పోలవరం పూర్తయితే భద్రాచలానికి బ్యాక్ వాటర్ ముప్పు

పోలవరం పూర్తయితే భద్రాచలానికి బ్యాక్ వాటర్ ముప్పు

హైదరాబాద్: పోలవరం బ్యాక్ వాటర్ పై అధ్యయనం చేయాలని కోరుతూ పోలవరం అథారిటీకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ప్రాజెక్టు పూర్తయితే భద్రాచలానికి బ్యాక్‌వాటర్ ముప్పు ఉందన్న తెలంగాణ ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్‌సీ).. బ్యాక్ వాటర్ ప్రభావంపై స్వతంత్ర సంస్థ ద్వారా అధ్యయనం చేయాలని కోరారు. ఎఫ్ఆర్ఎల్ వద్ద నీటి నిల్వ ఉంటే ముంపు ఎక్కువ ఉంటుందని, ముర్రేడువాగు, కిన్నెరసాని నదుల పరిసరాలు మునుగుతాయని లేఖలో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. రక్షణ కట్టడాలు నిర్మించి నివారణ చర్యలు చేపట్టాలని కోరిన ఈఎన్‌సీ... బ్యాక్‌వాటర్‌తో ఏర్పడే ముంపును నివారించాలని కోరింది. 

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకే కాకుండా తెలంగాణకూ ముంపు ముప్పు పొంచి ఉందని, ఆయా రాష్ట్రాలతో సమానంగా ఇక్కడా నష్టనివారణ చర్యలు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్‌ చేస్తోంది. మెుదట పోలవరం ప్రాజెక్టును 36 లక్షల క్యూసెక్కుల సామర్థ్యంతో డిజైన్‌ చేశారు. అనంతరం 50 లక్షల క్యూసెక్కులకు పెంచారు. అంటే అదనంగా 14 లక్షల క్యూసెక్కులు పెంచారు. వరదల ధాటికి.. ముంపు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని,  ఈ ప్రభావం భద్రాచలంపై పడనుందని రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి వాదిస్తోంది.  ఈ నేపథ్యంలోనే ముంపుపై మరింత శాస్త్రీయ అధ్యయనం చేయాలని పోలవరం అథారిటీని కోరుతోంది.