
- 2022లో గత సర్కార్ నిషేధం విధిస్తూ ఇచ్చిన జీవోకు ప్రత్యేక సడలింపు
- సమగ్ర దర్యాప్తు కోసం సీబీఐకి అప్పగించాలని అసెంబ్లీ తీర్మానించినట్టు జీవోలో వెల్లడి
- విచారణకు సహకరిస్తామని హామీ.. జీవో కాపీ అందినట్టు సీబీఐ అక్నాలెడ్జ్‌మెంట్
- కాళేశ్వరం రిపోర్టులన్నీ ఇవ్వాలని కోరిన కేంద్ర దర్యాప్తు సంస్థ.. పంపిన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం అక్రమాలపై విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. రాష్ట్రానికి సీబీఐ రాకుండా 2022లో గత ప్రభుత్వం నిషేధం విధిస్తూ జీవో ఇవ్వగా, ఇప్పుడు కాళేశ్వరంపై విచారణ కోసం ఆ జీవోకు ప్రత్యేకంగా సడలింపు ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో ప్రజాధనం దుర్వినియోగమైందని, దీనిపై ఎంక్వైరీ చేయాలని సీబీఐని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు హోంశాఖ స్పెషల్ సీఎస్ రవి గుప్తా సోమవారమే జీవో ఇచ్చారు.
అసెంబ్లీ తీర్మానం మేరకు సమగ్రమైన దర్యాప్తు కోసం ఈ కేసును సీబీఐకి అప్పగించడం సముచితమని ప్రభుత్వం నిర్ణయించిందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ‘మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల నిర్మాణాలు పలు అంతర్రాష్ట్ర అంశాలతో ముడిపడి ఉన్నాయి. వాటి నిర్మాణంలో అనేక రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ విభాగాలు, సంస్థలు పాలుపంచుకున్నాయి” అని పేర్కొన్నారు.
‘‘ముఖ్యంగా ప్రాజెక్టుల రూపకల్పన, అమలులో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఉన్నందున.. ఈ వ్యవహారంలోని సంక్లిష్టతలను పరిగణనలోకి తీసుకుని సీబీఐ విచారణకు అప్పగిస్తున్నం. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు వ్యక్తులు, కంపెనీలతో సహా ఈ కేసులో నిందితులందరిపై దర్యాప్తు చేపట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నం. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ 1946లోని సెక్షన్ 6 ప్రకారం ఉన్న అధికారాలను ఉపయోగించి ఈ నిర్ణయం తీసుకున్నం. సీబీఐ దర్యాప్తు నిర్వహించడానికి ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్‌లోని సభ్యులందరికీ అధికారాలు, అధికార పరిధిని ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం సమ్మతి తెలిపింది” అని జీవోలో పేర్కొన్నారు.
సమగ్ర దర్యాప్తు కోసమే..
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలు, ఇప్పటికే వివిధ సంస్థలు ఇచ్చిన రిపోర్టులు తదితర వివరాలను జీవోలో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ‘‘2023 అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీ బ్లాక్- 7లోని 16, 17, 18, 19, 20, 21 పిల్లర్లు కుంగిపోయాయి. దీనికి గల కారణాలను విశ్లేషించడానికి ఎన్డీఎస్ఏ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ 2023 నవంబర్ 1న తన మధ్యంతర నివేదికను తెలంగాణ ప్రభుత్వానికి అందజేసింది. ఆ తర్వాత పూర్తిస్థాయిలో రెండు నివేదికలను సమర్పించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు ఉన్నట్టు ఎన్‌డీఎస్‌ఏ తేల్చింది. ప్రణాళిక, డిజైన్, నాణ్యత, నిర్మాణంలో లోపాలు ఉన్నట్టు రిపోర్టులో ప్రస్తావించింది. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అవకతవకలు, ప్రజాధనం దుర్వినియోగంపై దర్యాప్తు చేయడానికి 2024 మార్చి 14న తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను నియమించింది. మూడు బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి అనేక లోపాలు ఉన్నాయని, అవకతవకలు జరిగాయని పేర్కొంటూ విచారణ కమిషన్ తన నివేదికను 2025 జులై 31న ప్రభుత్వానికి సమర్పించింది. ప్రాజెక్టు నిర్మాణంలో తీవ్రమైన నేరపూరిత చర్యలకు పాల్పడ్డట్టు రిపోర్టులో కమిషన్ వెల్లడించింది. నిర్మాణాల్లో అలసత్వం, దురుద్దేశం, వాస్తవాలను ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టడం, ఆర్థిక అవకతవకలు వంటివి చోటుచేసుకున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో దీనిపై సమగ్ర విచారణ చేపట్టేందుకు ఈ కేసును సీబీఐకి అప్పగించాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. ఈ మేరకు 04.08.2025న జరిగిన కేబినెట్సమావేశంలో కమిషన్ నివేదికను ఆమోదించి, దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని తీర్మానించింది. కేబినెట్తీర్మానం మేరకు కమిషన్నివేదికను ఆగస్టు 31న అసెంబ్లీలో పెట్టి స్వల్పకాలిక చర్చ చేశాం. ఈ సందర్భంగా సభ్యులు లేవనెత్తిన అంశాలపై విస్తృత చర్చ జరిపాం. ఎన్డీఎస్ఏ, జస్టిస్పీసీ ఘోష్కమిషన్ రిపోర్టుల్లోని అంశాలు చాలా తీవ్రమైనవనే అభిప్రాయానికి వచ్చాం. దీనిపై సమగ్రమైన, లోతైన విచారణ అవసరమని అసెంబ్లీలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది. దీంతో కాళేశ్వరంపై ఎంక్వైరీ కోసం సీబీఐ ఎంట్రీకి ప్రత్యేక సడలింపు ఇచ్చాం” అని పేర్కొంది.