ధాన్యం సేకరణలో మిల్లర్లు భాగస్వాములు కావాలి

ధాన్యం సేకరణలో మిల్లర్లు భాగస్వాములు కావాలి

సమన్వయంతో పనిచేసి రైతులను ఆదుకుందాం
సమస్యలు సీఎం, సీఎస్‌‌‌‌ కమిటీ దృష్టికి తీసుకెళ్తా: గంగుల
మిల్లర్లతో మంత్రి చర్చలు.. ప్రతిపాదనలకు మిల్లర్లు ఓకే


హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ‘‘రైతులను ఆదుకునేందుకు పండించిన చివరి గింజ వరకూ మద్దతు ధరతో సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు పడుతున్న వానల వల్ల ధాన్యం తడుస్తోంది. దీనివల్ల రైతులు ఆగం కావొద్దు. మీ పరిశ్రమలకు ఇబ్బందులు రావొద్దు. కష్ట సమయంలో ప్రభుత్వం, మిల్లర్లు సమన్వయంతో పనిచేసి రైతుల్ని కాపాడుకుందాం”అని సివిల్​ సప్లయ్స్​ శాఖ మంత్రి గంగుల కమలాకర్​ మిల్లర్లకు సూచించారు. ధాన్యాన్ని మిల్లులకు తరలించే ప్రక్రియను సజావుగా నిర్వహించాలన్నారు. మిల్లర్​కు, రైతుకు సంబంధం లేకుండా కొనుగోలు కేంద్రాల్లోనే నాణ్యతా ప్రమాణాలు కచ్చితంగా పాటించి మిల్లులకు పంపుతామని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క కిలో కూడా మిల్లుల్లో కోత పెట్టవద్దని కోరారు. 

సీఎస్ కమిటీ అనుకూల నిర్ణయం తీసుకుంటది

కొనుగోలు కేంద్రాల నుంచి పంపిన ధాన్యాన్ని అన్‌‌‌‌లోడింగ్ చేయడానికి మిల్లర్లు విముఖత చూపిన నేపథ్యంలో వారితో మంత్రి గంగుల శుక్రవారం చర్చలు జరిపారు. రారైస్ మర ఆడించడంతో ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నిజామాబాద్​లోని కొన్ని ప్రాంతాల్లో తక్కువ బియ్యం వచ్చే అవకాశం ఉందని, నూక, తవుడు వంటివి పోయినా మిగతా షార్ట్ ఫాల్ ఎలా భర్తీ చేయాలని మిల్లర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రి గంగుల స్పందిస్తూ.. మిల్లర్లు లేవనెత్తిన అంశాల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. సీఎస్ నేతృత్వంలో కమిటీ అందరికీ అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని, కమిటీ నిర్ణయం మేరకు ప్రభుత్వం ముందుకు పోతుందని స్పష్టం చేశారు. సీఎంఆర్ విషయంలోనూ సహకరించాలని కోరారు. మంత్రి హామీ మేరకు ప్రభుత్వానికి సహకరిస్తామని, ధాన్యం అన్​లోడింగ్ చేసుకుంటామని మిల్లర్లు చెప్పారు. సివిల్ సప్లయ్‌‌‌‌ కమిషనర్ అనిల్ కుమార్, సివిల్ సప్లయ్​కార్పొరేషన్ జీఎంలు, మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు, ప్రతి జాల్లాకు చెందిన అధ్యక్ష కార్యదర్శులు చర్చల్లో పాల్గొన్నారు.

మిల్లింగ్‌‌‌‌ ఇండస్ట్రీని ఆదుకోవాలి

ఇప్పటికే నష్టాల్లో మిల్లింగ్ ఇండస్ట్రీ ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో యాసంగిలో ఎఫ్‌‌‌‌సీఐ కోరిన మేరకు బియ్యం రాకపోవచ్చనే ధాన్యం అన్​లోడింగ్ కు కొంత మంది మిల్లర్లు భయపడుతున్నారని మిల్లర్ల సంఘం జనరల్‌‌‌‌ సెక్రటరీ మోహన్‌‌‌‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌‌‌‌ రైతులు నష్టపోకుండా ఆదుకున్నారని, అదే విధంగా మిల్లింగ్ ఇండస్ట్రీని ఆదుకోవాలని మంత్రిని కోరారు. రాష్ట్రంలో 2,400 మిల్లుల్లో 1,500పైగా బాయిల్డ్ రైస్​ మిల్లులు ఉన్నాయని, ఎఫ్‌‌‌‌సీఐ, కేంద్రం తీరుతో వీటిపై ఆధారపడిన లక్షలాది కుటుంబాలు రోడ్డుపైకొచ్చే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.

వడ్ల కొనుగోళ్లపై సీఎస్‌‌‌‌ కమిటీ భేటీ

యాసంగి ధాన్యం కొనుగోళ్లకు తగిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు ఏర్పాటైన ప్రత్యేక కమిటీ శుక్రవారం భేటీ అయింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, పౌర సరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్ పాల్గొన్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు, ఎఫ్‌‌‌‌సీఐకి అందించే ధాన్యం తదితర అంశాలపై చర్చించారు. త్వరలో మిల్లింగ్‌‌‌‌ నష్టాలపై శాస్త్రీయ అధ్యయనం తర్వాత నిర్ణయం ప్రకటించనున్నారు.