గ్యారంటీ అప్పులపై ఆంక్షల నేపథ్యంలో ప్రభుత్వం కొత్త పంథా

గ్యారంటీ అప్పులపై ఆంక్షల నేపథ్యంలో ప్రభుత్వం కొత్త పంథా

హైదరాబాద్, వెలుగు: గ్యారంటీ అప్పులను తెచ్చుకునేందుకు రాష్ట్ర సర్కార్ కొత్త పంథాను ఎంచుకున్నది. కొత్తగా కడుతున్న సర్కార్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్‌‌కు అప్పు ఇస్తే.. పేషెంట్ల నుంచి వసూలు చేసిన ఫీజులతో తిరిగి చెల్లిస్తామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌‌‌‌బీఐ)కు, బ్యాంకుల కన్సార్టియంకు తెలిపింది. హైదరాబాద్ నలుమూలలా నిర్మించ తలపెట్టిన నాలుగు సూపర్ స్పెషాలిటీ దవాఖానలకు తీసుకునే అప్పును నిమ్స్ మాదిరి ఫీజులు తీసుకుని, కడుతామని ఇటీవల పంపిన ప్రపోజల్స్‌‌లో పేర్కొన్నది. ఇష్టారీతిన చేస్తున్న గ్యారంటీ అప్పులపై ఆర్‌‌‌‌బీఐ ఈ ఆర్థిక సంవత్సరంలో పలు నిబంధనలను విధించింది. 

బడ్జెట్‌‌‌‌లో నుంచి కట్టే అప్పులను.. ఎఫ్ఆర్‌‌‌‌‌‌‌‌బీఎం అప్పుల కింద పరిగణిస్తామని స్పష్టం చేసింది. గ్యారంటీ కింద అప్పు తీసుకుంటే ఎలా తీరుస్తారో కచ్చితంగా చెప్పాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం అప్పుల చెల్లింపులను ఫీజులతో ముడిపెట్టింది.

నిమ్స్ లెక్కనే

ప్రస్తుతం రాష్ట్రంలోని నిమ్స్ హాస్పిటల్‌‌‌‌లో ఓపీ దగ్గర నుంచి వివిధ రకాల సర్వీసుల దాకా ఫీజులు వసూలు చేస్తున్నారు. అచ్చం అలానే కొత్త హాస్పిటల్స్ నిర్మించాక పేషెంట్ల నుంచి ప్రతి సర్వీసుకు ఇంత అని తీసుకుంటామని ఇటీవల ఆర్‌‌‌‌‌‌‌‌బీఐకి రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అలా వచ్చిన డబ్బులతోనే వాటి నిర్మాణానికి తీసుకుంటున్న అప్పులు తిరిగి చెల్లిస్తామని డీపీఆర్ పంపింది. దీంతో ఇతర సర్కార్ హాస్పిటల్స్ మాదిరి సూపర్ స్పెషాలిటీ దవాఖానల్లో ఫ్రీ వైద్యం ఉండదని, ఎంతో కొంత చెల్లించాల్సి ఉంటుందని ఆఫీసర్లు చెప్తున్నారు. విచ్చలవిడిగా అప్పులు తీసుకోవడం పెరగడంతో వాటికి కళ్లెం వేసేందుకు బడ్జెట్‌‌‌‌లో పెట్టుకున్న అప్పులకు కేంద్రం కోత విధించింది. రూ.52 వేల కోట్లకు గాను దాదాపు రూ.10 వేల కోట్లు కోత పడింది. మరోవైపు గ్యారంటీ అప్పు తీసుకోవాలంటే ఎలా కడుతారో స్పష్టంగా చెప్పకపోతే.. ఇదే బడ్జెట్ అప్పుల్లో నుంచి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, అందుకే పేషెంట్ల నుంచి వసూలు చేస్తామని చెప్పినట్లు ఫైనాన్స్ డిపార్ట్​మెంట్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

మొత్తం రూ.5 వేల కోట్లపైనే

టిమ్స్ ఆస్పత్రితో పాటు సనత్ నగర్, అల్వాల్, ఎల్బీనగర్‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటు చేయలనుకున్న హాస్పిటల్స్‌‌‌‌కు దాదాపు రూ.4 వేల కోట్లు అవసరం అవుతాయని అంచనా వేశారు. అయితే ఈ మొత్తం పెరిగే చాన్స్ ఉన్నది. వరంగల్‌‌‌‌లో నిర్మించే హాస్పిటల్‌‌‌‌కు ఇంకో రూ.వెయ్యి కోట్లు అవసరం కానున్నాయి. అంటే దాదాపు రూ.5 వేల కోట్లను హాస్పిటల్స్ నిర్మాణానికి అప్పుగా తీసుకోనున్నారు. టిమ్స్ గచ్చిబౌలి మినహా మిగతా మూడింటి నిర్మాణానికి ఆర్అండ్​బీ అనుమతులు ఇస్తూ రూ.2,679 కోట్లకు అనుమతులు ఇచ్చారు.