
‘అఖండ’ మూవీతో బాక్సాఫీస్‌ని షేక్ చేశారు బాలకృష్ణ. అందుకే ఆ తర్వాతి సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. విడుదలైన ప్రతి పోస్టర్, టీజర్ ఎక్స్‌పెక్టేషన్స్‌ని పెంచుకుంటూ పోతున్నాయి. సినిమా ఎప్పుడు రిలీజవుతుందా, ఎప్పుడెప్పుడు బాలయ్యని మరోసారి మాస్ అవతార్‌లో చూసి ఎంజాయ్ చేద్దామా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు వారిని సంతోషంలో ముంచేసే వార్త ఒకటి బయటికొచ్చింది. బాలయ్య, గోపీచంద్‌ల సినిమాకి రిలీజ్ డేట్ ఫిక్సయ్యిందనేదే ఆ వార్త. వచ్చే వేసవి కానుకగా ఏప్రిల్ 7న మూవీని రిలీజ్ చేయాలని నిర్ణయించారట దర్శక నిర్మాతలు. నిజానికి వర్క్ జరుగుతున్న స్పీడ్‌ని బట్టి అంతకంటే ముందే ఈ సినిమా వచ్చేస్తుందనుకున్నారు. అయితే మధ్యలో షూటింగులు బంద్ కావడంతో పని ఆగింది.
పైగా విదేశాల్లో తీయాల్సిన షెడ్యూల్ విషయంలోనూ వీసా ఇబ్బందులు వచ్చాయని, అందువల్ల కాస్త డిలే అవుతోందని అంటున్నారు. మరోవైపు ‘అఖండ’ సెంటిమెంట్‌ని ఫాలో అవుతూ డిసెంబర్‌లోనే విడుదల చేసేస్తే బాగుంటుందనే ఆలోచనలోనూ ఉన్నట్టు మరో టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా టీమ్ నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ వస్తే తప్ప ఈ విషయంలో క్లారిటీ రాదు. శ్రుతీహాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్‌కుమార్, దునియా విజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. దీని తర్వాత అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తన నూట ఎనిమిదో సినిమా చేయనున్నారు బాలకృష్ణ.