త్వరలో జే బ్లాక్లోకి మినిస్టర్ల పేషీలు!
విమర్శలు, కోర్టు స్టేతో సర్కార్ కొత్త ఆలోచన
సంక్రాంతి తర్వాత జే బ్లాక్కు రిపేర్లు మొదలు
కొత్త సెక్రటేరియట్ కట్టేదాకా అక్కడే..
హైదరాబాద్, వెలుగు: కొత్త సెక్రటేరియట్ నిర్మాణం ఆలస్యమవుతుండటం, మంత్రుల ఆఫీసులు పుట్టకొక్కటి చెట్టుకొకటి ఉండటంపై విమర్శలు వస్తుండటంతో మళ్లీ పాత సెక్రటేరియట్‌ను ఓపెన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. జే బ్లాక్‌లో మంత్రులందరి చాంబర్లను ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలిసింది. కొత్త సెక్రటేరియట్ నిర్మాణం పూర్తయ్యే వరకు మినిస్టర్స్ ఆఫీసులన్నీ జే బ్లాక్‌లో కొనసాగించే అవకాశం ఉందని సెక్రటేరియట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇప్పటికే జే బ్లాక్ రిపేర్ కోసం సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)కు సూచనలు అందినట్లు తెలుస్తోంది.
బీఆర్కే భవన్లో ఆఫీసర్లు..జే బ్లాక్‌లో మినిస్టర్స్!
సెక్రటేరియట్‌ను కూల్చి.. కొత్త సెక్రటేరియట్‌ను కట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత సెక్రటేరియట్‌లోని డిపార్ట్మెంట్లు, సెక్రటరీల ఆఫీసులు బీఆర్కే భవన్‌కు షిఫ్టయ్యాయి. మినిస్టర్లు ఒక్కొక్కరూ ఒక్కో చోట నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నారు. దీంతో ఆఫీసర్లకు, మంత్రులకు మధ్య దూరం పెరిగి కార్యకలాపాలు సరిగ్గా సాగడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఏదైనా రివ్యూలు ఉన్నప్పుడు మాత్రమే సెక్రటరీలు మంత్రులను కలుస్తున్నారని, మంత్రులు కూడా తాము ఏర్పాటు చేసుకున్న పేషీలకు రావడం తగ్గించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సెక్రటేరియట్ కూల్చివేతపై హైకోర్టు తాత్కాలిక స్టే ఇవ్వడంతో కొత్త సెక్రటేరియట్నిర్మాణం ఇప్పట్లో సాధ్యమయ్యేలా లేదు. దీంతో పాలనలో వస్తున్న ఇబ్బందులు, విమర్శల నుంచి బయటపడటానికి మంత్రులందరి చాంబర్లను పాత సెక్రటేరియట్‌లోని జే బ్లాక్‌లో కొనసాగించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. పైగా అధికారుల ఆఫీసులు ఉన్న బీఆర్కే భవన్ కూడా సెక్రటేరియట్‌కు దగ్గరగా ఉండటంతో మంత్రులకు అధికారులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని, మంత్రుల రివ్యూలకు సమస్యలు ఉండవని భావిస్తోంది.
రిపేర్ల కోసం జీఏడీకి ఆదేశాలు!
రాష్ట్ర విభజన తర్వాత సెక్రటేరియట్‌లోని జే బ్లాక్ ను ఏపీకి కేటాయించారు. జగన్ ఏపీ సీఎం అయ్యాక ఆ బ్లాక్‌ను తెలంగాణకు అప్పగించారు. ఆ బ్లాక్ లో అన్ని సౌలతులు ఉన్నాయి. దానిలో మంత్రుల పేషీలు ఏర్పాటు చేస్తే పెద్ద ఖర్చు ఉండదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. జే బ్లాక్ ను రిపేర్ చేయాలని సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ)కు ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. సంక్రాంతి తర్వాత జీఏడీ అధికారులు జే బ్లాక్ లో రిపేర్లు చేసే చాన్స్ ఉంది. రిపేర్లు పూర్తయ్యాక ఆ బ్లాక్లోకి మంత్రులందరి చాంబర్లు రావొచ్చని సెక్రటేరియట్ వర్గాలు అంటున్నాయి.
జే బ్లాక్ అడ్డుకాదు
కొత్త సెక్రటేరియట్‌ను ప్రస్తుతం ఉన్న సీ, డీ, బీ, ఏ బ్లాక్ ప్రాంతంలో నిర్మించే విధంగా కొన్నిరోజుల క్రితం సీఎం కేసీఆర్ భూమి పూజ చేశారు. కోర్టు కేసు తేలగానే ఆ బ్లాక్ లను కూల్చాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు ఓ అధికారి చెప్పారు. బ్లాకుల కూల్చివేతలకు, కొత్త సెక్రటేరియట్ నిర్మాణ పనులకు జే బ్లా క్ లో మంత్రుల చాంబర్లు అడ్డురావని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో కొత్త సెక్రటేరియట్ నిర్మాణం పూర్తయ్యే దాకా మంత్రులంతా ఇప్పుడున్న సెక్రటేరియెట్‌లోని జే బ్లాక్ నుంచి కార్యకలాపాలు కొనసాగించేలా చర్యలు తీసుకుంటున్నట్లు జీఏడీ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే రిపేర్లు ప్రారంభమయ్యే అవకాశం ఉందని అంటున్నాయి.

