మొన్న శ్రీశైలం ఇప్పుడు కల్వకుర్తి.. కృష్ణా ప్రాజెక్టులను గాలికొదిలేసిన సర్కార్

మొన్న శ్రీశైలం ఇప్పుడు కల్వకుర్తి.. కృష్ణా ప్రాజెక్టులను గాలికొదిలేసిన సర్కార్
  • పాలమూరు ప్రాజెక్టుకు ప్రాధాన్యం తగ్గింపు ఒక టీఎంసీికి కెపాసిటీ కట్
  • కొడంగల్ – నారాయణపేట లిఫ్ట్ ముచ్చట్నే లేదు
  • ఏండ్లు గడుస్తున్నా సర్వేల స్థాయి దాటని డిండి ఎత్తిపోతల స్కీమ్
  • ఎక్స్ పర్ట్ కమిటీ రిపోర్టును పట్టించుకోకుండా

హైదరాబాద్‌‌, వెలుగు: కృష్ణా నదిపై చేపట్టిన ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రాష్ట్రం ఏర్పాటయ్యాక మొదట శంకుస్థాపన చేసిన పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుతో రకరకాలుగా ఆడుకున్న సర్కారు.. ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులనూ పక్కనపెట్టేసింది. కనీసం మెయింటెనెన్స్​కూ నిధులివ్వకుండా నిర్లక్ష్యం చూపుతోంది. ప్రజల విజ్ఞప్తులు, ఎక్స్​పర్టుల సూచనలు వేటినీ పట్టించుకోకుండా ఇష్టమున్న నిర్ణయాలు తీసుకుంటోంది. అటు కృష్ణానది నుంచి నీళ్లన్నీ తరలించుకుపోయేలా ఏపీ చేపడ్తున్న ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నమూ చేయడం లేదు. దీనితో శ్రీశైలం పవర్​ప్లాంట్​కాలిపోవడం, తాజాగా కల్వకుర్తి పంపుహౌస్​​ నీట మునగడం వంటి ప్రమాదాలతోపాటు మనకు నీళ్లు అందక దక్షిణ తెలంగాణ ఎడారిగా మారిపోయే దుస్థితి ఏర్పడింది.

వర్క్ ఏజెన్సీకి లాభం చేకూర్చేందుకే

పాలమూరు ప్రాజెక్టులో మొదటి పంపుహౌస్‌‌ను ఎల్లూర్‌‌ వద్ద ఓపెన్‌‌ గ్రౌండ్‌‌లో కట్టాలని తొలుత ప్రతిపాదించారు. కల్వకుర్తి మొదటి పంపుహౌస్‌‌కు కిలోమీటర్​ దూరంలో కట్టాలనుకున్నారు. దానికి కొద్దిపాటి సివిల్‌‌ పనులు చేస్తే సరిపోయేది. కానీ అప్పట్లో ఈ పనులు దక్కించుకున్న వర్క్‌‌ ఏజెన్సీ.. ఓపెన్‌‌ పంపుహౌస్‌‌తో వర్కవుట్‌‌ కాదని అండర్‌‌ గ్రౌండ్‌‌ లో చేపట్టాలని ప్రతిపాదన సర్కారు ముందుపెట్టింది. దానిపై స్టడీ చేసేందుకు అప్పటి ఇరిగేషన్‌‌ స్పెషల్‌‌ సీఎస్‌‌ చైర్మన్‌‌గా, పాలమూరు సీఈ కన్వీనర్‌‌గా, లిఫ్ట్‌‌ ఇరిగేషన్‌‌ అడ్వైజర్‌‌, సీఎం ఓఎస్డీ, సీడీవో సీఈ మెంబర్లుగా ఉన్నారు. కమిటీ ఫీల్డ్‌‌ స్టడీ చేసి.. పాలమూరు పంపుహౌస్‌‌ను ఓపెన్‌‌ గ్రౌండ్‌‌ లోనే చేపట్టాలని, ఖర్చుకూడా తక్కువని సూచించింది. అదే వర్క్​ఏజెన్సీ కోరినట్టు కడితే.. పేలుళ్లతో కల్వకుర్తి పంపుహౌస్‌‌ దెబ్బతింటుందని స్పష్టం చేసింది. కానీ ఈ రిపోర్టును సర్కారు పట్టించుకోలేదు. వర్క్‌‌ ఏజెన్సీ ప్రతిపాదనకు ఓకే చెప్పింది. ఇప్పుడు కల్వకుర్తి పంపుహౌస్‌‌ మునిగిపోయింది. అసలు పాలమూరు అండర్​గ్రౌండ్​ పంపుహౌస్​ కారణంగా కల్వకుర్తి మొదటి పంపుహౌస్‌కు ప్రమాదం ఉంటుందని ఎక్స్‌పర్ట్‌ కమిటీ, స్టీరింగ్‌ కమిటీ హెచ్చరించినా పట్టించుకోని రాష్ట్ర సర్కారు.. వర్క్‌ ఏజెన్సీకి లాభం చేయడానికి గుడ్డిగా పనులు చేపట్టింది. కల్వకుర్తి పంపుహౌస్​ మునగడానికి కారణమైంది.

పేరుకే మొదటి ప్రాజెక్టు

తెలంగాణ ఆవిర్భావం తర్వాత మొదట శంకుస్థాపన చేసిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఉనికే ప్రమాదంలో పండింది. ఈ ప్రాజెక్టుతో సర్కారు రకరకాలుగా ఆడుకుంది. రోజుకు రెండు టీఎంసీలు ఎత్తిపోయాల్సిన లిఫ్ట్‌‌ స్కీంను ఒక టీఎంసీకే పరిమితం చేసింది. దీనితో ప్రతిపాదిత ఆయకట్టు మొత్తం ప్రమాదంలో పడింది. ఫస్ట్‌‌ అపెక్స్‌‌ కౌన్సిల్‌‌ మీటింగ్‌‌ లో పాలమూరు, డిండి లిఫ్ట్‌‌ స్కీంలను పాత ప్రాజెక్టులుగానే పరిగణిస్తామని ఏపీ చెప్పినా.. గుడ్డిగా రెండో అపెక్స్‌‌ కౌన్సిల్‌‌లో వాటిపై వాదనకు దిగి మొదటికే మోసానికి తెచ్చారు. నీటి కేటాయింపులు లేనివన్నీ కొత్త ప్రాజెక్టులుగానే పరిగణించాలని అపెక్స్‌‌ మీటింగ్​లో నిర్ణయం తీసుకోవడంతో పాలమూరు, డిండి ప్రాజెక్టుల భవిష్యత్‌‌ ప్రమాదంలో పడింది. రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత సీఎం కేసీఆర్‌‌.. ఇక ఫోకస్‌‌ అంతా పాలమూరుపైనే అని చెప్పి, చివరికి దానిని అటకెక్కించారు. కేవలం ఒకే ఒక్క సారి ప్రాజెక్టు పనులు సందర్శించిన ఆయన నడుస్తున్న పనులు ఆగిపోవడానికి కారకుడయ్యారు. తాజా పరిణామాలతో ఈ ప్రాజెక్టు ఎన్ని దశాబ్దాలకు పూర్తవుతుందో కూడా తెలియని పరిస్థితి.

అసలు డిండి ఉంటదా?

డిండి లిఫ్ట్‌‌ స్కీం సర్వేలు దాటడం లేదు. ఈ ప్రాజెక్టుకు ఎక్కడి నుంచి నీళ్లు తీసుకోవాలనేదానిపైనే ఇప్పటికే ఆరేడుసార్లు సర్వేలు చేశారు. ఉమ్మడి పాలమూరు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నేతలంతా వ్యతిరేకిస్తున్నా వినకుండా.. పాలమూరు-రంగారెడ్డితో పాటు డిండి ప్రాజెక్టుకు ఎల్లూరు నుంచి నీటిని తీసుకోవాలని ప్రతిపాదించారు. దీనివల్ల కల్వకుర్తి ఆయకట్టు దెబ్బతింటుందని, ఆ ప్రపోజల్‌‌ సరికాదని చెప్పినా అప్పట్లో సీఎం కేసీఆర్​ వినిపించుకోలేదు. కొందరు రిటైర్డ్‌‌ ఇంజనీర్లు ఈ ప్రాజెక్టుపై సర్వేల పేరుతో కోట్లు దండుకున్నారు. ఆ రిటైర్డ్​ ఇంజనీర్లే పాలమూరు ఫస్ట్‌‌ పంపుహౌస్‌‌ను అండర్‌‌ గ్రౌండ్‌‌గా చేపట్టాలన్న నిర్ణయం వెనుక ఉన్నారన్న ఆరోపణలున్నాయి. ఈ ప్రాజెక్టు సర్వేలు దాటి ఇప్పట్లో ముందుకుపడే అవకాశమే లేదని జలసౌధ వర్గాల్లో చర్చ సాగుతోంది.

శ్రీశైలం పవర్‌‌ హౌస్‌‌లో భారీ ప్రమాదంతోనైనా..

శ్రీశైలం లెఫ్ట్‌‌ బ్యాంక్‌‌ పవర్‌‌ హౌస్‌‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగి హైడల్‌‌ పవర్‌‌ జనరేషన్‌‌ ఆగిపోయింది. ఈ ఏడాది కృష్ణాలో వరదలు మొదలైన నాటి నుంచి నిరంతరాయంగా కరెంట్‌‌ ఉత్పత్తి కొనసాగించడం, మెయింటెనెన్స్‌‌ను పూర్తిగా పట్టించుకోకపోవడంతో ఆ ప్రమాదం జరిగింది. తక్కువ ధరకు కరెంట్‌‌ ఉత్పత్తి చేసుకునే అవకాశాన్ని రాష్ట్రం కోల్పోయింది. ప్రమాదం జరిగి రెండు నెలలు అవుతున్నా ప్లాంట్‌‌ను ఇంకా పునరుద్ధరించలేని పరిస్థితి. అయినా సర్కారు సరిగా స్పందించలేదు. ఇతర ప్రాజెక్టుల్లో జాగ్రత్తలు చేపట్టలేదు. శ్రీశైలం ప్రమాదాన్ని మరిచిపోకముందే ఇప్పుడు కల్వకుర్తి నీట మునిగింది. ఈ ఏడాది శ్రీశైలం నుంచి నీళ్లను తీసుకునే అవకాశమే లేకుండా పోయింది.

పోతిరెడ్డిపాడు విస్తరణపై సైలెంట్‌‌

ఏపీ సర్కారు పోతిరెడ్డిపాడు హెడ్‌‌ రెగ్యులేటర్‌‌ కెపాసిటీని డబుల్‌‌ చేయడంతోపాటు సంగమేశ్వరం లిఫ్టు ద్వారా ఏకంగా రోజుకు మూడు టీఎంసీల చొప్పున తరలించుకునేలా కొత్త ప్రాజెక్టు చేపట్టింది. ఈ ప్రాజెక్టులపై ఏపీ వేగంగా ముందుకెళ్తున్నా ఆపడానికి సీఎం కేసీఆర్‌‌ ఏమాత్రం ప్రయత్నం చేయలేదు. ఈ ఏడాది మే 5న ఏపీ సర్కారు జీవో ఇస్తే.. సీఎం కేసీఆర్​ మే 11న ప్రాజెక్టుల రివ్యూ చేశారు. ఏపీ సంగమేశ్వరం టెండర్ల ప్రక్రియ చేపట్టినా దానిని అడ్డుకోవడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు. జల వివాదాల పరిష్కారానికి అపెక్స్‌‌ మీటింగ్​ నిర్వహిస్తామని కేంద్రం ప్రతిపాదించినా.. ముందే నిర్ణయించిన కార్యక్రమాలు ఉన్నాయంటూ సీఎం కేసీఆర్​ ఆ మీటింగ్​ను వాయిదా వేయించారు. ఫలితంగా ఏపీ టెండర్ల ప్రక్రియ ముగిసి వర్క్‌‌ ఏజెన్సీకి పనులు అలాట్‌‌ అయ్యాయి. ఇలా మొత్తంగా శ్రీశైలం నీళ్లన్నింటినీ రాయలసీమకు మళ్లించుకుపోయేలా ఏపీ చేపట్టిన ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ఏ దశలోనూ సీఎం కేసీఆర్‌‌ ప్రయత్నించలేదు. ఫలితంగా దక్షిణ తెలంగాణకు భారీ నష్టం పొంచి ఉంది.

మెయింటెనెన్స్‌‌కూ పైసలిస్తలేరు

జూరాలపై ఏర్పాటు చేసిన భీమా, నెట్టెంపాడు, కోయిల్‌‌సాగర్‌‌ లిఫ్టులతోపాటు శ్రీశైలంపై నిర్మించిన కల్వకుర్తి లిఫ్ట్‌‌ ఇరిగేషన్‌‌ ప్రాజెక్టులను సరిగా మెయింటైన్​ చేయడానికి అవసరమైన నిధులను రాష్ట్ర సర్కారు కేటాయించడం లేదు. సర్కారు ఇచ్చే కొద్దిపాటి నిధులతో మోటార్లు, పంపులకు రిపేర్లు చేయించలేక, కరెంట్‌‌ బిల్లులు కట్టలేక ఇంజనీర్లు నానా తంటాలు పడుతున్నారు. ఈ ఏడాది కృష్ణాలో పుష్కలంగా వరద వస్తున్నా.. ఆ నీళ్లను మళ్లించుకోవడానికి మన లిఫ్టుల మోటార్లు పనిచెయ్యలేదు. ఇదేమిటని ఇంజనీర్లను ప్రశ్నిస్తే.. ఫండ్స్​ లేక తాము ఏమీ చేయలేకపోతున్నామని వాపోతున్నారు. కల్వకుర్తి ప్రాజెక్టు కింద 20 టీఎంసీల కెపాసిటీతో రిజర్వాయర్లను ప్రతిపాదించినా వాటికి ఇంతవరకు కూడా సీఎం అప్రూవల్‌‌ ఇవ్వలేదు. కల్వకుర్తి నీళ్లను ఎత్తిపోసినా వాటిని నిల్వ చేసుకునే చాన్స్​లేకుండా పోయింది.

కొడంగల్‌‌, నారాయణపేట లిఫ్ట్‌‌ పక్కకే..

ఉమ్మడి ఏపీలోనే ఆమోదం పొందిన కొడంగల్‌‌, నారాయణపేట లిఫ్ట్‌‌ స్కీంను రాష్ట్ర సర్కారు ఉద్దేశపూర్వకంగానే పక్కకు పెట్టింది. నీటి ఆధారమే లేని కొడంగల్‌‌, నారాయణపేట నియోజకవర్గాల్లోని లక్ష ఎకరాలకు జూరాల నుంచి నీళ్లు అందించేందుకు ఈ ప్రాజెక్టును ప్రతిపాదించారు. కానీ కేవలం రాజకీయ కారణాలతో ఆ ప్రాజెక్టును సీఎం పక్కనపెట్టినట్టుగా ఆరోపణలున్నాయి. కనీసం అపెక్స్‌‌ కౌన్సిల్‌‌ ఎజెండాలో కూడా ఈ ప్రాజెక్టును చేర్చకుండా, నీటి కేటాయింపులు చేసుకునే అవకాశమున్నా నిర్లక్ష్యం చేశారన్న విమర్శలు వస్తున్నాయి.