తొలకరి వానల కోసం రైతుల ఎదురు చూపులు

తొలకరి వానల కోసం రైతుల ఎదురు చూపులు

హైదరాబాద్: రాష్ట్రంలోకి రుతుపవనాలు రేపు లేదా ఎల్లుండి ప్రవేశించే అవకాశం ఉందని తెలిపింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ప్రస్తుతం బంగాళాఖాతంలోకి ఎంటర్ అయ్యాయని..పశ్చిమ, మధ్య, వాయువ్య బంగాళాఖాతంలోకి రుతుపవనాలు ఎంట్రీ ఇచ్చేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయన్నారు. నైరుతి రాష్ట్రంలోకి ప్రవేశించే వరకు రాష్ట్రంలో మిశ్రమ వాతావరణ పరిస్థితులు ఉంటాయన్నారు వెదర్ ఆఫీసర్లు. తొలకరి వానల కోసం రైతులకు  ఎదురు చూపులు తప్పటం లేవు. ఇప్పటికీ చాలా జిల్లాల్లో చినుకు జాడ లేకపోవడంతో వర్షాలు ఎప్పుడు పడతాయోనని టెన్షన్ లో ఉన్నారు. టెంపరేచర్స్ భారీగా నమోదవుతుండటంతో.. జనాలు ఉక్కబోతతో ఇబ్బందులు పడుతున్నారు. ఈసారి రెండు రోజులు ముందే రుతుపవనాలు వస్తాయని వాతావరణశాఖ అధికారులు ప్రకటించినా అదీ జరగలేదు. ఇప్పుడు రుతుపవనాలు రాష్ట్రంలోకి రేపు లేదా ఎల్లుండి ఎంట్రీ చాన్స్ ఉందని వెదర్ ఆఫీసర్లు చెబుతున్నారు. నైరుతి రుతుపవనాలు ఈనెల 8వ తేదీన రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ మొదటగా వేసిన అంచనాలు తప్పాయి. కొన్ని ప్రతికూల పరిస్థితుల కారణంగా రుతుపవనాల రాక ఆలస్యమైందంటున్నారు వెదర్ ఆఫీసర్లు. వచ్చే 48 గంటల్లో  ఏపీ, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో నైరుతి ఎంటరయ్యే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.

నైరుతి రుతుపవనాలు శనివారం ముంబైకి చేరుకున్నాయని ఐఎండీ తెలిపింది. మధ్య అరేబియా సముద్రంలోని మిగిలిన ప్రాంతాలకు, కొంకణిలోని చాలా ప్రాంతాలకు మధ్య మహారాష్ట్రలోని కొన్ని ఏరియాలకు, కర్ణాటకలోని మరికొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు ప్రవేశించాయని వాతావారణ శాఖ తెలిపింది. వచ్చే కొన్ని రోజుల్లో అటు నార్త్ అరేబియా సముద్రం, గుజరాత్… ఇటు తెలంగాణ, ఏపీ, బంగాళాఖాతం, బెంగాల్, సిక్కిం, ఒడిసా ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించే అనుకూల పరిస్థితులు ఉన్నాయని వాతవరణ శాఖ తెలిపింది. నార్మల్ గా రుతుపవనాలు ఎంటరయ్యే వారం ముందు నుంచే టెంపరేచర్లు తగ్గుతాయన్నారు అధికారులు. కానీ ఈసారి మిశ్రమ వాతావరణం ఉందంటున్నారు. ఒక వైపు ఉక్కబోత, మరో వైపు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయన్నారు. దీంతో ఈశాన్య జిల్లాలకు వడగాల్పుల అలెర్ట్.. పశ్చిమ, ఉత్తర జిల్లాలకు రెయిన్ అలర్ట్ ఇస్తున్నామన్నారు. వచ్చే మూడురోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. అటు ఆదిలాబాద్ జిల్లాలో ఉరుములు మెరుపులుతో కూడిన వర్షం పడింది. ఇన్నాళ్లు ఉక్కబోతతో సతమతమైన జిల్లా ప్రజలకు తొలకరి వానలు ఉపశమనం కలిగించాయి. ఇప్పటికే దుక్కిలో పత్తి విత్తనాలు విత్తుకున్న రైతులు.. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో హర్షం వ్యక్తంచేస్తున్నాయి.