స్పీకర్‌‌ నిర్ణయం తీసుకునే వరకు కోర్టుకు రాకూడదు

స్పీకర్‌‌  నిర్ణయం తీసుకునే వరకు కోర్టుకు రాకూడదు
  •   ఆయన నిర్ణయం తర్వాతే న్యాయ సమీక్ష చేయాలి
  •   పార్టీ ఫిరాయింపుల కేసులో ప్రభుత్వం, ఎమ్మెల్యేల వాదన
  •   రాజకీయ ప్రయోజనాలతో వేసిన పిటిషన్లను కొట్టివేయాలని వినతి

హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్‌‌  స్పీకర్‌‌  వద్ద ఉండగా, దానికి సంబంధించిన వ్యవహారంలో స్పీకర్‌‌కు కోర్టులు ఉత్తర్వులు జారీ చేయలేవని హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం, పార్టీ ఫిరాయింపు అభియోగాలను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల తరఫు న్యాయవాదులు వాదించారు. పార్టీ ఫిరాయింపుల అంశంపై స్పీకర్‌‌  నిర్ణయం తీసుకున్న తర్వాతే కోర్టులు న్యాయ సమీక్ష చేయడానికి వీలుంటుందని వారు చెప్పారు. 

ఈ నేపథ్యంలో స్పీకర్‌‌  వద్ద పిటిషన్లు పరిశీలన దశలో ఉండగా వాటిని పరిష్కరించాలని స్పీకర్‌‌  కార్యాలయానికి ఉత్తర్వులు జారీ చేయాలంటూ హైకోర్టులో దాఖలైన వ్యాజ్యాలు చెల్లవన్నారు. వాటిని అపరిపక్వ పిటిషన్లుగా పరిగణించి కొట్టేయాలని కోరారు. రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా దాఖలు చేసిన పిటిషన్లను డిస్మిస్‌‌  చేయాలని గురువారం ప్రభుత్వం తరపున అడ్వొకేట్‌‌  జనరల్‌‌  ఎ.సుదర్శన్‌‌ రెడ్డి, ప్రతివాదులైన దానం నాగేందర్‌‌ తరఫున సీనియర్‌‌  న్యాయవాది పి.శ్రీరఘురాం, కడియం శ్రీహరి తరఫున సీనియర్‌‌  న్యాయవాది బి.మయూర్‌‌ రెడ్డి వాదించారు. 

అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీఆర్‌‌ఎస్‌‌  తరఫున గెలుపొంది కాంగ్రెస్‌‌లో చేరిన కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్‌‌ఎస్‌‌  ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌‌ రెడ్డి, కేపీ వివేకానంద, దానం నాగేందర్ పై బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్‌‌ రెడ్డి వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్‌‌  బి.విజయ్‌‌సేన్‌‌ రెడ్డి గురువారం విచారించారు. మహేశ్వర్‌‌ రెడ్డి పిటిషన్‌‌లో స్పీకర్‌‌  కార్యాలయం తన ఫిర్యాదును రిజిస్టర్‌‌  పోస్టులో పంపితే వెనక్కి వచ్చేసిందని,  తన పిటిషన్‌‌ ను స్వీకరించేలా స్పీకర్‌‌కు ఉత్తర్వులు ఇవ్వాలనేది పరిమితమైన వ్యవహారమని ఏజీ చెప్పారు. 

మహేశ్వర్‌‌ రెడ్డి పిటిషన్‌‌ను స్వీకరించేందుకు స్పీకర్‌‌  కార్యాలయం సిద్ధమేనని చెప్పారు. మిగిలిన పిటిషన్లను ఆదిలోనే కొట్టేయాలని ఏజీతోపాటు మిగిలిన ఇద్దరు న్యాయవాదులు కోరారు. పార్టీ ఫిరాయింపులు, అనర్హత అంశాలపై శాసనసభ నిర్ణయం తీసుకోదని, పదో షెడ్యూల్‌‌  ప్రకారం స్పీకర్‌‌.. ట్రైబ్యునల్‌‌, చైర్మన్‌‌  హోదాలో నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. రాజ్యాంగం ప్రకారం అత్యున్నత పదవిలో ఉన్న స్పీకర్‌‌కు కోర్టులు ఉత్తర్వులు జారీ చేయలేవని సుప్రీంకోర్టు గతంలో తీర్పులు ఇచ్చాయని గుర్తుచేశారు. 

స్పీకర్‌‌  తన వద్ద ఉన్న వివాదంపై నిర్ణయం తీసుకునే వరకు న్యాయసమీక్షకు వీల్లేదన్నారు. ఇక్కడ  పిటిషన్లు ఉన్నందున స్పీకర్‌‌  తన వద్ద ఉన్న వివాదాలను కనీసం పరిశీలన కూడా చేయలేదన్నారు. ఎర్రబెల్లి దయాకర్‌‌  రావు దాఖలు చేసిన కేసులో ఇదే హైకోర్టు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని గుర్తుచేశారు. వాదనలు విన్న జడ్జి..  మహేశ్వర్‌‌ రెడ్డి పిటిషన్‌‌ను స్పీకర్‌‌  కార్యాలయం స్వీకరించాలని, పిటిషన్‌‌  అందినట్లుగా స్పీకర్‌‌  కార్యాలయం రసీదు కూడా ఇవ్వాలని స్పీకర్‌‌  కార్యదర్శికి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు.