పాటియాలలో ఉద్రిక్తత.. ఇంటర్నెట్ సేవలు బంద్ 

పాటియాలలో ఉద్రిక్తత.. ఇంటర్నెట్ సేవలు బంద్ 

కాళీ మాత ఆలయం వెలుపల ఇరు వర్గాల మధ్య ఘర్షణ 
ఉద్రిక్తతల నేపథ్యంలో భగవంత్ మాన్ సర్కార్ కీలక నిర్ణయం

పంజాబ్ : పాటియాలలోని కాళీ మాత ఆలయం వెలుపల ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాటియాల నగర వ్యాప్తంగా 11 గంటల పాటు కర్ఫ్యూ విధించింది. రాత్రి 7 గంటల నుంచి కర్ఫ్యూ అమలు చేసింది. నిత్యావసరాల సరుకులు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది.

శాంతిభద్రతలను అదుపులోకి తీసుకురావడంలో విఫలం చెందారని పోలీస్ డిపార్ట్ మెంట్ లోని ముగ్గురు ఉన్నతాధికారులపై భగవంత్ మాన్ సర్కార్ వేటు వేసింది. పాటియాల రేంజ్ ఐజీ, పాటియాల ఎస్ఎస్ పీ, ఎస్ పీలను ఆ పదవి నుంచి బదిలీ చేసింది. 

మరోవైపు ఘర్షణల కారణంగా శాంతి భద్రతలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాటియాల జిల్లాలో శనివారం ఉదయం 9 : 30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు వాయిస్ కాల్స్ మినహా మొబైల్ ఇంటర్నెట్, SMS సేవలను నిలిపి వేస్తున్నట్లు ప్రకటించింది. 

పాటియాలలోని కాళీ మాత ఆలయం వెలుపల ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. పాటియాలలో ఓ నిషేధిత గ్రూపునకు వ్యతిరేకంగా మరో గ్రూపు చేపట్టిన ర్యాలీ అల్లర్లకు కారణమైంది. రెండు గ్రూపులు పరస్పరం రాళ్లు రువ్వుకుని.. కత్తులు దూసుకున్నాయి. ఈ ఘటనలో చాలామందికి గాయాలయ్యాయి. ఇద్దరు పోలీసులు కూడా గాయపడినట్లు తెలుస్తోంది. పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసులు చాలా శ్రమించాల్సి వచ్చింది. గాల్లోకి కాల్పులు జరిపి, గుంపులుగా ఉన్న ఆందోళనకారులను చెదరగొట్టి.. పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చారు. స్థానికులందరూ శాంతియుతంగా ఉండాలంటూ కోరారు. పోలీసులు పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చినప్పటికీ పలుచోట్ల ఇంకా ఉద్రిక్తత నెలకొంది.