
-
మట్టి వెలికితీత, బొగ్గు ఉత్పత్తికి అనుకూలం
-
పెద్దవాటికంటే.. చిన్నవాటితోనే ఎక్కువ పని
-
భవిష్యత్‌లో వీటి వినియోగంపైనే అధికారులు ఇంట్రెస్ట్
కోల్‌బెల్ట్, వెలుగు: సింగరేణి బొగ్గు ఉత్పత్తిలో ఓపెన్‌కాస్ట్ గనులు కీలకం. ఓసీపీల్లో మట్టి (ఓవర్‌బర్డెన్) వెలికితీత, బొగ్గు ఉత్పత్తికి భారీ మెషీన్లు ఎంతో అవసరం. ప్రస్తుతం వినియోగించే షావల్స్ మెషీన్ల పనితీరుపై సంస్థ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. 11,12 క్యూబిక్ మీటర్ల భారీ షావల్స్కంటే 5 క్యూబిక్ మీటర్లున్న షావల్స్ తోనే ఎక్కువగా.. చురుగ్గా పనులు జరుగుతుండటంతో భవిష్యత్ లోనూ వాటికే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు.
కొంతకాలం కింద కొత్తగూడెంలో జరిగిన సమీక్ష సమావేశంలోనూ షావల్స్పనితీరుపై ఏరియా జీఎంలు, ప్రాజెక్టు ఆఫీసర్లు, ఇంజనీర్ల అభిప్రాయాలను తీసుకున్న ఆపరేషన్, ఈఅండ్ఎం విభాగాల ఉన్నతాధికారులు, షావల్స్ పనితీరుపై సుదీర్ఘంగా చర్చించారు. పెద్ద షావల్స్తో సమానంగా చిన్నవిపని చేస్తున్నాయి. ఇక ప్రైవేటు ఓబీ వెలికితీసే కాంట్రాక్టర్లు సైతం 5 క్యూబిక్ మీటర్ల షావల్స్ను ఎక్కువగా వాడుతున్నారు. దీంతో తక్కువ ఖర్చుతో ఎక్కువ పని జరిగేలా చిన్న షావల్స్కే ప్రాధానం ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చారు.
పెద్ద షావల్స్ రూ.14 కోట్లు కాగా.. చిన్నవి రూ. 6 కోట్లు మాత్రమే. ఇక సింగరేణి వ్యాప్తంగా 22 ఓపెన్కాస్ట్గనుల్లో 11,12 మీటర్ల భారీ షావల్స్తో పాటు 5 క్యూబిక్‌మీటర్ల షావల్స్ ను నడుపుతుంది. మొత్తంగా 894 ఉన్నాయి. వీటిలో అత్యంత కీలకమైన షావల్స్104 ఉండగా.. వీటి ద్వారానే ఓబీ(మట్టి), బొగ్గును వెలికితీసి 445 డంపర్ల ద్వారా ఓబీని డంప్‌యార్డ్‌కు, బొగ్గును సీహెచ్‌పీలకు రవాణా చేస్తుంటారు.