పల్లె ప్రగతి పాత బిల్లులు చెల్లించండి

పల్లె ప్రగతి పాత బిల్లులు చెల్లించండి

 

  • నిధుల కోసం ప్రజావాణిలో సర్పంచుల వేడుకోలు
  • అప్పులకు మిత్తీలు కట్టలేక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన
  • పాత బిల్లులు ఇప్పిస్తేనే కొత్త పనులు చేస్తామని వెల్లడి
  • పలుచోట్ల తీర్మానాలు.. ఎమ్మెల్యేలు, మంత్రుల నిలదీతలు

వెలుగు, నెట్‌‌వర్క్: గతేడాది పల్లె ప్రగతి బిల్లులే ఇప్పటికీ ఇయ్యని రాష్ట్ర ప్రభుత్వం.. బుధవారం నుంచి ఐదో విడత పల్లె ప్రగతికి రెడీ కావాలని ఆదేశించడంపై సర్పంచులు ఫైర్ అవుతున్నారు. వారం రోజులుగా జరుగుతున్న అవగాహన సమావేశాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల సమక్షంలో నిరసన గళం విప్పుతున్నా  స్పందించకపోవడంతో కలెక్టర్లను ఆశ్రయిస్తున్నారు. ప్రజావాణిలో తమ గోడు చెప్పుకుంటున్నారు. ఆరు నెలలుగా స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఎస్‌‌ఎఫ్‌‌సీ) ఫండ్స్ ఆపేశారని, మూడు నెలలుగా అకౌంట్లను ఫ్రీజింగ్‌‌లో పెట్టడంతో కార్మికులకు జీతాలు, ట్రాక్టర్లకు ఈఎంఐలు కట్టలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది అప్పులు తెచ్చి మరీ పల్లె ప్రగతి పనులు చేసి బిల్లులు పెడితే.. పైసల్లేవంటూ తిప్పిపంపారని, ఇప్పుడు మళ్లీ ఐదో విడత పనులు చేయాలని ఎలా ఆదేశిస్తారని నిలదీస్తున్నారు. పాత బిల్లులు క్లియర్ చేస్తేనే కొత్త పనులు చేస్తామని స్పష్టం చేస్తున్నారు.

ఆరు నెలలుగా పైసా ఇయ్యలే

పంచాయతీలకు ప్రతి నెలా రూ.2 లక్షల చొప్పు న రావాల్సిన ఎస్ఎఫ్‌‌సీ ఫండ్స్‌‌ను ​గతేడాది నవంబర్ నుంచి ఆపేశారు. దీంతో సర్పంచులు కేంద్రం నుంచి వచ్చే15వ ఆర్థిక సంఘం నిధులతోనే కార్మికులకు వేతనాలు, ట్రాక్టర్లకు ఈఎంఐలు, డీజిల్, కరెంట్ బిల్లులు కడుతూ వచ్చారు. ఫిబ్రవరి నుంచి పంచాయతీ అకౌంట్లపై ఫ్రీజింగ్​పెట్టడంతో 15వ ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్‌‌తోపాటు జనరల్ ఫండ్స్‌‌నూ వాడుకోలేకపోతున్నారు. గతేడాది నాలుగో విడత పల్లె ప్రగతిలో భాగంగా సర్పంచులు లక్షలకు లక్షలు అప్పులు తెచ్చి మరీ గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం సహా వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. ఇందుకు సంబంధించి పంపిన చెక్కులన్నింటినీ ట్రెజరీల్లో రిజెక్ట్ చేసి వెనక్కి పంపారు. దీంతో తాము నెలనెలా మిత్తీ కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని, పాత బిల్లులు క్లియర్​చేయాల్సిన సర్కారు ఆ పనిచేయకుండా ఇప్పుడు మళ్లీ పల్లె ప్రగతి చేయాలనడం ఎంతవరకు కరెక్ట్ అని సర్పంచులు నిలదీస్తున్నారు.

ఎక్కడికక్కడ నిలదీతలు

పాత బిల్లులు చెల్లించేదాకా ఐదో విడత పల్లెప్రగతిలో పాల్గొనే ప్రసక్తి లేదని సర్పంచులు అంటున్నారు. ఈ మేరకు తీర్మానాలు చేయడమే గాక ఫండ్స్‌‌పై ఎమ్మెల్యేలు, మంత్రులను నిలదీస్తున్నారు.  ఈ నెల 9వ తేదీన నల్గొండ జిల్లా మునుగోడు సర్పంచ్​మిర్యాల వెంకన్న.. పాలకవర్గ సభ్యులు, పంచాయతీ కార్మికులతో కలిసి గ్రామంలో భిక్షాటన చేశారు. రూ.35 లక్షలకు పైగా అప్పులు తెచ్చి అభివృద్ధి పనులు చేశామని, నెలనెలా 70 వేల మిత్తీ కడ్తున్నామని వాపోయారు. అదే రోజు రాష్ట్ర సర్పంచుల ఫోరం ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు అబ్బన బోయిన లింగయ్య ఆధ్వర్యంలో నల్గొండ అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మను కలిసి వినతి పత్రం అందించారు. 11న పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండల పరిషత్​ఆఫీసులో జరిగిన సమావేశాన్ని అన్ని పార్టీలకు చెందిన సర్పంచులు బహిష్కరించారు.   16న రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల సర్వసభ్య సమావేశంలో సర్పంచులు ఆఫీసర్లను నిలదీశారు. పాత బిల్లులు క్లియర్ చేస్తేనే కొత్త పనులు చేపడుతామని తేల్చి చెప్పారు. 

ఈ నెల 18న జగిత్యాల ఎంపీడీవో ఆఫీస్‌‌లో 15 మందికి పైగా సర్పంచులు సమావేశమై.. పాత ఫండ్స్ ఇచ్చేదాకా కొత్త పనులు చేపట్టబోమంటూ తీర్మానం చేశారు.18న ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ మీటింగ్‌‌లో సర్కారు తీరుపై సర్పంచులు మండిపడ్డారు. అప్పులు చేసి అభివృద్ధి పనులు చేశామని బిల్లులు ఎప్పుడు చెల్లిస్తారో చెప్పాలని నిలదీశారు. 21న నిర్మల్ జిల్లాకు చెందిన సర్పంచులు ఐదో విడత పల్లె ప్రగతి అవగాహన సదస్సును బహిష్కరించారు. పాత బిల్లులు చెల్లిస్తేనే కొత్తగా పనులు చేపడుతామని స్పష్టం చేశారు. సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హామీ ఇవ్వడంతో మీటింగ్‌‌కు హాజరయ్యారు.

సర్కారు పట్టించుకోకపోవడంతో

తమ సమస్యలను సర్కారు, లీడర్లు పట్టించుకోకపోవడంతో సర్పంచులు కలెక్టర్లను ఆశ్రయిస్తున్నారు. సోమవారం కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గునుకుల కొండాపూర్ గ్రామ సర్పంచ్​భర్త లింగంపల్లి బాలరాజు ప్రజావాణిలో అసిస్టెంట్​కలెక్టర్ శ్యామ్​ప్రసాద్​లాల్‌‌కు ఆర్జీ పెట్టుకున్నారు. నాలుగో విడత పల్లె ప్రగతి పనుల కోసం అప్పులు తెచ్చి మరీ రూ.14.7 లక్షలు ఖర్చుపెట్టానని, ఆ బిల్లులు ఇప్పించేలా చూడాలని వేడుకున్నాడు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం తోగ్గూడెం గ్రామపంచాయతీ సర్పంచ్ బాదావత్ శాంతి ఫండ్స్ కోసం గ్రామస్తులతో కలిసి వచ్చి కలెక్టర్​అనుదీప్‌‌కు అర్జీ పెట్టుకున్నారు. పంచాయతీ ఫండ్స్‌‌పై ఫ్రీజింగ్​పెట్టడంతో గ్రామంలో అభివృద్ధి పనులకు కష్టమవుతోందని, ప్రైమరీ స్కూల్ ప్రహరీ నిర్మాణం, సీసీ రోడ్ల కోసం ఫండ్స్ రిలీజయ్యేలా చూడాలని వేడుకున్నారు.

బిల్లులు ఇప్పించండి

గతేడాది పల్లె ప్రగతి పనుల కోసం రూ.14.7 లక్షలు ఖర్చు చేశాం. తెలిసిన కాడల్లా అప్పులు చేసి, ఆఖరికి నా భార్య పది తులాల బంగారాన్ని కుదువ పెట్టి పనులు చేయించినం. ఏడాది గడిచినా బిల్లులు రావడం లేదు. ఇదే రందితో నా భార్య 15 రోజులుగా హాస్పిటల్‌‌లో చేరింది. కనీసం కలెక్టర్​కైనా చెప్పుకుందామని ప్రజావాణికి వచ్చిన. త్వరగా ఫండ్స్ ఇప్పించి, అప్పుల నుంచి విముక్తి కల్పించాలని అడిషనల్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్‌‌కు అర్జీ పెట్టుకున్న.
- లింగంపల్లి బాలరాజు, సర్పంచ్ 

జ్యోతి భర్త, గునుకుల కొండాపూర్, కరీంనగర్ జిల్లా