అక్కరకు రాని ఆటస్థలాలు

అక్కరకు రాని ఆటస్థలాలు
  • అక్కరకు రాని ఆటస్థలాలు
  • పిచ్చి మొక్కలతో నిండిపోయిన గ్రౌండ్లు
  • ఉపాధి నిధులతో టీకేపీల నిర్మాణం
  • ఒక్కో గ్రౌండ్​కు రూ.3 లక్షల ఖర్చు
  • నిర్వహణపై గైడ్​లైన్స్ ఇవ్వని రాష్ట్ర సర్కార్​

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సర్కార్ ఉపాధి హామీ నిధులతో గ్రామాల్లో ఏర్పాటు చేసిన తెలంగాణ క్రీడా ప్రాంగణాలు (టీకేపీ) అక్కరకు రాకుండా మారాయి. నిర్వహణ లేక గడ్డి, పిచ్చిమొక్కలు మొలిచాయి. చాలా చోట్ల అధికారులు, సర్పంచ్ లు ఖాళీగా స్థలాలలో టీకేపీ అని బోర్డు పెట్టి వదిలేశారు. పిల్లలు, పెద్దలు ఆడుకోవడానికి, పోలీస్ ఉద్యోగాల అభ్యర్థలు ఈవెంట్ల కోసం ప్రాక్టీస్ చేసేందుకు ఎంతమాత్రం ఉపయోగపడడం లేదు.

ఎవరూ పట్టించుకోవట్లేదు

రాష్ట్రంలో 19472 టీకేపీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించగా, ఇప్పటి వరకు 7321 మాత్రమే పూర్తయ్యాయి. ఒక్కో టీకేపీకి రూ.3 లక్షల ఉపాధి నిధులు ఖర్చు చేశారు. గ్రౌండ్ లో ఖోఖో, కబడ్డీ, వాలీబాల్‌‌‌‌, లాంగ్‌‌‌‌ జంప్‌‌‌‌ పిట్‌‌‌‌తోపాటు వ్యాయామం కోసం సింగిల్‌‌‌‌, డబుల్‌‌‌‌ బార్‌‌‌‌లను ఏర్పాటు చేయాలి. దాదాపు 300 మొక్కలను నాటి, వాటిని పర్యవేక్షించేందుకు ప్రతి మండలంలో ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని కూడా ప్రభుత్వం పేర్కొంది. అయితే చాలా చోట్ల వీటిని సరిగా ఏర్పాటు చేయలేదు. టీకేపీల నిర్వహణపై ప్రభు త్వం ఎలాంటి గైడ్ లైన్స్ ఇవ్వలేదు. దీంతో వీటిని అటు గ్రామ పంచాయతీలు, ఇటు స్పోర్ట్స్ డిపార్ట్ మెంట్ పట్టించుకోవట్లేదు. వీటి నిర్వహణపై గైడ్ లైన్స్ ఇవ్వాలని స్థానిక ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నా స్పందించడం లేదు.

ప్రైవేట్ గ్రౌండ్లకు పోలీస్ అభ్యర్థులు

రాష్ట్రంలో వివిధ పోలీస్ పోస్టులకు ఈనెల 8 నుంచి ఈవెంట్స్ మొదలయ్యాయి. వీటికి సుమారు రెండున్నర లక్షల మంది హాజరవుతున్నారు. ఈవెంట్స్​లో క్వాలిఫై అయ్యేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు ఆరు నెలలుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఊర్లలోని టీకేపీలు వీరి ప్రాక్టీస్ కోసం ఎంతమాత్రం పనికిరాకుండా ఉన్నాయి. దీంతో చాలా మంది హైదరాబాద్, తమకు దగ్గరలోని టౌన్​లలోని ప్రైవేటు గ్రౌండ్లకు డబ్బులు చెల్లించి ప్రాక్టీస్ చేస్తున్నారు.

బోర్డులు పెట్టి వదిలేసిండ్రు

చాలా గ్రామాల్లో ఖాళీ స్థలాల్లో టీకేపీ అని బోర్డులు పెట్టి వదిలేశారు. పశువులు మేత మేసేందుకు తప్ప అవి ఎందుకు పనికిరావడం లేదు. వీటి నిర్వహణ ఎవరు చేయాలన్నది సర్కార్ గైడ్ లైన్స్ ఇయ్యలేదు. స్పోర్ట్స్ డిపార్ట్ మెంట్ అయిన వీటిని పట్టించుకోవాలని కోరుతున్నం.
- నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ సర్పంచ్

కీలక సమయంలో ఉపయోగపడట్లేదు

పోలీస్ ఈవెంట్లకు అటెండ్ అయ్యే అభ్యర్థులకు ఆట స్థలాల కొరత అధికంగా ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీకేపీలు అధ్వానంగా ఉన్నాయి. కీలకమైన సమయంలో ఇవి ఉపయోగపడక పోవటం విచారకరం. అన్ని గ్రామాల్లో టీకేపీల ఏర్పాటు కోసం ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అయితే అక్కడ కేవలం బోర్డులు తప్ప ఇకేంద కనపడటం లేదు. నిర్వహణను గాలికొదిలేశారు. కనీస సౌలత్​లు ఏర్పాటు చేసి నిర్వహణపై గైడ్ లైన్స్ ఇవ్వాలి.
- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు