కాళేశ్వరం అప్పుల రీపేమెంట్ 2035 వరకు..

కాళేశ్వరం అప్పుల రీపేమెంట్ 2035 వరకు..

హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర సర్కార్ కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తీసుకున్న అప్పులను 2035 ఆగస్టు వరకు తిరిగి చెల్లించాల్సి ఉంది. సమాచార హక్కు చట్టం కింద కరీం అన్సారీ అనే వ్యక్తి దరఖాస్తు చేయగా.. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ, గజ్వేల్ ఈఎన్సీ హరిరామ్ వివరాలు వెల్లడించారు. కాళేశ్వరం ఎత్తిపోతల కోసం రూ.87,422.53 కోట్లు, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలకు రూ.10 వేల కోట్ల అప్పులను బ్యాంకులు, నాబార్డు, ఫైనాన్స్ సంస్థల నుంచి సర్కార్ తీసుకుంది. యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంకుల ఆధ్వర్యంలోని కన్సార్షియమ్ నుంచి రూ. 20,950 కోట్ల అప్పు తీసుకోగా.. 8.25 శాతం వడ్డీతో కలిపి పోయినేడాది జూన్ నుంచి రీపేమెంట్ చేస్తున్నారు. ఈ అప్పును 2034 మార్చి వరకు ప్రతి మూడు నెలలకు ఒక ఈఎంఐ చొప్పున చెల్లించాల్సి ఉంది.

పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నాలుగు విడతల్లో కలిపి రూ.27,737.08 కోట్ల లోన్ ఇవ్వగా, 9.20 శాతం నుంచి 10.9 శాతం వరకు వడ్డీగా చెల్లించాలి. ఈ లోన్ల రీపేమెంట్ పోయినేడు అక్టోబర్ నుంచి ప్రారంభం కాగా, 2034 జులై వరకు చెల్లించాల్సి ఉంది. నాబార్డు మూడు విడతల్లో రూ.8,198.97 కోట్ల లోన్ ఇవ్వగా, 7.8 శాతం నుంచి 9.75 శాతం వరకు వడ్డీ చెల్లించాలి. ఈ లోన్ల రీపేమెంట్ పోయినేడు జూన్ నుంచి ప్రారంభం కాగా, 2035 ఆగస్టు వరకు చెల్లించాల్సి ఉంది. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ మూడు విడతల్లో రూ.30,536.08 కోట్ల లోన్ ఇవ్వగా, 10.9 శాతం వడ్డీతో 2035 ఆగస్టు వరకు రీపేమెంట్ చేయాలి. పాలమూరు–రంగారెడ్డి కోసం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ రూ.10 వేల కోట్ల లోన్ ఇవ్వగా, 10.9 శాతం వడ్డీతో రీపేమెంట్ చేయాలి. వచ్చే ఏడాది అక్టోబర్ నుంచి 2039 సెప్టెంబర్ వరకు ఈ లోన్ తిరిగి చెల్లించాల్సి ఉంది.