వినోద రంగం సైజ్ రూ.8.60 లక్షల కోట్లకు ఇంకో పదేళ్లలో చేరుకుంటాం: ముకేశ్ అంబానీ

వినోద రంగం సైజ్ రూ.8.60 లక్షల కోట్లకు ఇంకో పదేళ్లలో చేరుకుంటాం: ముకేశ్ అంబానీ
  • ఇండియాలో బోలెడు అవకాశాలు ఉన్నాయి
  • వేవ్స్ ఈవెంట్‌లో ముకేశ్ అంబానీ

ముంబై: రానున్న పదేళ్లలో  ఇండియా  మీడియా,  వినోద పరిశ్రమ సైజ్  ప్రస్తుత స్థాయి నుంచి  దాదాపు నాలుగు రెట్లు పెరిగి 100 బిలియన్ డాలర్ల (రూ.8.60 లక్షల కోట్ల) చేరుకుంటుందని నెట్‌‌వర్క్‌‌18 వంటి మీడియా గ్రూప్‌‌ను కంట్రోల్ చేస్తున్న ముకేశ్ అంబానీ గురువారం అన్నారు. ముంబైలోని జియో వరల్డ్‌‌ సెంటర్‌‌‌‌లో జరుగుతున్న వేవ్స్ ఈవెంట్‌‌లో ఆయన మాట్లాడారు.  ప్రస్తుతం మీడియా, వినోద రంగంలో ఏడాదికి 28 బిలియన్ డాలర్ల (రూ.2.40 లక్షల కోట్ల)  రెవెన్యూ జనరేట్ అవుతోంది. అంబానీ ప్రకారం,  భారతదేశం ప్రపంచ వినోద కేంద్రంగా మారే రోజు ఎంతో దూరంలో లేదు.

అత్యధిక జనాభా కలిగిన దేశం కావడంతో ఒకసారి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారితే, ఇండియా మీడియా,  వినోద రంగం ప్రపంచంలోనే  అతిపెద్దదిగా మారగలుగుతుంది.  “రాబోయే పదేళ్లలో  లక్షలాది ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి” అని అంబానీ అంచనా వేశారు.  5జీ సాయంతో  ప్రపంచ-స్థాయి డిజిటల్ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌ను డెవలప్ చేశామని, త్వరలో 6జీ కూడా అందుబాటులోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.  కాగా, తాజాగా డిస్నీతో కలిసి జియో హాట్‌‌స్టార్ ప్లాట్‌‌ఫారమ్‌‌ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఐపీఎల్ వంటి పెద్ద ఈవెంట్‌‌ను ఈ ప్లాట్‌‌ఫారమ్‌‌ ప్రసారం చేస్తోంది.