దవాఖాన్లలో డయాగ్నస్టిక్‌‌ మెషీన్ల రిపేర్​ బాధ్యత కంపెనీలదే

దవాఖాన్లలో డయాగ్నస్టిక్‌‌ మెషీన్ల రిపేర్​ బాధ్యత కంపెనీలదే

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ దవాఖాన్లలోని డయాగ్నస్టిక్‌‌ మెషీన్‌‌ రిపేర్ల బాధ్యతలను, ఆయా మెషీన్లు తయారు చేసిన కంపెనీలకే అప్పగించాలని రాష్ట్ర సర్కార్‌‌‌‌ నిర్ణయించింది. ఇందుకోసం ఆయా కంపెనీలతో ఒప్పందం చేసుకోవాలని తెలంగాణ స్టేట్‌‌ మెడికల్‌‌ సర్వీసెస్‌‌ అండ్‌‌ ఇన్‌‌ఫ్రాస్ర్టక్చర్‌‌‌‌ డెవలప్‌‌మెంట్‌‌ కార్పొరేషన్‌‌(టీఎస్‌‌ఎంఎస్‌‌ఐడీసీ) ఎండీకి సూచిస్తూ హెల్త్‌‌ సెక్రటరీ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. రూ.5 లక్షల కంటే ఎక్కువ విలువ ఉన్న యంత్రాల రిపేర్లకే ఈ రూల్‌‌ వర్తించనుందని, అంతకంటే తక్కువ విలువ ఉన్న రిపేర్ల బాధ్యతలను హాస్పిటల్‌‌ సూపరింటెండెంట్లకే అప్పగిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇందుకోసం హాస్పిటల్‌‌లో ఉన్న బెడ్ల సంఖ్యను బట్టి, ఏటా రాష్ట్ర సర్కార్‌‌‌‌ రిపేర్ల కోసం నిధులు కేటాయించనుంది. ప్రైమరీ హెల్త్‌‌ సెంటర్‌‌‌‌కు అయితే ఒక్కో బెడ్డకు ఏడాదికి రూ.వెయ్యి చొప్పున, కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌‌‌‌లో రూ.1,500, ఏరియా, జిల్లా హాస్పిటళ్లకు రూ.2 వేలు, టీచింగ్ హాస్పిటళ్లకు ఒక్కో బెడ్డుకు ఏడాదికి రూ.2,500 చొప్పున కేటాయించనున్నారు. ఈ లెక్కన యంత్రాల రిపేర్ల కోసం ఐదు బెడ్లు ఉన్న పీహెచ్‌‌సీకి ఏడాదికి రూ.5 వేలు వస్తే, 200 బెడ్లు ఉన్న జిల్లా హాస్పిటల్‌‌కు రూ.4 లక్షలు వస్తయి. దీని కోసం టీఎస్‌‌ఎంఎస్‌‌ఐడీసీలో ‘‘ప్రోగ్రామ్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ యూనిట్‌‌ (పీఎంయూ)’’ను ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొంది. ఏదైనా మెషీన్‌‌ రిపేర్‌‌‌‌కు వస్తే, సంబంధిత హాస్పిటల్‌‌ సూపరింటెండెంట్‌‌ వెంటనే ఆ విషయాన్ని ఎంఈఎంఐఎస్‌‌లో అప్‌‌లోడ్‌‌ చేయాలని, పీఎంయూ ఆఫీసర్లు పరిశీలించి ఆ సంస్థతో రిపేర్‌‌‌‌ చేయిస్తారని పేర్కొంది. ఇద్దరు బయోమెడికల్‌‌ ఇంజనీర్లు, ఇద్దరు డేటా ఎంట్రీ ఆపరేటర్లు పీఎంయూలో పనిచేస్తారని, ఔట్‌‌ సోర్సింగ్‌‌ విధానంలో ఈ నలుగురిని నియమించాలని టీఎస్‌‌ఎంఎస్‌‌ఐడీసీ ఎండీని ఆదేశించింది.

కమిటీలో బయోమెడికల్‌‌ ఇంజనీర్లు ఏరి?

యంత్రాల రిపేర్లకు అయ్యే ఖర్చును నిర్ణయించేందుకు టీఎస్‌‌ఎంఎస్‌‌ఐడీసీ ఎండీ మెంబర్‌‌‌‌ కన్వీనర్‌‌‌‌గా, డీఎంఈ, కాళోజీ హెల్త్‌‌ యూనివర్సిటీ వీసీ, టీవీవీపీ కమిషనర్‌‌‌‌, హెల్త్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ టెక్నికల్‌‌ అడ్వైజర్లను మెంబర్లుగా నియమిస్తూ ఓ కమిటీ వేశారు. ఈ ఐదుగురిలో ఒక్కరు కూడా బయో మెడికల్‌‌ ఇంజనీర్ లేకపోవడం గమనార్హం. హెల్త్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌లో చాలా మంది సీనియర్‌‌‌‌ బయోమెడికల్‌‌ ఇంజనీర్లు ఉన్నప్పటికీ వాళ్లనెవరనీ మెషీన్ల రిపేర్‌‌‌‌లో ఇన్‌‌వాల్వ్‌‌ చేయడం లేదు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న పీఎంయూ బాధ్యతలను కూడా ఔట్‌‌ సోర్సింగ్‌‌ ఉద్యోగులకు అప్పగించాలని జీవోలో పేర్కొనడం గమనార్హం.