
- రెండు నెలల తర్వాతే నివేదిక.. ఆ తర్వాతే నిర్ణయం
- చట్టం అమలుపై రాష్ట్రాలకు కొన్ని వెసులుబాట్లు
- కొన్ని ఫైన్లు తగ్గించే యోచనలో రాష్ట్ర సర్కారు
- ప్రజల నుంచి వ్యతిరేకత, ఎలక్షన్లూ కారణం
- కోర్టు జరిమానాలు యథాతథం
హైదరాబాద్, వెలుగు: కొత్త మోటార్ వెహికల్యాక్ట్ అమలుపై రాష్ట్ర ప్రభుత్వం వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ ఒకటినే అమలు చేయాల్సి ఉండగా, ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేదు. ఇతర రాష్ట్రాల్లో అమలు తీరును పరిశీలించాకే నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. ఇందుకోసం త్రీమెన్ కమిటీ వేసింది. వీరు వివిధ రాష్ట్రాల్లో కొత్త చట్టం ఎలా అమలవుతుంది? ఫైన్లు తగ్గించారా? పెంచారా? అనేది స్టడీ చేసి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇస్తారు. కమిటీ నివేదిక ఇవ్వడానికి రెండు నెలలు పట్టే అవకాశం ఉంది. అయినా ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపించడంలేదు.
రాష్ట్రాలకు వెసులుబాటు
సెప్టెంబర్ 1 నుంచి కొత్త మోటారు వెహికల్ యాక్ట్‌ను అమలు చేయాలని కేంద్రం గెజిట్ ఇచ్చింది. భారీగా చలాన్లు వేస్తారన్న ప్రచారంతో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కేంద్రం చట్టం తీసుకొచ్చినా, దాన్ని యథాతథంగా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాల్సిన అవసరం లేదని, కొన్ని మార్పులు చేసుకునే వెసులుబాటు రాష్ట్రాలకు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ట్రాఫిక్ ఫైన్లపై రాష్ట్రాలే సొంతంగా నిర్ణయాలు తీసుకోవచ్చని ఇటీవల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా స్పష్టంచేశారు. ,Government ,Tri-Committee ,Implementation,New, Motor, Vehicle, Act
ఫైన్ల తగ్గింపు
త్రీమెన్ కమిటీ రిపోర్ట్ ఇచ్చాక ఫైన్లను తగ్గించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఫైన్లు భారీగా తగ్గకున్నా, కొద్ది మేర తగ్గనున్నట్లు సమాచారం. త్వరలోనే మున్సిపల్, జీహెచ్‌ఎంసీ ఎన్నికలు రానున్నాయి. మోటారు వెహికల్ యాక్ట్ ను కేంద్రమే తెచ్చినా, అమలు చేస్తే వ్యతిరేకత రాష్ట్రంపైనే పడుతోందనే భావనలో రాష్ట్ర సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఎఫెక్ట్ పడవచ్చనే చట్టం అమలు ఆలస్యం చేయడంతోపాటు ఫైన్లు తగ్గించనున్నట్లు సమాచారం. డ్రంక్ అండ్ డ్రైవ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్, లైసెన్స్ లేకుండా డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్‌లాంటి నేరాలకు కొత్త యాక్ట్ ప్రకారమే శిక్షలు అమలుకానున్నాయి.
ఇతర రాష్ట్రాల్లో ఇలా..
కొత్త చట్టం అమలుపై ఒక్కో రాష్ట్రం ఒక్కోలా స్పందిస్తోంది. పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు ఈ చట్టం అమలు చేయబోమని కుండబద్ధలు కొట్టాయి. గుజరాత్ లో ఫైన్లు తగ్గిస్తూ అక్కడి సర్కార్ నిర్ణయం తీసుకుంది. బీహార్‌లో అమలు చేస్తున్నా.. వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు. ఫైన్లు వేయకుండా హెల్మెట్లు కొనిస్తున్నారు. చెకింగ్ చేసే చోటే పొల్యూషన్ చెక్ పోస్ట్‌లు, ఇన్సూరెన్స్ సంస్థల ఔట్లెట్లు పెట్టి సర్టిఫికెట్లను ఇప్పిస్తున్నారు. ఒడిశాలో మూడు నెలల పాటు కొత్త చలాన్లు విధించబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏపీలో మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు.