ఖజానా నింపుకునేందుకు సర్కార్ మరో ఆఫర్

ఖజానా నింపుకునేందుకు సర్కార్ మరో ఆఫర్

  •   
  •     40 శాతం నుంచి 60 శాతం వరకూ మినహాయింపు 
  •     ఈ నెల16వ తేదీ నుంచి జూన్ 30 వరకు ఆన్ లైన్ లో అప్లికేషన్లు 
  •     ఏపీ జీఎస్టీ, వ్యాట్, సీఎస్టీ, ఎంట్రీ ట్యాక్స్ లు కలిపి రూ. 3,700 కోట్ల  అంచనా

హైదరాబాద్, వెలుగు:  ఖజనా నింపుకొనేందుకు ఉన్న అన్ని మార్గాలపైనా రాష్ట్ర సర్కార్ దృష్టి పెట్టింది. ఇప్పటికే ట్రాఫిక్ చలాన్లకు రాయితీ ప్రకటించి సొమ్ము చేసుకోగా.. ఇప్పుడు ట్యాక్స్​బకాయిల వసూళ్లపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే ఏండ్ల నుంచి పెండింగ్​లో ఉన్న  మొండి బకాయిల వసూలుకు వన్ టైం సెటిల్​మెంట్(ఓటీఎస్) ఆఫర్ పై చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఓటీఎస్ కింద 60% వరకూ రాయితీ ఇస్తూ బకాయిలను వసూలు చేయనున్నారు. జనరల్ సేల్స్ ట్యాక్స్ మొదలు వ్యాట్ వరకు దాదాపు రూ. 3,700 కోట్లు పెండింగ్​లో ఉన్నట్లు అంచనా వేశారు. ఈ ఆఫర్ కింద అప్లై చేసుకుని పెండింగ్ బకాయిలను కట్టాలనుకునే డీలర్లు, వ్యాపారులకు పెనాల్టీ, వడ్డీ నుంచి కూడా మినహాయింపు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే, ఎలాంటి కారణం లేకుండా పన్ను చెల్లించని వ్యాపారులు, డీలర్లకు మాత్రం ఈ ఆఫర్ వర్తించదని, పూర్తి స్థాయిలో చెల్లించాల్సిందేనని పేర్కొన్నారు. 

ఆగస్ట్ 15 లోపు కట్టాలె 

ఈ నెల 16 నుంచి జూన్ 30 వరకు ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ లో వన్​టైం సెటిల్​మెంట్​కు అప్లై చేసుకోవాలని సూచించారు. జులై 1 నుంచి 15వ తేదీ వరకు అప్లికేషన్లను స్క్రూటినీ చేస్తారు. ఓటీఎస్ కింద బకాయిలను చెల్లించడానికి సిద్ధమేనంటూ అంగీకార పత్రాన్ని ఇవ్వడంతో పాటు ఆగస్టు15లోపు చెల్లింపులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ స్కీం కింద ఆంధ్రప్రదేశ్ జనరల్ సేల్స్ ట్యాక్స్, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, వ్యాట్, ఎంట్రీ ట్యాక్స్ బకాయిలన్నింటినీ క్లియర్ చేసుకునే చాన్స్ ఉంది. ప్రతి ఏడాదిని ఒక యూనిట్‌‌‌‌‌‌‌‌గా తీసుకుని ఓటీఎస్ చేసుకోవచ్చునని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.  

రూ. 25 లక్షలు మించితే 4 కిస్తీలు  

పెండింగ్ బకాయిలు రూ. 25 లక్షలకుపైన ఉన్నట్లయితే నాలుగు ఇన్​స్టాల్​మెంట్లలో వడ్డీ లేకుండా చెల్లించే అవకాశం ఇచ్చారు. ఇంకా ఎక్కువ ఇన్​స్టాల్​మెంట్లు కావాలనుకుంటే బ్యాంకులు విధించే వడ్డీ రేట్ల ప్రకారం కట్టాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే ట్రిబ్యునళ్ళు లేదా కోర్టుల్లో పిటిషన్లు ఉన్నట్లయితే, వాటిని తప్పనిసరిగా విత్​ డ్రా చేసుకోవాల్సి ఉంటుందని, అలా చేస్తేనే వన్ టైం సెటిల్‌‌‌‌‌‌‌‌మెంట్ స్కీం కింద అప్లికేషన్ అప్రూవ్ అవుతుందని పేర్కొన్నారు. 
ఆన్​లైన్ లో అప్లై చేసుకోవాలె
ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ విధానంలోనే వన్ టైం సెటిల్‌‌‌‌‌‌‌‌మెంట్ స్కీంకు అప్లై చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. ఒకవేళ గతంలో బిజినెస్​ చేసి ఇప్పుడు లేనట్లయితే దానికి సంబంధించిన బకాయిలు చెల్లించేందుకు ఆయా సర్కిళ్ళ పరిధిలోని యూనిట్ల ద్వారా అప్లై చేసుకోవాలని సూచించారు. ఆన్‌‌‌‌‌‌‌‌లైన్, ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ ద్వారా వచ్చిన ఆప్లికేషన్లను సేల్స్ ట్యాక్స్ విభాగానికి చెందిన జాయింట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్లు పరిశీలిస్తారు.  ఆ తర్వాత ఆ అప్లికేషన్​ను స్వీకరించడమో లేక తగిన మార్పులు చేయాలని సూచించడమో లేక రిజెక్ట్ చేయడమో కమిటీ నిర్ణయిస్తుంది. 

ట్యాక్స్ డిస్కౌంట్లు ఇవే..  
    ఏపీ జనరల్ సేల్స్ ట్యాక్స్ మొండి బకాయిలకు 60% డిస్కౌంట్. కేవలం 40% చెల్లిస్తే చాలు. 
    ఎంట్రీ ట్యాక్స్, మోటార్ వెహికల్-గూడ్స్ ట్యాక్స్ బకాయిలను 60% కట్టాల్సి ఉంటుంది. 
    వ్యాట్, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ కు 50% బకాయిలను కడితే సరిపోతుంది.