
- సర్కారు ప్రాధాన్యం ఏంటో ఇక్కడే తెలుస్తోంది: దత్తా త్రేయ
- టీపీయూఎస్ ఆధ్వర్యంలో టీచర్ల నిరాహార దీక్ష
చదువు కోసం రాష్ట్ర సర్కార్ ఇచ్చిన బడ్జెట్ మన కన్నా వెనకబడిన బీహార్ కేటాయించిన బడ్జెట్ కన్నా తక్కువుందని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. సర్కారు 10,560 కోట్లు కేటాయిస్తే, బీహార్ మనకన్నా ఎక్కువగా 16,740 కోట్లు ఇచ్చిందని అన్నారు. సర్కారు చదువుకు ఎంత ప్రాధాన్యం ఇస్తోందో దీన్ని బట్టి తెలుస్తోందని విమర్శించారు. శనివారం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయూఎస్) ఆధ్వర్యంలో టీచర్లు హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద సామూహిక నిరాహారదీక్షకు దిగారు. ఈ దీక్షకు దత్తాత్రేయ, బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, ఎమ్మెల్యే రాజాసింగ్ సంఘీభావం తెలిపారు. సమగ్ర శిక్షా అభియాన్‌కు కేంద్రం ఇచ్చిన నిధుల్లో ఎంత ఖర్చు పెట్టిందో శ్వేతపత్రం విడుదల చేయాలని దత్తాత్రేయ డిమాండ్ చేశారు. విద్యారంగం పూర్తిగా సమస్యలతో నిండిపోయిందని రాంచందర్‌రావు విమర్శించారు. శాసనమండలి సమావేశాల్లో టీచర్ల సమస్యలను ఎత్తిచూపినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఉమ్మడి సర్వీస్ రూల్స్‌పై కేంద్రం ఆర్డినెన్స్ ఇచ్చినా సర్కార్ అమలు చేయకపోవడం దురదృష్టకర మన్నారు. సీఎం కేసీఆర్ రాత్రంతా కొబ్బరినీళ్లు తాగుతారని, అందుకే పొద్దుగాల పడుకుంటారని రాజాసింగ్ ఎద్దేవా చేశారు. ఇకనైనా ఆయన మేల్కొంటే బాగుంటుందన్నారు. గతంలో ప్రజలు సీఎంలను కలిసి సమస్యలు చెప్పుకునేవారని, ఇప్పుడైతే ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలకూ అవకాశం లేకుండాపోయిందని అన్నారు. అందుకే ధర్నాచౌక్ వద్ద ధర్నాలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని విమర్శించారు.