గ్రూప్ 4లో టైపిస్ట్, స్టెనో ఖాళీలు చూపని సర్కార్... ఆందోళనలో అభ్యర్థులు

గ్రూప్ 4లో  టైపిస్ట్, స్టెనో  ఖాళీలు చూపని సర్కార్... ఆందోళనలో అభ్యర్థులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు ఆఫీసుల్లో టైపిస్ట్ పోస్టులకు మంగళం పాడినట్టేనా? వాటిని నింపే ఆలోచనను సర్కారు విరమించుకున్నట్టేనా? అంటే అవుననే చెప్తున్నాయి ప్రభుత్వ వర్గాలు. ఇటీవల రిలీజ్ చేసిన గ్రూప్ 4లో టైపిస్ట్ పోస్టులను చూపించకపోవడంతో ఆ వాదనలకు మరింతబలం చేకూరుతోంది. సర్కారు నిర్ణయంతో వేలాదిమంది టైపింగ్ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. 

అభ్యర్థులకు అడియాస..

రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 90వేల ఉద్యోగాల భర్తీకి చర్యలు మొదలుపెట్టింది. టీఎస్​పీఎస్సీతో పాటు పలు బోర్డులు పోస్టులను భర్తీ చేసే పనిలో ఉన్నాయి. అయితే రెండేండ్ల కింది నుంచే సర్కారు ఉద్యోగ ప్రకటనలు చేస్తుందనే ఊహాగానాలు రావడంతో టైపిస్ట్ పోస్టులకు చాలామంది కోచింగ్ బాటపట్టారు. స్టేట్ బోర్డు ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ తెలంగాణ(ఎస్​బీటెట్) ద్వారా టైప్​ రైటింగ్ అండ్ షార్ట్ హాండ్ కోర్సుల్లో పట్టాలు పొందారు. ప్రతి 6 నెలలకు ఆరేడు వేలమంది పరీక్ష రాస్తున్నారు. టీఎస్​పీఎస్సీ ద్వారా గతేడాది 2021 మార్చి 31న వెటర్నరీ వర్సిటీ, అగ్రికల్చర్ వర్సిటీల్లో 112 జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. స్టెనో పోస్టులను 2018 జూన్​లో రిలీజ్ చేసిన నోటిఫికేషన్​ ద్వారా లాండ్ అడ్మినిస్ట్రేషన్, హోం డిపార్ట్​మెంట్​లో 19 పోస్టులను నింపింది. కానీ ఆ తర్వాత స్టెనో పోస్టులను, టైపిస్ట్ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లు ఇవ్వలేదు. తాజాగా ఇచ్చిన గ్రూప్​4  నోటిఫికేషన్​లో 9 వేలకు పైగా పోస్టులు భర్తీ చేస్తామని సర్కారు ప్రకటించడంతో భారీగా టైపిస్ట్, స్టెనో పోస్టులుంటాయని అభ్యర్థులు భావించారు. తీరా నోటిఫికేషన్​ విడుదలయ్యాక ఆ పోస్టులు లేకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. 

మంత్రులను కలిసినా ఫలితం లేదు..  

రాష్ట్రంలోని పలు డిపార్ట్​మెంట్లలో టైపిస్ట్ పోస్టులన్నీ ఖాళీగానే ఉన్నా, వాటిని భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు. కొత్తగా మండలాలు, జిల్లాలు పెరగడంతో పాటు వర్సిటీల్లోనూ భారీగా టైప్ రైటర్, స్టెనోగ్రాఫర్ పోస్టులుంటాయని అంతా భావించారు. కానీ కొన్ని డిపార్ట్​మెంట్లు జూనియర్ అసిస్టెంట్ పోస్టుల్లో క్లబ్ చేసినట్టు చెప్తున్నారు. అయితే ఇప్పటికీ వివిధ కోర్టుల్లో టైప్ రైటర్ పోస్టులను భర్తీ చేస్తున్నప్పుడు, మిగిలిన ఆఫీసుల్లో ఎందుకు భర్తీ చేయరని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ఏండ్ల పాటు కష్టపడి టైపింగ్ ఎగ్జామ్స్ లో క్వాలిఫై అయ్యామని, ఇప్పుడు ఆ పోస్టులను నింపకపోవడం సరికాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మంత్రులు హరీశ్​రావు, సబితాఇంద్రారెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులను కలిసినా ఫలితం లేదని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే గ్రూప్ 3, గ్రూప్​ 4 నియామకాల్లో టైపిస్ట్ పోస్టులను కొనసాగించి, భర్తీ చేయాలని వారంతా కోరుతున్నారు.