జొకోవిచ్‌‌‌‌కు షాక్‌‌‌‌..సెమీస్‌‌‌‌లోనే ఓడిన సెర్బియన్‌‌‌‌

జొకోవిచ్‌‌‌‌కు షాక్‌‌‌‌..సెమీస్‌‌‌‌లోనే ఓడిన సెర్బియన్‌‌‌‌
  •     ఫైనల్లో సినెర్‌‌‌‌, మెద్వెదెవ్‌‌‌‌

మెల్‌‌‌‌బోర్న్‌ ‌‌‌:  ఆస్ట్రేలియన్‌‌‌‌ ఓపెన్‌‌‌‌ తుది దశలో పెను సంచలనం నమోదైంది. వరల్డ్‌‌‌‌ నంబర్‌‌‌‌వన్‌‌‌‌, సెర్బియా సూపర్‌‌‌‌ స్టార్‌‌‌‌ నొవాక్‌‌‌‌ జొకోవిచ్‌‌‌‌ సెమీస్‌‌‌‌లోనే ఇంటిముఖం పట్టాడు. శుక్రవారం జరిగిన పోరులో నాలుగోసీడ్‌‌‌‌ జానిక్‌‌‌‌ సినెర్‌‌‌‌ (ఇటలీ) 6–1, 6–2, 6–7 (6/8), 6–3తో టాప్‌‌‌‌సీడ్‌‌‌‌ జొకోవిచ్‌‌‌‌ (సెర్బియా)పై సంచలన విజయం సాధించి ఫైనల్లోకి అడుగుపెట్టాడు. దీంతో కెరీర్‌‌‌‌లో 25వ గ్రాండ్‌‌‌‌స్లామ్‌‌‌‌ గెలవాలన్న జొకో ఆశలకు చెక్‌‌‌‌ పెట్టాడు. అలాగే 11వ ఆస్ట్రేలియన్‌‌‌‌ ఓపెన్‌‌‌‌ టైటిల్‌‌‌‌ అందకుండా చేశాడు. ఓవరాల్‌‌‌‌గా జొకోతో తలపడిన నాలుగుసార్లలో మూడుసార్లు గెలిచిన సినెర్‌‌‌‌.. ఈ టోర్నీ ఫైనల్‌‌‌‌ చేరిన యంగెస్ట్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌గా రికార్డులకెక్కాడు. ఇక 2018లో నాలుగో రౌండ్‌‌‌‌లో ఓడిన జొకోవిచ్‌‌‌‌ ఆ తర్వాత సెమీస్‌‌‌‌ చేరిన ప్రతిసారి ఎప్పుడూ ఓడలేదు.

తాజా ఫలితంతో సెర్బియన్‌‌‌‌ 33 మ్యాచ్‌‌‌‌ల వరుస విజయాలకు బ్రేక్‌‌‌‌ పడింది. 2005 తర్వాత ఫెడరర్‌‌‌‌, నడాల్‌‌‌‌, జొకోవిచ్‌‌‌‌ లేకుండా ఆస్ట్రేలియన్‌‌‌‌ ఓపెన్‌‌‌‌ ఫైనల్‌‌‌‌ జరుగుతుండటం ఇదే మొదటిసారి. 3 గంటల 22 నిమిషాల మ్యాచ్‌‌‌‌లో 22 ఏళ్ల సినెర్‌‌‌‌ అద్భుతంగా ఆడాడు. తొలి రెండు సెట్లలో జొకో సర్వీస్‌‌‌‌ను రెండుసార్లు బ్రేక్‌‌‌‌ చేసి ఆధిక్యంలోకి వచ్చి సెట్‌‌‌‌లను గెలిచాడు. కానీ మూడోసెట్‌‌‌‌లో జొకో గట్టి పోటీ ఇచ్చాడు. అయితే టైబ్రేకర్‌‌‌‌లో మ్యాచ్‌‌‌‌ పాయింట్‌‌‌‌ కోసం సెర్బియన్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌ను సినెర్‌‌‌‌ దాదాపు గంటపాటు ముప్పుతిప్పలు పెట్టాడు.

నాలుగో సెట్‌‌‌‌లో జొకో ట్రేడ్‌‌‌‌ మార్క్‌‌‌‌ షాట్లకు ఈజీగా చెక్‌‌‌‌ పెట్టిన సినెర్‌‌‌‌ అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నాడు. మరో సెమీస్‌‌‌‌లో డానియెల్‌‌‌‌ మెద్వెదెవ్‌‌‌‌ (రష్యా) 5–7, 3–6, 7–6 (7/4), 7–6 (7/5), 6–3తో అలెగ్జాండర్‌‌‌‌ జ్వెరెవ్‌‌‌‌ (జర్మనీ)పై నెగ్గి టైటిల్‌‌‌‌ ఫైట్‌‌‌‌కు అర్హత సాధించాడు. 4 గంటల 18 నిమిషాల పోరాటంలో ఇద్దరు చెరో 14 ఏస్‌‌‌‌లు సంధించారు. 6 డబుల్‌‌‌‌ ఫాల్ట్స్‌‌‌‌ చేసిన మెద్వెదెవ్‌‌‌‌ 52 విన్నర్స్‌‌‌‌ సాధించాడు. అయితే 70 అన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌డ్‌‌‌‌ ఎర్రర్స్‌‌‌‌ చేసిన జ్వెరెవ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ను చేజార్చుకున్నాడు.