శ్రీరామ్ సాగర్ 34 గేట్లు ఎత్తివేత

శ్రీరామ్ సాగర్ 34 గేట్లు ఎత్తివేత

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ కురుస్తున్న వానలతో  గోదావరి ఉగ్రరూపం దాల్చింది. శ్రీరామ్ సాగర్  ప్రాజెక్ట్ కు భారీగా వరద పోటెత్తుతోంది. దీంతో ప్రాజెక్టు 34 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఇన్ ఫ్లో 3,93,245 క్యూసెక్కులు ఉండగా..ఔట్ ఫ్లో 4,01,535 క్యూసెక్కులుగా ఉంది. శ్రీరామ్ సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా..ప్రస్తుతం   1087,7అడుగులకు చేరింది.  నదీ పరివాహాక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని..అత్యవసరం అయితే ప్రజలు బయటకు రావాలని అధికారులు సూచించారు. చరిత్రలో తొలిసారిగా జులై లో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 34 గేట్లను ఎత్తివేశారు. ఈ ప్రాజెక్టు కట్టి ఏడు దశాబ్దాలు దాటుతోంది. వాస్తవానికి భారీ వర్షాలు కురిస్తే..ఆగస్ట్, సెప్టెంబర్ మాసాల్లో గేట్లను ఎత్తుతుంటారు. ఈసారి మాత్రం జులై రెండో వారంలో గేట్లను ఎత్తివేయడం ఇదే తొలిసారి. వరద అంతకంతకు పెరుగుతుండటంతో అధికారులు అలర్ట్ అయ్యారు. వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు.

మరోవైపు  మంజీరా నది కూడా ఉగ్రరూపం దాలుస్తోంది. నాసిక్ లోని  త్రయంబకేశ్వర్ వద్ద వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇలాగే పరిస్థితి కంటిన్యూ అవుతే.. గైక్వాడ్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశం ఉంది. దీని గేట్లు ఎత్తితే  శ్రీరాంసాగర్ కు భారీగా వరద వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ధర్మపురం పట్టణంలో గోదావరి ఉరకలెత్తుతోంది. పట్టణంలోకి నీరు ప్రవేశించడంతో పలు కాలనీలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. కొన్ని చోట్ల ఇళ్లలోకి నీరు ప్రవేశించింది. ధర్మపురి పరిసర ప్రాంతాల్లోని పంటలు నీట మునిగిపోయాయి.