మీ ఇల్లెంత..జాగెంత?..హడావుడిగా ఊర్లమీద పడి ఆస్తుల లెక్కల తీస్తున్న సర్కార్

మీ ఇల్లెంత..జాగెంత?..హడావుడిగా ఊర్లమీద పడి ఆస్తుల లెక్కల తీస్తున్న సర్కార్
  • ఇంటి నంబర్​ మొదలు ఆధార్,  ఫోన్​ నంబర్​,
  • బ్యాంక్​ ఖాతా దాకా అన్నీ రాసుకపోతున్న ఆఫీసర్లు
  • ఇండ్లు, ప్లాట్ల కొలతలు.. 50కి పైగా ప్రశ్నలు ఆస్తుల వివరాలు,
  • వ్యక్తిగత సమాచారం సేకరణ ఫొటోలు, గుర్తింపు కార్డుల కోసం దబాయింపులు
  • ఒక్కో దగ్గర ఒక్కో రకం సర్వే ఫారాలు

‘‘ఈ  ఇల్లు మీదేనా? యజమాని ఎవరు..ఎంత ఏరియాలో ఇల్లు కట్టిండ్రు..రిజిస్ట్రేషన్​ డాక్యుమెంట్లు ఉన్నయా..ట్యాక్స్​ కడుతున్నరా? ఆస్తులెన్ని ఉన్నయ్​..ఆధార్​కార్డ్ నంబర్​ ఎంత?  ఫోన్​ నెంబర్​ ఎంత..బ్యాంక్​ అకౌంట్​ నంబర్​ ఏంది..ఎంత మందికి పెన్షన్​ వస్తున్నది..’’..ఇట్ల ఒకటి కాదు.. రెండు కాదు.. 50కి పైగా ప్రశ్నలతో ఆగమేఘాల మీద సోమవారం రాష్ట్ర ప్రభుత్వం కొత్త సర్వే మొదలుపెట్టింది. సర్వే సిబ్బంది అడిగే ప్రశ్నలకు జనం బెంబేలెత్తిపోతున్నారు. అసలు ఎందుకు సర్వే చేస్తున్నరో, వ్యక్తిగత వివరాలతోపాటు ఆధార్​ నంబర్​, బ్యాంకు ఖాతాల నంబర్​ ఎందుకు చెప్పాలంటున్నారో అర్థం కాక పరేషాన్​ అవుతున్నారు. సకల జనుల ఆస్తుల వివరాలు రాబట్టేలా ఈ సర్వే ఉండటం జనంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాలు చెప్పాలంటూ బలవంత పెట్టడం వారిని భయాందోళనకు గురిచేస్తున్నది.

వెలుగు నెట్వర్క్రాష్ట్రవ్యాప్తంగా పలు మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో చడీచప్పుడు లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం సర్వేను స్టార్ట్ చేసింది. సోమవారం ఉదయం నుంచే ఇంటింటి తలుపు తట్టి ప్రజలందరి పుట్టు పూర్వోత్తరాలు, కుటుంబసభ్యుల వివరాలు, ఆస్తుల వివరాలు.. సేకరించే పనిలో పడింది. జీవోలు, నిర్ణీత సర్వే ఫారాలు, కనీస ముందస్తు సమాచారమేమీ లేకుండా సర్వే సిబ్బంది రకరకాల ప్రశ్నలు వేయటంతో అన్ని చోట్ల జనం ఆందోళనకు గురయ్యారు. కొన్ని పట్టణాల్లో సర్వే ఫారాలు ఇంగ్లిష్​లో.. మరికొన్ని చోట్ల తెలుగులో ఉన్నాయి.

2 రోజుల్లోనే పూర్తి.. ఇష్టమొచ్చినట్లు ఫారాలు

సడన్​ సర్వే రకరకాల అనుమానాలకు తెరలేపింది. ప్రభుత్వం ఎందుకు ఈ సర్వే చేస్తుందో తమకు కూడా తెలియదని చాలాచోట్ల ఇంటింటికి వెళ్లిన సిబ్బంది అన్నారు. కేవలం రెండు రోజుల్లోనే తమను సర్వే పూర్తి చేయాలని ఆఫీసర్లు ఆదేశించినట్లు వారు చెప్పారు. దీంతో ఇంత ఆగమాగం ఆస్తులను ఎందుకు వెల్లడించాలో తెలియడం లేదని, ప్రభుత్వానికి ఇంకేదో హిడెన్​ ఎజెండా ఉండొచ్చని పలు ప్రాంతాల్లో ప్రజలు సర్వే సిబ్బందిని నిలదీస్తున్నారు.ఒక్కో చోట ఒక్కో రకంగా సర్వే ఫారాలు ఉంటున్నాయి. జనగాం మున్సిపాలిటీలో ‘గృహ యజమానుల సర్వే సేకరణ వివరాలు’ అని సర్వే ఫారమ్​పై ఉండగా, కొన్ని చోట్ల ఇంగ్లిష్​లో ‘ప్రాపర్టీ టాక్స్​ సర్వే షీట్​’ అని ముద్రించి ఉంది. ఉదాహరణకు యాదగిరిగుట్ట, తొర్రూర్​ మున్సిపాలిటీ పరిధిలో ధరణి సర్వే ప్రొఫార్మా పేరుతో ఇంగ్లిష్  ఫారాలు వాడారు. నల్గొండ జిల్లాలో ‘గృహ యజమానుల సర్వే’ వివరాలంటూ తెలుగు ఫారాలు నింపారు. కొన్ని చోట్ల యజమాని ఫొటో కావాలని అడిగి తీసుకున్నారు. ఇంకొన్ని చోట్ల ‘ఫొటోలేమీ వద్దు.. మీరు సంతకం చేయండి’ అని చెప్పి సర్వే ఫారాలపై సంతకాలు చేయించుకున్నారు. తెలంగాణ ఏర్పడ్డ కొత్తలో ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేపట్టింది. 2014 ఆగస్టు 19న ఒక్కరోజే ఇంటింటికీ సర్వే చేయించింది. అప్పుడు ముందుగానే సర్వే నమూనా ఫారాలను విడుదల చేసి.. ముందుగా ప్రజలందరికీ సర్వే ఎందుకు చేస్తున్నామో బహిరంగంగా వెల్లడించింది. కానీ ఈసారి రహస్యంగా, ఆకస్మికంగా సర్వే చేయటంతో ఆఫీసర్లు ఎవరికి తోచినట్లుగా వాళ్లు సర్వే ఫారాలు ముద్రించుకున్నట్లు అర్థమవుతున్నది.

50కిపైగా ప్రశ్నలు

ధరణి  వెబ్​సైట్​లో అందరి భూముల వివరాలున్నాయని మూడేండ్లుగా చెబుతున్న ప్రభుత్వం.. ఈ కొత్త సర్వేలో ఏకంగా 53 ప్రశ్నలు వేయటం, జనాభా లెక్కల సర్వేకు మించిన తరహాలో ప్రశ్నల ద్వారా వివరాలు ఆరా తీస్తున్నది. సర్వే ఫారాల్లో 53 ప్రశ్నల నుంచి 45 వరకు ఉన్నాయి. పేరు, ఇంటిపేరు, తండ్రిపేరు, ఆధార్​ నంబర్, కులం, ఇంటి నంబర్​తో పాటు ఈ–మెయిల్, ఇంటి చిరునామా,  ఫోన్​ నంబర్​, రెవెన్యూ వార్డు నంబర్, ఎలక్షన్​ వార్డు నంబర్​, కరెంట్​ బిల్లు నంబర్, వాటర్​ కనెక్షన్​ నంబర్, ప్రాపర్టీ సర్వే నంబర్, ప్రాపర్టీ టైప్​ (ఖాళీ స్థలం, ఇల్లు, అపార్ట్​మెంట్​, కమర్షియల్​ బిల్డింగ్​), ఆస్తి విస్తీర్ణం, అది వారసత్వంగా వచ్చిందా.. పంచుకోవటం ద్వారా వచ్చిందా.. గిఫ్ట్​గా వచ్చిందా.. కొనుగోలు చేసిందా.. అని సర్వే ఫారంలో ప్రశ్నలున్నాయి. వీటితోపాటు ఇంటి మొత్తం విస్తీర్ణం, అందులో నిర్మాణ విస్తీర్ణం ఎంత..? ఖాళీ స్థలమైతే ఆబాదీనా, ప్రైవేటా, ప్రభుత్వ భూమా, లేదా అసైన్​ చేసిందా.. అని ఫిల్​ చేయాలని ఉంది. వీటికి తోడు కుటుంబ సభ్యుల వయస్సు, ఆధార్​ నంబర్లు, మొబైల్​ నంబర్లు, యజమానితో ఉన్న సంబంధమేమిటో వివరించాలనే కాలమ్​లున్నాయి. యజమాని గుర్తింపు కార్డుగా పట్టాదార్​ పాస్​బుక్​, ఆహార భద్రత కార్డు, జన్​ధన్​ బ్యాంక్​ అకౌంట్, ఆసరా పెన్షన్, జాబ్​ కార్డు వివరాలు పొందుపరచాలని సర్వేలో పేర్కొన్నారు.

ఆఫీసర్లకు, స్టాఫ్​కూ క్లారిటీ లేదు

కొందరు ఇంటి ఓనర్లు రివర్స్​లో అడిగిన ప్రశ్నలకు సర్వే ఆఫీసర్లు, స్టాఫ్​ వద్ద సమాధానం లేకుండా పోయింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలోని ఓ ఇంటికి వెళ్లిన ఆఫీసర్​ను యజమాని.. తనకున్న 150 గజాల జాగలో 80 గజాల్లో ఇల్లు ఉందని, మిగిలిన 70 గజాల ఖాళీ స్థలాన్ని ఎందుకు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. తన దగ్గరున్న సర్వే ఫామ్​లో ఆ విషయం లేదని, ఇంటి ఏరియా మాత్రమే  తీసుకుంటున్నానని సర్వే సిబ్బంది చెప్పారు. దీంతో ఆ ఇంటి ఆసామి సీరియస్​ అయ్యారు. 70 గజాల ఖాళీ జాగా కొత్తగా ఇచ్చే పింక్​ పాస్​ బుక్​లో ఎక్కకపోతే తాను లాస్​ అవుతాను కదా? అని నిలదీశారు. మరో ఇంటి యజమాని పదేండ్ల క్రితం చనిపోయాడు. ఇప్పుడాయన ఇద్దరు కొడుకుల్లో యజమానిగా ఎవరిపేరు నమోదు చేయాలనే ప్రాబ్లమ్​ వచ్చింది. ఇలాంటి సమస్యలుంటే సిబ్బంది అరకొర సమాచారం తీసుకొని వెళ్లిపోతున్నారు. దీని వల్ల భవిష్యత్​లో తమకు సమస్యలు వస్తాయని పబ్లిక్​ఆందోళన చెందుతున్నారు.

కొన్ని చోట్ల ఖాళీ ప్లాట్లనూ కొలుస్తున్నరు

కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి, జమ్మికుంట, హుజూరాబాద్ మున్సిపాలిటీల్లో  ఓపెన్​ ప్లాట్ల వివరాలు తీసుకున్నారు. దీంతో వీటికి వీఎల్​టీ టాక్స్​ వేస్తారేమోనని పబ్లిక్​ భయపడుతున్నారు. పాత ఇంటి నంబర్లపై రిజిస్ట్రేషన్ చేసుకున్న ఇండ్లు కూలిపోయి ఉంటే వాటి గురించి ఒకటికి రెండుసార్లు గుచ్చి గుచ్చి వివరాలు అడుగుతున్నారు. ‘ పర్మిషన్లు ఏ సంవత్సరం తీసుకున్నారు?  జాగ ఖాళీగా ఎందుకుంది?’ అని ఆరా తీస్తున్నారు. గతంలో ఎంతో కొంత  ఫీజు చెల్లించి పర్మిషన్​ తీసుకొని ఇండ్లు కట్టుకునేవాళ్లమని, ఇప్పుడు గజాల చొప్పున కొలవడం ఏంటని జనం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అసైన్డ్​ భూముల్లోని ఇండ్లపై టెన్షన్​

అర్బన్​, రూరల్​ ఏరియాల్లో ప్రభుత్వం దశాబ్దాల కింద ఇచ్చిన అసైన్డ్​ ల్యాండ్స్​లో పలువురు ఇండ్లు కట్టుకొని ఆర్థిక పరిస్థితి బాగాలేక అమ్ముకున్నారు. ఇప్పటికే ఇవి పలువురి చేతులు మారగా,తాజా సర్వేలో ఆ వివరాలను ఆఫీసర్లు ఆరా తీస్తున్నారు. దీనిపై అటు అమ్మినవారిలోనూ ఇటు కొన్నవారిలోనూ టెన్షన్​ నెలకొంది. తమకు ఇచ్చే పాస్​బుక్​లలో అసైన్డ్​ ల్యాండ్​ అని ఉంటే అన్నివిధాలా నష్టపోతామని చెబుతున్నారు. కోల్​బెల్ట్​లోనూ ఇలాంటి సమస్యే ఉంది. గోదావరిఖని, బెల్లంపల్లి, మందమర్రి, కొత్తగూడెం మున్సిపాలిటీల్లోని సింగరేణి స్థలాల్లో ఇండ్లు కట్టుకున్నవారైతే తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పట్టాలిస్తామని సర్వే చేసినా ఇవ్వలేదని, ఇప్పుడు మళ్లీ ఈ కొత్త సర్వే ఎందుకోసమని ప్రశ్నిస్తున్నారు.

ఆస్తులపై కొత్త లొల్లులు.. వ్యక్తి స్వేచ్ఛకు ప్రమాదం

‘‘మాకు మూడెకరాల ఖాళీ స్థలం ఉంది.. అది ఉమ్మడి ఆస్తి. ఊర్లో ఉన్న మా బ్రదర్.. ఆస్తి మొత్తం తనదేనని సర్వేకు వెళ్లిన వారికి చెప్తే పరిస్థితి ఏంటి? ఆ ఆస్తిలో నా వాటా పోయినట్లేనా..? ఎవరి పేరు మీద ఆస్తి ఉందో ప్రభుత్వం దగ్గర రికార్డులున్నాయి కదా..? ఈ సర్వే ఉమ్మడి కుటుంబాల మధ్య కొత్త చిచ్చు పెట్టేటట్లే ఉంది..’’ అని ఓ ఆఫీసర్​ మండిపడ్డారు. ఆధార్, బ్యాంక్​ అకౌంట్ సహా అన్ని వివరాలను తెలుసుకునేందుకు ప్రభుత్వం చేపట్టిన ఈ సర్వేతో తమ స్వేచ్ఛకు భంగం వాటిల్లుతుందనే అభిప్రాయాలు జనంలో వ్యక్తమవుతున్నాయి. వ్యక్తిగత సమాచారం రాబట్టడం వెనుక ప్రభుత్వానికి దురుద్దేశం ఉందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కుటుంబాల్లో కొత్త లొల్లులు

ఊళ్లలో చాలా ఇండ్లు చనిపోయినవారి పేర్ల మీదే కొనసాగుతున్నాయి. ఒకే ఇంట్లో ఇద్దరు, ముగ్గురు కుమారులు ఉంటే.. వాళ్ల కుటుంబాలు అదే ఇంట్లో వేర్వేరు గదుల్లో కాపురం ఉంటున్నారు. ఓనర్ చనిపోవడం, ఆ ఇల్లు, ఇంటి స్థలం అన్నదమ్ముల పొత్తులోనే ఉండడంతో దానిని ఎవరి పేరు మీద రాయాలనేది పంచాయతీ కార్యదర్శులకు సమస్యగా మారింది. కుటుంబంలో ఒకరి పేరు మీద రాస్తే అన్నదమ్ముల మధ్య గొడవలు జరగడంతోపాటు అది తమ మెడకు చుట్టుకునే ప్రమాదం ఉందని వారు భయపడుతున్నారు. ఇలాంటి ఇండ్లను చనిపోయిన వ్యక్తి పేరు మీదనే రాస్తూ.. రిమార్క్స్ కాలమ్ లో డిస్ప్యూట్ అని నమోదు చేస్తున్నారు. వివాదం అని రాస్తే భవిష్యత్ లో ఎలాంటి సమస్య వస్తుందోనని ఆయా కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

పాత ఇండ్లకు కాగితాలు ఎక్కడ్నుంచి తేవాలె

గవర్నమెంట్ చేస్తున్న ఈ సర్వే వల్ల మా లాంటి వాళ్లకు టెన్షన్​ మొదలైంది. ఎప్పుడో కట్టుకున్న పాత ఇండ్లకు ఎలాంటి డాక్యుమెంట్లు లేవు. కేవలం ఇంటి నంబర్లు తప్ప ఇల్లు మాదేనని నిరూపించుకోవడానికి ఏ ఆధారం లేదు. సర్వేకు వచ్చిన ఆఫీసర్లు  డాక్యుమెంట్స్​ ఉన్నయా? అని అడుగుతున్నరు. కచ్చితంగా కావాలని అడిగితే ఎక్కడి నుంచి తెస్తం. మా ఇల్లు మాకు దక్కుతుందో ? లేదో అర్థం కావట్లేదు.

– మునిగాల చందు, భూపాలపట్నం, చొప్పదండి, కరీంనగర్​ జిల్లా

ముమ్మాటికీ ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే

ధరణి పేరుతో వ్యక్తిగత వివరాలను వెబ్‌సైట్‌లో పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం రచ్చ చేస్తున్నది. ప్రాపర్టీ అనేది వ్యక్తిగతమైన అంశం. అది బయటకు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలకు సంబంధించి వివరాలు ఒత్తిడి చేసి తీసుకునే అథారిటీ స్టేట్‌ గవర్నమెంట్‌కు లేదు. కనీసం ఆధార్‌ కార్డు కూడా తీసుకునే అధికారం లేదు. ప్రైవేట్ ప్రాపర్టీ నమోదు చేయాల్సిన అవసరం ఏముంది? ఇది ముమ్మాటికీ ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందికే వస్తుంది.

– రాపోలు భాస్కర్, హైకోర్టు అడ్వొకేట్