హెచ్ఎండీఏకు ‘పైగా ప్యాలెస్’ అప్పగింత

హెచ్ఎండీఏకు ‘పైగా ప్యాలెస్’ అప్పగింత

హైదరాబాద్ : బేగంపేటలోని పైగా ప్యాలెస్‌ ను రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఎండీఏకు అప్పగించింది. గత నెల మార్చి వరకూ యూఎస్ కాన్సుల్ జనరల్ కార్యాలయంగా ఉన్న బేగంపేటలోని చిరాన్ ఫోర్ట్ లేన్‌లోని పైగా ప్యాలెస్‌ను సోమవారం (ఏప్రిల్ 17వ తేదీన) తెలంగాణ ప్రభుత్వానికి అధికారికంగా అప్పగించారు. పైగా ప్యాలెస్ లీజు ముగిసినట్లు యూఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లోపెజ్..స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ సమక్షంలో అధికారికంగా తెలియజేశారు.

‘2007 నుండి ఈ అద్భుతమైన భవనాన్ని మాకు అందుబాటులోకి తెచ్చినందుకు మేము తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. పైగా ప్యాలెస్ లో గడిపిన తీపి జ్ఞాపకాలు మాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి’ అంటూ యూఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లోపెజ్ ట్వీట్ చేశారు. 

లీజ్ ముగిసిన తర్వాత పైగా ప్యాలెస్‌ను హెచ్‌ఎండీఏకు అప్పగించింది ప్రభుత్వం. ఇది హెరిటేజ్ బిల్డింగ్ గనుక దీని పూర్తి సంరక్షణ బాధ్యతను ఇకపై హెచ్‌ఎండీఏనే చూసుకోనుంది. గత నెల మార్చిలో యూఎస్‌ కాన్సులేట్‌.. ఐటీ కారిడార్‌లోని నానక్‌రామ్‌గూడలో కొత్తగా నిర్మించిన భవనంలోకి షిఫ్ట్ అయిన విషయం తెలిసిందే. గత 14 ఏళ్లుగా బేగంపేటలోని పైగా ప్యాలెస్‌లో యూఎస్‌ కాన్సులేట్‌ సేవలు అందించింది.