తెలంగాణ శకటాన్ని మరోసారి మరిచిన రాష్ట్ర సర్కార్

తెలంగాణ శకటాన్ని మరోసారి మరిచిన రాష్ట్ర సర్కార్

హైదరాబాద్, వెలుగు: రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీలోని కర్తవ్యపథ్​లో నిర్వహించే వేడుకలు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తాయి. దేశంలోని భిన్న సంస్కృతులను చాటే శకటాలు, సైనిక సామర్థ్యాలను తెలిపే ప్రదర్శన, అత్యాధునిక విమానాల విన్యాసాలు దేశభక్తిని రేకెత్తిస్తాయి. అలాంటి వేదికపై తమ సంస్కృతి, సంప్రదాయాలు, ప్రత్యేకతను చాటేందుకు ప్రతి రాష్ట్రం ఎంతగానో పోటీపడుతుంది. దాదాపు ఆరు నెలలు ముందుగానే శకట రూపకల్పనపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కసరత్తు  చేస్తాయి. శకట ప్రదర్శన ఎంపికకు ప్రాసెస్ ప్రారంభం కాగానే... ఉత్సవ కమిటీ ఇచ్చే థీమ్ ఆధారంగా శకటం ప్లాన్ చేసుకుంటాయి. రాష్ట్ర ఔన్నత్యాన్ని చాటే ఈ వేదికను తెలంగాణ సర్కారు పూర్తిగా విస్మరించిందని ప్రచారం జరుగుతోంది. గడిచిన ఎనిమిదేండ్లలో రెండుసార్లు మాత్రమే తెలంగాణ శకట ప్రదర్శనకు అవకాశం దక్కింది. తొలిసారిగా 2015లో రాష్ట్ర శకటం కర్తవ్యపథ్ (అప్పటి రాజ్ పథ్)పై మెరిసింది. బోనాల థీమ్​తో ఈ శకటాన్ని ప్రదర్శించి తెలంగాణ ప్రత్యేకతను దేశం నలుమూలలా చాటారు. తర్వాత 2020లో మరోసారి శకటాన్ని ప్రదర్శించే అవకాశం రాష్ట్రానికి దక్కింది. అప్పుడు బతుకమ్మ, వేయి స్తంభాల ఆలయం, మేడారం సమక్క–సారలమ్మ జాతర రూపకంతో శకటాన్ని ప్రదర్శించారు. ఇక 2021, 2022లో శకటాన్ని ప్రదర్శించలేదు. గత కొన్నేండ్లుగా రాష్ట్ర సర్కారు రాజకీయాల్లో బిజీగా ఉంది. అందువల్లే గత మూడేండ్లుగా అసలు శకటాల డిజైన్లు కూడా పంపించడం లేదని తెలిసింది. ఈసారి  శకటాల ప్రదర్శనకు కూడా రాబోమని లెటర్ కూడా ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా, 2016, 2017, 2018, 2019లో డిజైన్లు పంపినా... అవి మొక్కుబడిగా ఉండడంతో తొలి దశలోనే నిష్క్రమించాయని అధికారులు పేర్కొన్నారు.

ఏపీకి నాలుగోసారి

రాష్ట్ర విభజన తర్వాత ఏపీ సర్కారు నాలుగోసారి తన శకటాన్ని ప్రదర్శించబోతున్నది. గతంలో 2015, 2020, 2021లో ఏపీకి ఈ అవకాశం దక్కింది. కాగా, ఈసారి ఉత్సవ కమిటీ చిరుధాన్యాలు, సంస్కృతి, హార్టికల్చర్, మరో రెండు విభాగాల్లో శకటాలను ఆహ్వానించింది. అయితే ‘ప్రబలతీర్థ’ థీమ్ తో ఏపీ శకటాన్ని రూపొందించింది. ఈసారి ఆరు దశల్లో శకటాల ఎంపిక జరగగా అన్నింట్లోనూ ఏపీ ముందు వరుసలో నిలిచింది.

ఎంపిక ఇలా...

రక్షణ శాఖ ఆధ్వర్యంలోని ఉత్సవ కమిటీ ఈ శకటాల బాధ్యతలు చూస్తుంటుంది. కర్తవ్య్ పథ్​పై ప్రదర్శించే శకటాలను ఈ కమిటీయే ఎంపిక చేస్తుంది. ఏటా సెప్టెంబర్​లో శకటాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలకు సమాచారం ఇస్తుంది. దీని ఆధారంగా ప్రభుత్వాలు కేంద్రం కోరిన థీమ్​లో శకట నమూనాలను పంపిస్తాయి. ఐదు, ఆరు దశల తర్వాత ఉత్సవ కమిటీ శకట తయారీకి ఆమోదం చెబుతుంది. ఆమోదం పొందిన శకటాలను పారామిలటరీ అధీనంలోని ‘రంగశాల’లో దాదాపు నెల పాటు రూపొందిస్తారు. ఫైనల్ గా వాటిని రిపబ్లిక్​ వేడుకల్లో ప్రదర్శిస్తారు.