
ముషీరాబాద్, వెలుగు : నీట్–2024 నిర్వహణలోని అవకతవకలపై విచారణ జరపాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఎన్ టీఏను రద్దు చేసి, నీట్ ను మళ్లీ నిర్వహించాలని కోరింది. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ నాయకులు శుక్రవారం సుందరయ్య పార్క్‌నుంచి భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్.ఎల్.మూర్తి, టి.నాగరాజు మాట్లాడుతూ నీట్ క్వశ్చన్పేపర్లీకేజీపై స్పందించకుండా, గ్రేస్‌మార్కులు పొందిన వారి స్కోర్‌కార్డులు రద్దు చేస్తామనడం కరెక్ట్‌కాదన్నారు.
వారికి మాత్రమే తిరిగి ఎగ్జామ్ నిర్వహిస్తే నీట్అవకతవకలను పక్కదారి పట్టించినట్లేనని మండిపడ్డారు. కేంద్రం తీరుతో నీట్ ర్యాంకులు తారుమారై, దేశ వ్యాప్తంగా గందరగోళం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నీట్ నిర్వహణపై అనేక అనుమానాలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేయకుండా ఎన్ టీఏ ఏకపక్షంగా వ్యవరిస్తోందని మండిపడ్డారు. ఎగ్జామ్జరగడానికి ఒకరోజు ముందు బిహార్ రాజధాని పాట్నాలో 13 మందిని పేపర్ లీకేజీ విషయంలో అరెస్టు చేశారని చెప్పారు. హర్యానాలో ఒకే సీరియల్ నంబర్ కలిగిన ఎనిమిది మంది స్టూడెంట్లకు టాప్ ర్యాంకులు వచ్చాయని తెలిపారు.
రాజస్థాన్, గుజరాత్ లోనూ ఇలాంటి లీకేజీలు బయటపడ్డాయన్నారు. వీటన్నింటిపై విచారణ జరపకుండా కేవలం గ్రేస్ మార్కులు మాత్రమే రద్దు చేసి, రీఎగ్జామ్ పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. ఎన్ టీఏ చైర్మన్, డైరెక్టర్లను తప్పించాలని, వారిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.