శ్రీశైలం..కరెంట్​ ప్రాజెక్టే

శ్రీశైలం..కరెంట్​ ప్రాజెక్టే

హైదరాబాద్​, వెలుగు: శ్రీశైలం ప్రాజెక్టును కరెంట్​ తయారీ కోసమే కట్టారని, కాబట్టి అది ముమ్మాటికీ హైడ్రో పవర్​ ప్రాజెక్టేనని తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పింది. శ్రీశైలంను హైడ్రోపవర్​ ప్రాజెక్టుగా 1963లోనే ప్లానింగ్​ కమిషన్​ గుర్తించిందని తెలిపింది. కృష్ణా రివర్​ మేనేజ్​మెంట్​ బోర్డు(కేఆర్​ఎంబీ) చైర్మన్​ చంద్రశేఖర్​ అయ్యర్​కు ఇరిగేషన్​ శాఖ ఈఎన్సీ మురళీధర్​ ఆదివారం లేఖ రాశారు. శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రంలో కరెంట్​ తయారీని ఆపేయాలంటూ బోర్డు రాసిన లేఖకు ఆయన సమాధానం చెప్పారు. ఏపీ తప్పుగా వాదిస్తోందన్నారు. కరెంట్​ ఉత్పత్తి ద్వారానే శ్రీశైలం నుంచి నీటిని కిందకు వదలాలని బచావత్​ అవార్డు 104వ పేజీలో స్పష్టంగా పేర్కొందని గుర్తు చేశారు. ఆ రూల్​ను కాదని ఏపీ ప్రభుత్వమే శ్రీశైలం నీటిని ఇతర బేసిన్లకు మళ్లిస్తోందన్నారు. నాగార్జునసాగర్​, కృష్ణా డెల్టా ఆయకట్టు సాగునీటి అవసరాల కోసమే శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేయాలని బచావత్​ అవార్డులో స్పష్టం చేశారన్నారు. కృష్ణా డెల్టాకు గోదావరి నీటిని మళ్లిస్తే.. శ్రీశైలం నుంచి సాగర్​కు 265 టీఎంసీలను కరెంట్​ తయారీ ద్వారా తరలించాలని, గోదావరి నుంచి డెల్టాకు 80 టీఎంసీలకు తీసుకుంటే.. సాగర్​కు వచ్చే 265 టీఎంసీల్లో ఏపీ కోటాను తగ్గించాల్సిందిగా అవార్డులో పేర్కొన్నారని గుర్తుచేశారు. గోదావరి నీటిని ఇచ్చంపల్లి లేదా ఎలబాక నుంచి నేరుగా నాగార్జునసాగర్​కే తరలించినా శ్రీశైలం నుంచి కనీసం 180 టీఎంసీలు తరలించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
కరెంట్​ పంచుకొమ్మని చెప్పలేదు
2015లో శ్రీశైలం ద్వారా తయారు చేసే కరెంట్​ను సగం సగం పంచుకున్నది ఆ ఏడాదికే వర్తిస్తుందని, దానిని ఎప్పుడూ అమలు చేసేందుకు ఎలాంటి అవకాశమూ లేదని ఈఎన్సీ తేల్చి చెప్పారు. ఏపీ విభజన చట్టంలోని 12వ షెడ్యూల్​, సెక్షన్​ 1 ప్రకారం ఏపీ జెన్​కోలోని పవర్​ ప్లాంట్లను భూమి హద్దుల ఆధారంగా విభజించారని చెప్పారు. కరెంట్​ను సగం, సగం పంచుకోవాలని చట్టంలో ఎక్కడా చెప్పలేదన్నారు. కరెంట్​ తయారీపై ఏపీ అర్థం లేని పనికిమాలిన వాదన చేస్తోందన్నారు. కరెంట్​ తయారీ ద్వారా తరలిస్తున్న నీటిని ఏపీ సాగు, తాగు నీటి కోసం వాడుకుంటూ తెలంగాణపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. తమకు కేటాయించిన నీటిని తెలంగాణ తనకు ఇష్టమొచ్చినట్టు వాడుకుంటుందని, దీనిపై ఏపీ అభ్యంతరం చెప్పాల్సిన అవసరమే లేదని ఈఎన్సీ తేల్చి చెప్పారు. 
కనీస మట్టాన్ని ఏపీ మెయింటెయిన్​ చెయ్యలే
1990–91 వాటర్​ ఇయర్​ నుంచి 2019–20 వరకు ఏప్రిల్​, మే నెలల్లో శ్రీశైలంలో 834 అడుగుల కనీస నీటి మట్టాన్ని ఏపీ మెయింటెయిన్​ చేయలేదని ఈఎన్సీ లేఖలో పేర్కొన్నారు. ఇప్పుడేమో ఇతర బేసిన్లకు నీటిని తరలించేందుకు 854 అడుగుల కనీస నీటిమట్టాన్ని మెయింటెయిన్​ చేయాలంటూ ఏపీ ఎలా అడుగుతుందని ప్రశ్నించారు. కృష్ణా డెల్టాకు నీళ్లివ్వడం కోసం శ్రీశైలంలో 760 అడుగుల వరకు వెళ్లి నీటిని రివర్​ స్లూయిజ్​ల ద్వారా తీసుకోవడానికి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 2013లో మెమో జారీ చేసిందని గుర్తు చేశారు.

 
అవి వరద ఆధారంగా కట్టిన ప్రాజెక్టులు 
తెలుగు గంగ, గాలేరు నగరి, హెచ్​ఎన్​ఎస్​ఎస్​, వెలిగొండ ప్రాజెక్టులను ఏపీ ప్రభుత్వం వరద నీటి ఆధారంగానే నిర్మించిందని మురళీధర్​ లేఖలో గుర్తుచేశారు. వీటి ద్వారానే కృష్ణా నీళ్లను వేరే బేసిన్లకు తరలిస్తోందన్నారు. శ్రీశైలంలో 880 అడుగుల కన్నా ఎక్కువ నీటి మట్టం ఉన్నప్పుడే వాటి ద్వారా నీటిని తీసుకుంటామంటూ బ్రజేశ్​ ట్రిబ్యునల్​ (కేడబ్ల్యూడీటీ–2)కు సమర్పించిన ఆయా ప్రాజెక్టుల డీపీఆర్​లలో ఏపీ పేర్కొందని గుర్తు చేశారు. అలాంటప్పుడు ఆ ప్రాజెక్టులకు నికర జలాలు తీసుకోవడం సరికాదన్నారు. ఏపీ ఇప్పుడు శ్రీశైలం నుంచి మళ్లిస్తున్న నికర జలాలకు సమాన కోటాను నాగార్జునసాగర్​, కృష్ణా డెల్టా సిస్టంలో తగ్గించుకోవాలని డిమాండ్​ చేశారు. 

చెన్నైకి 10 టీఎంసీలు కూడా ఇయ్యలె 
చెన్నై తాగునీటి అవసరాల కోసం 1976, 1977లో మహారాష్ట్ర, కర్నాటక, ఉమ్మడి ఏపీ చేసుకున్న ఒప్పందం ప్రకారం.. జులై–అక్టోబర్​ మధ్యలో రోజూ 1,500 క్యూసెక్కుల చొప్పున 15 టీఎంసీలు ఇవ్వాల్సి ఉంటుందని ఈఎన్సీ చెప్పారు. 854 అడుగుల లెవెల్​ నుంచి శ్రీశైలం రైట్​ కెనాల్​, తెలుగు గంగకు కలిపి వంద రోజుల్లో తీసుకోవాల్సింది 2,250 క్యూసెక్కులేనని పేర్కొన్న ఈఎన్సీ.. 2019–20లో 170 టీఎంసీలు, 2020–21లో 124 టీఎంసీలకుపైగా నీటిని ఏపీ తరలించుకుపోయిందని చెప్పారు. చెన్నైకి కనీసం 10 టీఎంసీలు కూడా ఇవ్వలేదన్నారు. శ్రీశైలం నుంచి తరలించే నీటి నిల్వ కోసం పెన్నా బేసిన్​లో 360 టీఎంసీల సామర్థ్యుమన్న రిజర్వాయర్లు కట్టారని ఆరోపించారు.