం ఆపేసింది. ఆ తర్వాత మళ్లీ స్టార్ట్ చేయలేదు. ఫస్ట్ ఫేస్​లో మొత్తం 1.54 కోట్ల మందికి కంటి పరీక్షలు చేసిన డాక్టర్లు.. 6,42,290 మందికి క్యాటరాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (శు క్లాలు), 3,16,976 మందికి పెద్దాపరేషన్లు అవసర మని తేల్చారు. కానీ, ఇందులో పది వేల మందికి కూడా సర్కార్ ఆపరేషన్లు చేయించలేకపోయింది. రీడింగ్ గ్లాసులు, సైట్ గ్లాసులు పంపిణీ చేసి కార్యక్రమాన్ని ముగించింది. కానీ, కంటి వెలుగుతో లక్షల మందికి కంటి చూపును ప్రసాదించామని ఐదేండ్ల నుంచి రాష్ట్ర సర్కార్ ప్రచారం చేసుకుంటున్నది. ఈసారి కూడా ఆపరేషన్లు చేయిస్తే రిస్క్ అవుతుందేమోనని.. ఆపరేషన్ల జోలికి వెళ్లొద్దని నిర్ణయించింది.

ఆప్షన్ ఎన్‌‌‌‌పీసీబీ!

దేశంలో కంటి సమస్య ఉన్నవారికి ఆపరేషన్లు చేయించేందుకు నేషనల్ ప్రోగ్రామ్‌‌‌‌ ఫర్ బ్లైండ్‌‌‌‌నెస్ కంట్రోల్‌‌‌‌(ఎన్‌‌‌‌పీసీబీ) కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నది. ఈ స్కీమ్ కింద ఎవరైనా కం టి శుక్లాల ఆపరేషన్ ఉచితంగా చేయించుకునే వెసులుబాటు ఉంది. అయితే, ఒక్కో ఆపరేషన్‌‌‌‌కు రూ. 2,500 మాత్రమే చెల్లిస్తుండడంతో, కొన్ని హాస్పి టళ్లే ఎన్‌‌‌‌పీసీబీ కింద ఆపరేషన్లు చేస్తున్నాయి. ఎల్వీ ప్రసాద్, లయన్స్ క్లబ్‌‌‌‌ సహా ఎన్‌‌‌‌పీసీబీ కింద ఆపరేషన్లు చేసే దవాఖాన్లు రాష్ట్రంలో 18 ఉన్నాయి. రెండో విడత కంటి వెలుగులో ఎవరికైనా శుక్లాల ఆపరేషన్లు అవసరమని భావిస్తే ఎన్​పీసీబీ పరిధిలోని దవాఖాన్లకు రెఫర్ చేయాలని ఆఫీసర్లు భావిస్తున్నారు. దీనికి కూడా ఇప్పటి దాకా ప్రభుత్వం నుంచి పర్మిషన్ రాలేదని, అసలు ఆపరేషన్లు జోలికే వెళ్లొద్దని సర్కార్ సూచించిందని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.

1,491 పోస్టులకు నోటిఫికేషన్

కంటి వెలుగు కార్యక్రమం కోసం 1,491 ఆప్తాల్మిక్ ఆఫీసర్లను ఔట్‌‌‌‌ సోర్సింగ్ పద్ధతిలో నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం  నిర్ణయించింది. జిల్లాల వారీగా ఈ నియామకాలు చేపట్టాలని హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ శ్వేతా మహంతి అన్ని జిల్లాల కలెక్టర్లకు లేఖ రాశారు. గురువారమే అన్ని జిల్లాల్లో నోటిఫికేషన్ వెలువడనుంది. ఆప్తాల్మిక్ ల్యాబ్ అసిస్టెంట్ కోర్సులు చేసిన వారు ఈ పోస్టులకు అర్హులు కాగా.. వాక్ ఇన్ ఇంటర్వ్యూ పద్ధతిలో ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఈ ఇంటర్వ్యూలు అన్ని జిల్లాల్లో డిసెంబర్ ఐదో తేదీన జరుగుతాయి. పదో తేదీన మెరిట్ లిస్ట్ విడుదల చేస్తారు. నెలకు రూ.30 వేల చొప్పున వేత నం చెల్లించాలని నిర్ణయించారు.