
- 24×7లోకి వైన్స్, బార్లు రావు
- 24 గంటలూ షాపులు తెరిచే అంశంపై ప్రభుత్వం స్పష్టత
- అన్ని షాపులకు జీవో నంబర్ 4 వర్తించదని వెల్లడి
హైదరాబాద్, వెలుగు : 24×7 తెరిచి ఉంచే షాపుల లిస్ట్‌లోకి వైన్స్, బార్లు రావని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నెల 4న ఇచ్చిన ప్రభుత్వ ఉత్తర్వులు ఎక్సైజ్, ప్రొహిబిషన్ డిపార్ట్‌మెంట్‌కు వర్తించవని తెలిపింది. జీవో నంబర్ 4 ఉత్తర్వులు అన్ని షాప్‌లకు ఆటోమేటిక్‌గా వర్తించవని వెల్లడించింది. ఎక్సైజ్ చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా టీఎస్ బీసీఎల్, ఐఎంఎఫ్ఎల్ డిపోలు, డిస్టిలరీలు, ఏ4 వైన్ షాపులు, 2బీ బార్లు టైమ్ ప్రకారమే తెరిచి ఉంటాయని కార్మిక, ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీల శాఖ స్పెషల్ సీఎస్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఇప్పటికే దేశంలోని ప్రధాన మెట్రోపాలిటన్ సిటీలైన ఢిల్లీ, ముంబై, బెంగళూరులో 24×7 షాపులు తెరిచి ఉంచే రూల్స్ అమల్లో ఉన్నాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర షాప్స్, ఎస్టాబ్లిష్‌మెంట్స్ యాక్ట్ 1988 పరిధికి లోబడే అమలవుతాయని స్పష్టత ఇచ్చారు. ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా అనుమతులు పొందిన తర్వాతే 24 గంటలూ షాప్‌లు తెరుచుకునే వెసులుబాటు ఉంటుందని వెల్లడించారు.