- రేవంత్ కనుసన్నల్లోనే సింగరేణి టెండర్ల స్కామ్: దాసోజు శ్రవణ్
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి తన బామ్మర్ది కళ్లలో సంతోషం కోసం బొగ్గు గనులను కట్టబెట్టే ప్రయత్నం చేశారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. తప్పుడు పద్ధతిలో కోల్ టెండర్ ఇచ్చారా లేదా అని ప్రశ్నించారు. నైనీ టెండర్లు రద్దు చేశామని గొప్పలు చెబుతున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. ఏ కారణంతో రద్దు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. శనివారం తెలంగాణ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి కనుసన్నల్లోనే సింగరేణి టెండర్ల స్కామ్ జరిగిందన్నారు.
పేపర్లలో వార్తలు రాసిన వ్యక్తుల గురించి భట్టి మాట్లాడారని, మరి ఆ వార్తలు రాయించింది ఎవరని ప్రశ్నించారు. భట్టి 40 ఏండ్ల రాజకీయ జీవితంపై ఎవరికీ అభ్యంతరం లేదని, 50 ఏండ్ల రాజకీయ జీవితం ఉన్న కేసీఆర్‌ను సీఎం రేవంత్ నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం దోపిడీ కోసమే గద్దెనెక్కినట్టుందన్నారు. రాష్ట్రాన్ని దోచుకుతింటున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో అన్ని ఆఫీసులనూ రియల్ ఎస్టేట్ ఆఫీసులుగా మార్చేలా ఉన్నారని విమర్శించారు.
