ఎస్ఎల్​బీసీ పూర్తయ్యేదెన్నడు..?

 ఎస్ఎల్​బీసీ పూర్తయ్యేదెన్నడు..?

‘నీళ్లు, నిధులు, నియామకాలు’ అనే నినాదంతోనే రాష్ట్రం ఏర్పడింది. నీళ్ల విషయంలో స్వరాష్ట్రంలో న్యాయం జరగడం లేదు. రాష్ట్రం ఏర్పడి 8 ఏండ్లు కావొస్తున్నా.. ఇంకా చాలా ప్రాజెక్టులు ఎక్కడివక్కడే ఉన్నాయి. శ్రీశైలం ఎడమ కాలువ, శ్రీరాంసాగర్ రెండో దశ, శ్రీరాంసాగర్ వరద కాలువ, నాగార్జునసాగర్ వరద కాలువ, ఆదిలాబాద్ జిల్లాలోని 20 మధ్య తరహా ప్రాజెక్టుల నిర్మాణం.. ఇలా రెండు మూడు దశాబ్దాలు కింద చేపట్టిన పాత ప్రాజెక్టులు నేటికీ పూర్తి కావడం లేదు. సర్కారు నామమాత్రపు నిధుల కేటాయింపులతో వాటి నిర్మాణం నెమ్మదిగా సాగుతోంది.

శ్రీశైలం ఎడమ గట్టు కాలువ
ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు పేరుతో 1983లో శ్రీశైలం ఎడమ గట్టు కాలువను ప్రారంభించారు. శ్రీశైలం నుంచి 42 మీటర్ల సొరంగం తీసి 2.70 లక్షల ఎకరాలకు నీటి సౌకర్యం అందించాలన్నది ప్రాజెక్టు ఉద్దేశం. కాగా సొరంగ మార్గం 32 కిలో మీటర్ల వరకే పూర్తయి ఆగిపోయింది. ప్రస్తుతం డిండి ప్రాజెక్టు ద్వారా మహబూబ్ నగర్ జిల్లా గుండా నీటిని తేవడానికి ప్రత్యామ్నాయ ప్రయత్నం చేస్తున్నారు. సొరంగ మార్గాన్ని పూర్తి చేయడాన్ని పక్కన పెట్టేశారు. 2009 జూన్19న ఈ ప్రాజెక్టును విస్తృతపరుస్తూ.. ఉదయ సముద్రం బ్యాక్​వాటర్​నుంచి మరో లక్ష ఎకరాలకు నీరు ఇవ్వడానికి రూ.699 కోట్లతో పథకం రూపొందించారు. ఇలా మొత్తం 4,11,572 ఎకరాల ఆయకట్టుకు పథకం రూపొందించారు. ఇప్పటికి 2,85,286 ఎకరాల ఆయకట్టు సాగులోకి వచ్చినట్టు ప్రభుత్వం చెబుతున్నా.. వాస్తవానికి 80 వేల ఎకరాలు మాత్రమే సాగులోకి వచ్చింది. ఈ వాస్తవాన్ని మరుగున పడేసేందుకు ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. 

ప్రాజెక్టుకు నిధులేవి?
ప్రాజెక్టు అంచనా వ్యయం మొదలు రూ.8,090 కోట్లుగా నిర్ణయించగా, మార్చి 2019 నాటికి రూ.6,417 కోట్లు ఖర్చు చేశారు. 2019–-20లో రూ. 3 కోట్లు, 2020–-21లో రూ. 3 కోట్లు మాత్రమే కేటాయించారు. 2021–-22లో రూ.331.41 కోట్లు, 2022–-23లో రూ. 178.58 కోట్ల కేటాయింపు చూపారు. అయితే ఈ నిధులతో ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాదు. పైగా నీటి లభ్యతకు ఏర్పాట్లు చేయకుండానే దిగువన ప్రాజెక్టు ఆయకట్టును విస్తరించారు. ఇలా అరకొర నిధుల కేటాయింపుతో 4 దశాబ్దాలుగా ప్రాజెక్టు నిర్మాణం జరుగుతూనే ఉంది. త్వరలో నీళ్లొస్తాయని ప్రచారం చేయడమే తప్ప, ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేసి ప్రాజెక్టును పూర్తి చేయడం లేదు. ఈ ప్రాజెక్టుకు సొరంగ మార్గం లేకపోవడంతో నాగార్జునసాగర్ బ్యాక్​వాటర్​నుంచి పుట్టంగండి వద్ద 511 మీటర్ల ఎత్తులో లిఫ్ట్ పథకాన్ని ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి అక్కంపేట పంపుల వద్దకు, అక్కంపేట నుంచి ఎస్ఎల్ బీసీతోపాటు హైదరాబాద్​కు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. వాస్తవంగా కృష్ట్రానది నుంచి హైదరాబాద్ కు 4 టీఎంసీల నీరు తీసుకోవచ్చని1975లో బచావత్ కమిటీ తీర్పులో ఉంది. దాని తరువాత పుట్టంగండి నుంచి 3 దశలుగా ఒక్కో దశలో హైదరాబాద్​కు పైపులైన్లు వేశారు. ప్రస్తుతం15 టీఎంసీల నీటిని హైదరాబాద్ కు తరలించారు.15 టీంఎసీల నీటిని తరలించడంతో సాగుకు 7 టీఎంసీలే వినియోగిస్తున్నారు. 7 టీఎంసీలతో 70 వేల ఎకరాల మెట్ట పంటలకే నీరు అందుతోంది. ప్రస్తుతం 4వ దశను రూ.1400 కోట్లతో ప్రారంభించారు. సుంకిశాల నుంచి కోదండపూర్ కు ఈ ప్రాజెక్టు నిర్మాణం చేస్తున్నారు. సుంకిశాల నుంచి ప్రాజెక్టు పూర్తయితే అప్పుడు ఎస్ఎల్ బీసీకి 22 టీఎంసీల నీటి లభ్యత ఉంటుంది. అయితే ప్రాజెక్టుకు 30 టీఎంసీల నీటితో 3.70 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటి సౌకర్యం ఎలా కల్పిస్తారనేది ప్రశ్న. ఒక విధంగా ఎస్ఎల్ బీసీ ఆయకట్టుకు నీటి లభ్యత నిర్ణీత టీఎంసీలు అందించాలంటే సొరంగ మార్గాన్ని పూర్తి చేయాలి. దీనికి  మరో రూ.1500 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. ప్రత్యామ్నాయంగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నుంచి దిండి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి నీరు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా ఖర్చుతో కూడిన పని.

పూర్తయ్యేందకు నాలుగు దశాబ్దాల కాలమా?
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ పనులను1983లో ప్రారంభించి నేటికీ కొనసాగిస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం 2019-20, 2020-21లో రూ.3 కోట్ల చొప్పున మాత్రమే కేటాయించిందంటే ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తోందో అర్థం చేసుకోవచ్చు. లిఫ్టు పథకాలకు అమర్చిన 4 పంపుల్లో  ఒక్కోటి 600 క్యూసెక్కుల నీటిని మాత్రమే పోస్తాయి. ఈ లెక్కన 5 రోజులకు ఒక టీఎంసీ నీరు విడుదల అవుతుంది. 30 టీఎంసీల నీరు విడుదల కావాలంటే 150 రోజులు నిర్విరామంగా పంపులు పని చేయాలి. అది సాధ్యం కాదు. టెక్నికల్ గా చూసినా కేటాయించిన నీరు ఆయకట్టుకు అందదనేది స్పష్టం. హైదరాబాద్ కు కేటాయించిన నీరు పెరుగుతున్నది. సుంకిశాల నుంచి కోదండపూరు చేపట్టిన ప్రాజెక్టు త్వరగా పూర్తయితే తప్ప ఎస్ఎల్ బీసీకి నీరు రాదు. రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు తగిన పథకాన్ని రూపొందించడంతోపాటు సకాలంలో నిధులను కేటాయించాలి. వాగ్దానం చేసినట్టు నీటి సరఫరాను త్వరగా పూర్తి చేయాలి.
- సారంపల్లి మల్లారెడ్డి,ఉపాధ్యక్షులు ఆలిండియా కిసాన్​సభ