TRSలో చేరిన కాంగ్రెస్ MLAల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గత ఎన్నికల్లో వారి చేతిలో ఓడిపోయిన గులాబీ నేతలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి KTR తాజాగా టికెట్ హామీలు ఇస్తుండడం సిట్టింగులను కలవర పెడుతోంది. ప్రశాంత్ కిషోర్ సర్వేలో పాజిటివ్ రిజల్ట్ వస్తేనే టికెట్ ఇస్తామన్న కేటీఆర్ కామెంట్స్ తో రానున్న రోజుల్లో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ నేతలను వెంటాడుతోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ పై గెలిచిన 14 మంది MLA లు టీఆర్ఎస్ లో చేరారు. వీరి చేతిలో ఓడిపోయిన అప్పటి గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కూడా పార్టీలోనే కొనసాగుతున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు నడుస్తోంది. కొన్ని చోట్ల మాజీ నేతలకు పార్టీలో ప్రాధాన్యత లేకపోవడంతో వేరే పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరిగింది. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు తమకే వస్తాయని సిట్టింగ్ ఎమ్మెల్యేలు భావించారు. కానీ తాజాగా మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్స్ జంప్ జిలానీ ఎమ్మెల్యేలకు దడ పుట్టిస్తున్నాయి.
ఖమ్మం టూర్ లో మంత్రి కేటీఆర్ ఆ జిల్లాలోని పాత నేతలకు టికెట్ ఇస్తామని హామీ ఇవ్వడం, ప్రశాంత్ కిషోర్ సర్వే ఆధారంగానే టికెట్లు ఇస్తామని చెప్పడం... ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టెన్షన్ పుట్టిస్తోంది. కాంగ్రెస్ నుంచి గెలిచి ఆ పార్టీని కాదని గులాబీ గూటికి చేరితే ఇప్పుడు ఈ కండిషన్స్ తెరపైకి రావడం ఏంటని నేతలు ఆందోళన చెందుతున్నారు. మంత్రి KTR వ్యాఖ్యలతో మాజీ MLAలు నియోజకవర్గాల్లో మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. మరోవైపు స్థానిక క్యాడర్ కూడా వారి వైపే ఉండడం సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.
ఖమ్మం జిల్లాలో సీనియర్లు, అసంతృప్త నేతలతో ప్రత్యేకంగా భేటీ అయిన కేటీఆర్.. మాజీ మంత్రి తుమ్మలతో పాటు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి టిక్కెట్ ఇస్తామని హామీ ఇచ్చినట్లు జిల్లా నేతలు చెబుతున్నారు. పాలేరు నుంచి తుమ్మల, కొత్తగూడెంలో పని చేసుకోవాలని పొంగులేటికి సూచించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్ లో చేరిన పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి పరిస్థితి ఏంటన్న చర్చ జరుగుతోంది. ఇక కొత్తగూడెంలో కాంగ్రెస్ నుంచి గెలిచిన వనమా వెంకటేశ్వరరావు ప్రస్తుతం టీఆర్ఎస్ లో ఉన్నారు. స్థానికంగా ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటనలో వనమా కొడుకు జైలు పాలయ్యాడు. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేమని టీఆర్ఎస్ హైకమాండ్ వనమాకు చెప్పినట్లు తెలుస్తోంది. ఇక వనమా చేతిలో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్ రావు కూడా టీఆర్ఎస్ లోనే ఉన్నారు. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కొత్తగూడెంలో పని చేసుకోమని చెప్పడంతో జలగం కూడా ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు.
నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి ఉంది. మాజీ ఎమ్మెల్యే వీరేశం ..మంత్రి కేటీఆర్ తో సన్నిహితంగా ఉండటం... కాంగ్రెస్ లో గెలిచి టీఆర్ఎస్ లో చేరిన చిరుమర్తి లింగయ్యకు ఇబ్బందిగా మారింది. వేముల వీరేశం కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం జరిగినా... కొద్ది రోజుల క్రితం మంత్రి కేటీఆర్ పిలిచి మాట్లాడటంతో... ఆయన వర్గం మళ్లీ యాక్టివ్ అయ్యింది. సర్వేల్లో చిరుమర్తికి పాజిటివ్ టాక్ వస్తే తప్ప టిక్కెట్ ఇచ్చే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో మాజీ మంత్రి జూపల్లి ఓడిపోవడంతో ఆయనపై గెలిచిన హర్షవర్ధన్ రెడ్డి కారెక్కారు. ఐతే స్థానికంగా హర్షపై తీవ్ర వ్యతిరేకత ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. మొన్నటి వరకు బీజేపీ, కాంగ్రెస్ వైపు చూసిన జూపల్లి ఈ మధ్య సైలెంట్ అయ్యారు. పార్టీ అధిష్ఠానం నుంచి సంకేతాలు రావడంతోనే జూపల్లి వ్యూహం మార్చి ఉంటారనే చర్చ నియోజకవర్గంలో జరుగుతోంది.
ఇక ఇల్లందు, మహేశ్వరం నియోజకవర్గంలోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. మహేశ్వరంలో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డిని TRS హైకమాండ్ పక్కన పెట్టడంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అనుచరులు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచి టీఆర్ఎస్ లో చేరడంపై నియోజకవర్గంలో సబితపై క్యాడర్ ఆగ్రహం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇటు తీగలను పట్టించోకవడం లేదని గులాబీ పార్టీ గుర్రుగా ఉంది. రెండు వర్గాలు సహకరించకపోవడంతో మున్సిపల్ ఎన్నికల్లో ఆ ఎఫెక్ట్ బాగానే కనిపించింది. ఈ పరిస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని గులాబీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటారో అన్నది హాట్ టాపిక్ గా మారింది.
TRS లో చేరినప్పుడు కండిషన్లు ఏమీ చెప్పకుండా.. తీరా ఎన్నికల టైం దగ్గర పడుతున్నప్పుడు ఇలాంటి ఫిట్టింగ్ లు పెట్టడం ఏంటని కొందరు జంపింగ్ ఎమ్మెల్యేలు అనుచరుల దగ్గర వర్రీ అవుతున్నట్టు తెలుస్తోంది.
